భారతదేశంలోని హైదరాబాద్ లో తాళం వేసి ఉన్న సమాధి ఫొటోని చూపిస్తూ పాకిస్థాన్ లో నెక్రోఫీలియాకి భయపడి ఇలా చేస్తున్నారు అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

ద్వారా: రోహిత్ గుత్తా
ఆగస్టు 10 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
భారతదేశంలోని హైదరాబాద్ లో తాళం వేసి ఉన్న సమాధి ఫొటోని  చూపిస్తూ పాకిస్థాన్ లో నెక్రోఫీలియాకి భయపడి ఇలా చేస్తున్నారు అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఈ ఫొటో భారతదేశంలోని హైదరాబాద్ లో ఒక సంవత్సరం మునుపు చనిపోయిన వృద్ధురాలి సమాధి. దీనికి పాకిస్థాన్ లో నెక్రోఫీలియాకి సంబంధం లేదు.

క్లైమ్ ఐడి c47f9c78

నేపధ్యం

సామాజిక మాధ్యమాలలో, అనేక వెబ్సైట్స్ లో  పచ్చ రంగు గ్రిల్ పెట్టి తాళం వేసి ఉన్న సమాధి ఫొటో ఒకటి వైరల్ అయ్యింది. పాకిస్థాన్ లో తల్లితండ్రులు తమ కూతుళ్ల  సమాధులకి ఇలా తాళం వేస్తున్నారని, నెక్రోఫీలియా బాధితులుగా మారకుండా ఉండటానికి ఇలా చేస్తున్నారనే వార్తతో ఈ ఫొటో చక్కర్లు కొడుతుంది. నెక్రోఫీలియా అంటే శవాలతో శృంగారం ద్వారా లైంగిక తృప్తి పొందటం. 

ఈ వార్తని మొదటిసారిగా ట్విట్టర్ లో హారిస్ సుల్తాన్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. ఈయన ‘ది కర్స్ ఆఫ్ గాడ్- వై ఐ లెఫ్ట్ ఇస్లాం’ (దేవుని శాపం- నేను ఇస్లాం మతం ఎందుకు వదిలేశాను) అనే పుస్తక రచయిత. ఈయన ఈ ఫొటోని ఏప్రిల్ 26, 2023 నాడు పోస్ట్ చేశారు. ఈ ఫొటో పాకిస్థాన్ కి చెందినదని చెబుతూ, పాకిస్థాన్ సమాజం “లైంగికంగా నిరాశా నిస్పృహ” చెందిన సమాజం అని రాసుకొచ్చారు. ఈయన ట్వీట్ ని భారతదేశ వార్తా ఏజెన్సీ ఏఎన్ఐ వార్తగా ప్రచురించింది. ఏఎన్ఐలో వచ్చిన వార్తని ఉటంకిస్తూ పాకిస్థాన్ కి చెందిన డెయిలీ న్యూస్ అనే సంస్థ పాకిస్థాన్లో మహిళల శవాలు అత్యాచారానికి గురికాకుండా ఉండటానికి వారి సమాధులకి ఇలా తాళాలు వేస్తున్నారని రాసింది. భారతదేశ ప్రధానస్రవంతి మీడియా సంస్థలైన టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎన్ డి టి వి, జీ న్యూస్, హిందుస్థాన్ టైమ్స్ కూడా ఏఎన్ఐ వార్తని ప్రచురించాయి. తెలుగులో ఈనాడు దినపత్రిక కూడా ఇదే వార్తని ప్రచురించింది. 

అయితే ఇప్పుడు ఏఎన్ఐ సంస్థ ఆ సమాధి పాకిస్థాన్ లోది కాదు, భారతదేశంలోని హైదరాబాద్ లోనిది అని ఒప్పుకుంటా తమ వార్తని సవరించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎన్ డి టి వి కూడా తమ వార్తని సవరించాయి. హిందుస్థాన్ టైమ్స్ ఆ వార్తా కథనాన్ని తమ వెబ్సైట్ నుండి తొలగించింది. 

వాస్తవం

ఈ సమాధి హైదరాబాద్ లోని దరాబ్ జంగ్ కాలనీలోని సాలార్ ముల్క్ మసీదు పక్కన ఉన్న శ్మశానంలోది అనే విషయం మేము ట్విట్టర్ లో చూశాము. దాని ఆధారంగా ఈ మసీదుని గూగుల్ మ్యాప్స్ ద్వారా గుర్తించాము. గూగుల్ మ్యాప్స్ లో గూగుల్ స్ట్రీట్ వ్యూ ద్వారా ఆ వైరల్ ఫొటోలో ఉన్న గ్రిల్ వేసి, తాళం పెట్టి ఉన్న సమాధి ఈ శ్మశానవాటిక మొదటిలోనే ఉన్నట్టు గుర్తించాము. 

లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఈ విషయం గురించి ముజఫర్ హష్మీని సంప్రదించింది. ఆయన ఈ సమాధి తన తల్లిది అని, మీడియాలో చెప్పినట్టు ఇది పాకిస్థాన్ లోని శ్మశానవాటిక కాదని, ఇది భారతదేశంలో హైదరాబాద్ లోని శ్మశానవాటిక అని నిర్ధారించారు. 

ఈ సమాధి పక్కన ఒక మనిషి నుంచుని, ఇప్పుడు వైరల్ అయిన ఫొటో తీసింది తానేనని చెబుతున్న ఒక వీడియో మాకు ఫేస్బుక్ లో కనిపించింది. ఈ సమాధి తన స్నేహితుడి తల్లిదని, ఆ ముసలావిడ సుమారుగా ఒకటిన్నర్ర సంవత్సరం క్రింద చనిపోయింది అని ఆయన ఆ వీడియోలో తెలిపారు. గూగుల్ స్ట్రీట్ వ్యూ ద్వారా ఆయన నుంచుని ఉన్న సమాధి, శ్మశానవాటిక చూస్తే అవి ఆ వైరల్ ఫొటోలో ఉన్నవే అన్న విషయం నిర్ధారణ అయ్యింది. 

అలాగే ఎంఐఎం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి వారిస్ పఠాన్ విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ పాత సమాధుల మీద ఎటువంటి అనుమతులు లేకుండా మళ్ళీ వేరేవాళ్ళు శవాలని పూడుస్తున్నందున అలా జరగకుండా ఉండటానికి ఇలా గ్రిల్ వేసి దానికి తాళం వేస్తున్నారని సాలార్ ముల్క్ మసీదు అధికారి ముక్తార్ సాహబ్ తెలిపారు.  ఈ సమాధి శ్మశానవాటిక మొదట్లోనే ఉండటంతో, శ్మశానానికి వచ్చేవారు ఈ సమాధిని తొక్కకుండా ఉండటానికి కూడా ఇలా గ్రిల్ పెట్టడం జరిగింది అని ఆయన తెలిపారు. ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్ అయిన ఆల్ట్ న్యూస్ వారు హైదరాబద్ లోని ఒక సామాజిక కార్యకర్త ద్వారా ఈ సమాధి, శ్మశానం వీడియో సంపాదించారు. వారి అభ్యర్ధన మేరకు ఆయన అక్కడికి వెళ్ళి వీడియో తీశారు. 

హారిస్ సుల్తాన్ ఈ విషయం తెలిశాక ట్విట్టర్లో క్షమాపణ తెలిపారు. ఈ ఫోటో గురించి తప్పుడు సమాచారంతో రాసిన ట్వీట్ ని ఆయన తొలగించారు. “పాకిస్థాన్ లో నెక్రోఫీలియా చాలా సీరియస్ విషయంగా మారిన కారణంగా నాకు ఈ విషయం నమ్మశక్యంగా అనిపించింది” అని క్షమాపణ ట్వీట్ లో రాశారు. 

పాకిస్థాన్ లో నెక్రోఫీలియా కేసులు అప్పుడప్పుడు రిపోర్ట్ అవుతా ఉన్నాయి. పాకిస్థాన్ లోని సింధ్ రాష్ట్రంలో తట్టా అనే ప్రాంతంలో ఒక యుక్త వయసు అమ్మాయి శవం బయటకి లాగి అత్యాచారం చేశారు అనే విషయాన్ని పాకిస్థాన్ కి చెందిన ఆంగ్ల దినపత్రిక డాన్ ఆగస్ట్ 15, 2021 నాడు ప్రచురించింది. పాకిస్థాన్ లోని కరాచీలో పాపోష్ నగర్ శ్మశానవాటికలో 48 మహిళా శవాలతో మహమ్మద్ రియాజ్ అనే వ్యక్తి ఇలాగే చేశాడని పాకిస్థాన్ కి చెందిన ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ దినపత్రిక అక్టోబర్ 30, 2011 నాడు రిపోర్ట్ చేసింది. 

తీర్పు

హైదరాబాద్ లోని తాళం వేసి ఉన్న ఒక సమాధి పాకిస్థాన్ లో నెక్రోఫీలియాకి సంబంధించిన విషయమని తప్పుగా చెప్పారు. హైదరాబాద్ లో ఉన్న ఈ సమాధిలో మళ్ళీ ఇతర శవాలని పాతిపెట్టకుండా ఉండటానికి, ఆలాగే శ్మశానవాటిక మొదట్లోనే ఈ సమాధి ఉన్న కారణంగా ఎవరూ దీనిని తొక్కకుండా ఉండటానికి మాత్రమే ఈ సమాధికి గ్రిల్ పెట్టి తాళం వేశారు. కాబట్టి ఈ వార్త అబద్ధం అనేది మా నిర్ధారణ

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.