బిజేపితో తెలుగుదేశం పొత్తు తాత్కాలికం అని చంద్రబాబు నాయుడు చెప్పలేదు

ద్వారా: రోహిత్ గుత్తా
మార్చి 28 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
బిజేపితో తెలుగుదేశం పొత్తు తాత్కాలికం అని చంద్రబాబు నాయుడు చెప్పలేదు

బీజేపీతో తెలుగుదేశం పొత్తు తాత్కాలికం అని చంద్రబాబు చెప్పాడని క్లైమ్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

బీజేపీతో తెలుగుదేశం పొత్తు తాత్కాలికం అని చెబుతూ చంద్రబాబు నాయుడు పేరు మీద వచ్చిన ఒక ఫేక్ లేఖ నుండి ఈ క్లైమ్ వచ్చింది.

క్లైమ్ ఐడి 2758b3d4

క్లైమ్ ఏంటి?

చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న ఒక 11 సెకన్ల వీడియోని సామాజిక మాధ్యమాలలో షేర్ చేసి, చంద్రబాబు బీజేపీతో తెలుగుదేశం పొత్తు తాత్కాలికం అని, కేవలం ఎన్నికల వరకే అని అన్నారని క్లైమ్ చేశారు.

ఈ వీడియోలో చంద్రబాబు “నాక్కూడా కేంద్ర ప్రభుత్వం అవసరం కాబట్టి, మనము వెళ్లలేదు, వాళ్ళే వచ్చినప్పుడు, పొత్తు పెట్టుకున్నాను తప్ప ఇంకొక విషయం కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా”, అని అనటం మనం వినవచ్చు.

ఈ వీడియోని షేర్ చేసి “నిన్నేమో పొత్తు తాత్కాలికం, రెండు నెలలు మాత్రమే అని అన్నాడు. ఈ రోజేమో @BJP4Andhra నే పొత్తు కోరుకుంది అని అబద్ధాలు చెబుతూ, తన ఓటమిని @BJP4India మీద నెట్టటానికి సిద్ధం చేస్తున్నాడు,” అనే శీర్షిక పెట్టారు. ఈ పోస్ట్ లోని కామెంట్స్ చూస్తే బీజేపీతో పొత్తు తాత్కాలికం అని చంద్రబాబు అన్నాడని అనేక మంది నమ్ముతున్నట్టే ఉంది. ఈ పోస్ట్ ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ  చూడవచ్చు. 

మే 13, 2024 నాడు జరగనున్న ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ, లోక్ సభ ఎన్నికలకి అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేయడానికి తెలుగుదేశం, జన సేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడ్డాయి. 

వైరల్ సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఈ వీడియో అయితే నిజమైనదే కానీ, బీజేపీతో పొత్తు అనేది చంద్రబాబు పేరు మీద వైరల్ అయిన ఒక ఫేక్ లేఖ నుండి వచ్చిన క్లైమ్.

మేము ఏమి తెలుసుకున్నాము?

బీజేపీతో తెలుగుదేశం పొత్తు తాత్కాలికం అని చంద్రబాబు ఎక్కడైనా చెప్పారా అని మేము చూశాము. అయితే దీనికి సంబంధించి ఎటువంటి వార్తా కథనాలు మాకు లభించలేదు. అయితే చంద్రబాబు పేరు మీద సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన ఒక లేఖ మాత్రం మా దృష్టికి వచ్చింది.

ఈ లేఖలో ఈ పొత్తు తాత్కాలికం అని, ఎన్నికలే వరకే అని, పోలవరం నిధుల గురించి, రాజధానికి నిధుల గురించి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి బీజేపీని నిలదీస్తాను అని, రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని చంద్రబాబు రాసినట్టు ఉంది.

చంద్రబాబు ఇటువంటి లేఖ ఏమైనా రాశాడా అని మేము వార్తా కథనాల కోసం చూశాము. అలాగే తెలుగుదేశం, చంద్రబాబు సామాజిక మాధ్యమ అకౌంట్లు చూశాము. ఎక్కడా కూడా ఈ లేఖ కానీ, ఈ లేఖ గురించి సమాచారం కానీ ఏమీ లేదు. 

బీజేపీతో పొత్తు గురించి చంద్రబాబు పేరు మీద వైరల్ అయిన లేఖ (సౌజన్యం: ఫేస్బుక్)

ఈ లేఖలో అనేక అచ్చు తప్పులు ఉన్నాయి. అలాగే లేఖ మీద తేదీ 20-23-2024 అని ఉంది. దీని బట్టి ఇది ఫేక్ అయ్యుండొచ్చు అని మాకు అనిపించింది.

దీనితో మేము ఈ లేఖని, తెలుగుదేశం అధికార లెటర్ హెడ్ తో పోల్చి చూశాము. అప్పుడు ఈ లేఖలో అనేక లొసుగులు మాకు దొరికాయి.

లెటర్ హెడ్ మీద ఫాంట్

ఈ లేఖ పై భాగంలో కుడి వైపు ఉన్న చిరునామా ఫాంట్ అధికారిక లెటర్ హెడ్ మీద చిరునామా ఫాంట్ వేరు వేరుగా ఉన్నాయి. అలాగే చిరునామా చివరి వ్యాఖ్య, హెడర్ మధ్య దూరం కూడా అధికారిక లెటర్ హెడ్ కన్నా వేరుగా ఉంది. 

చంద్రబాబు రాశాడని చెబుతున్న లేఖ, అధికారిక లెటర్ హెడ్ మధ్య పోలికలు (సౌజన్యం: ఫేస్బుక్)

పార్టీ గుర్తు

పార్టీ గుర్తు బొమ్మలో కూడా లొసుగులు ఉన్నాయి. అధికారిక లెటర్ హెడ్ లో పసుపు జెండా కాస్త ఒరిగినట్టు ఉంటుంది. వైరల్ లేఖలో నిటారుగా ఉంది. అలాగే జెండా మధ్యలో ఎర్ర చక్రం మధ్య ఉన్న రంగు కూడా వేరే ఉంది. అధికారిక లెటర్ హెడ్ లో అది తెల్లని రంగులో ఉండగా, వైరల్ లేఖలో పసుపు రంగులో ఉండి, జెండా రంగులో కలిసిపోయినట్టు ఉంది. అలాగే అధికారిక లెటర్ హెడ్ లో జెండాని పట్టి ఉంచిన తాడు మొదటి రెండు అక్షరాల మధ్య గూండా వెళ్తుండగా, వైరల్ లేఖలో మొదటి అక్షరం మధ్యలో నుండి వెళ్తున్నట్టు ఉంది.  

 చంద్రబాబు రాశాడని చెబుతున్న లేఖ, అధికారిక లెటర్ హెడ్ మధ్య పోలికలు (సౌజన్యం: ఫేస్బుక్)

దీని బట్టి ఇది ఫేక్ ఉత్తరం అని స్పష్టంగా చెప్పవచ్చు. అలాగే పొత్తు తాత్కాలికం అని చంద్రబాబు చెప్పినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు. ఇంతకముందు కూడా చంద్రబాబు పేరు మీద వైరల్ అయిన ఫేక్ లేఖలని లాజికల్లీ ఫ్యాక్ట్స్ డీబంక్ చేసింది. వాటిని ఇక్కడ  మరియు ఇక్కడ  చదవవచ్చు. 

తీర్పు

చంద్రబాబు పేరు మీద ఒక ఫేక్ లెటర్ సర్కులేట్ చేసి, అందులో చంద్రబాబు తెలుగుదేశం- బీజేపీ పొత్తు తాత్కాలికం అన్నారని క్లైమ్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము.  

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.