2024 ఎన్నికలలో ఆర్ఎస్ఎస్ విపక్ష కూటమికి మద్ధతు ప్రకటించలేదు

ద్వారా: రాహుల్ అధికారి
ఏప్రిల్ 2 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
2024 ఎన్నికలలో ఆర్ఎస్ఎస్ విపక్ష కూటమికి మద్ధతు ప్రకటించలేదు

2024 సాధారణ ఎన్నికల నేపధ్యంలో మోహన్ భగవత్ నేతృత్వంలోని ఆర్ఎస్ఎస్ ఇండియా కూటమికి మద్ధతు తెలిపిందని క్లైమ్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

ఆర్ఎస్ఎస్ అనే పేరు మీదే ఉన్న మరొక సంస్థ విపక్ష కూటమికి తన మద్ధతు ప్రకటించింది. ఇది బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ కాదు.

క్లైమ్ ఐడి 839f3779

క్లైమ్ ఏంటి?

‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్’ అనే బ్యానర్  కింద పత్రికా సమావేశం జరుగుతున్న ఒక వీడియోని సామాజిక మాధ్యమాలలో షేర్ చేసి భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ రానున్న సాధారణ ఎన్నికలలో ఇండియా కూటమికి తన మద్ధతు తెలియచేసిందని క్లైమ్ చేశారు.

ఈ వైరల్ వీడియోలో బీజేపీని ఓడించడానికి తాము ఇండియా కూటమికి మద్ధతు ప్రకటిస్తున్నామని జనార్ధన్ మూన్ అనే వ్యక్తి చెప్పటం మనం వినవచ్చు. ఈ వీడియోని ఎక్స్ (పూర్వపు ట్విటర్), ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలలో షేర్ చేశారు. అటువంటి ఒక ఎక్స్ పోస్ట్ కి ఈ కథనం రాసే సమయానికి మూడు లక్షలకి పైగా వ్యూస్ ఉన్నాయి, 6600కి పైగా లైక్స్ ఉన్నాయి. పోస్ట్ ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ  చూడవచ్చు. 

వైరల్ పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

మేము ఏమి తెలుసుకున్నాము?

వీడియో పై భాగంలో కుడి వైపున ‘ఆవాజ్ ఇండియా’ అనే పేరుతో ఒక లోగో ఉన్న విషయాన్ని మేము గుర్తించాము. దీని ఆధారంగా ఈ పత్రికా సమావేశాన్ని ‘ఆవాజ్ ఇండియా టీవీ’ అనే యూట్యూబ్ చానల్ లో మార్చ్ 24, 2024 నాడు ‘అప్లోడ్ చేశారని తెలుసుకున్నాము.

‘నాగపూర్: కాంగ్రెస్ కి మద్ధతు ప్రకటించిన ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు ఆర్ఎస్ఎస్ అధినేత జనార్ధన్ మూన్ పిసి అబ్దుల్ పాషా’ అనే శీర్షికతో ఈ వీడియోని అప్లోడ్ చేశారు. ఈ 12 నిమిషాల వీడియోలో 0:25 నుండి 2:55 టైమ్ ఫ్రేమ్ వరకు ఉన్న భాగాన్ని షేర్ చేస్తున్నారు. 

జనార్ధన్ మూన్ నాయకత్వం వహిస్తున్న ఈ ఆర్ఎస్ఎస్ కి సంఘ్ పరివార్ లో ఒక సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ కి సంబంధం లేదని మేము తెలుసుకున్నాము. సంఘ్ పరివార్ ఆర్ఎస్ఎస్ గత రెండు దశాబ్దాలుగా మోహన్ భగవత్ నాయకత్వంలో పని చేస్తున్నది.

ఆర్ఎస్ఎస్ వర్సెస్ ఆర్ఎస్ఎస్

టైమ్స్ ఆఫ్ ఇండియాలో జనవరి 22, 2019 నాడు వచ్చిన ఒక కథనం ప్రకారం సామాజిక కార్యకర్త అయిన జనార్ధన్ మూన్ తన స్వచ్ఛంద సంస్థని ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్’ పేరు మీద రిజిస్టర్ చేపించుకోవడానికి బొంబే హై కోర్టు తలుపు తట్టగా, ఆ పేరు మీద ఇప్పటికే ఒక సొసైటీ ఉన్న కారణంగా కుదరదు అని కోర్టు తీర్పునిచ్చింది.

వివిధ వార్తా కథనాల ప్రకారం జనార్ధన్ మూన్ 2017లోనే ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్’ పేరు మీద ఒక సంస్థాని ఏర్పాటు, తనని తాను అధ్యక్షునిగా నియమించుకున్నారు. హై కోర్టుకి వెళ్ళే ముందు తన సంస్థ రిజిస్టర్ చేసుకోవడానికి సెప్టెంబర్ 2017లో నాగపూర్ చారిటీ కమీషనర్ కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేశారు. అయితే ఈ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యింది.

అసలైన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ని డాక్టర్ కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ నాగపూర్ లో 1925లో స్థాపించారు. 2009లో మోహన్ భగవత్ సర్ సంఘ్ చాలక్- అంటే సంస్థ అధినేత- అయ్యారు.

ఈ రెండు ఆర్ఎస్ఎస్ పేరు ఒకటే అయినా, వాటి లోగోలు మాత్రం వేరు. 

ఆర్ఎస్ఎస్ పేరు మీద ఉన్న రెండు సంస్థల లోగోల మధ్య తేడాలు (సౌజన్యం: యూట్యూబ్/వికీపీడియా/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అలాగే, మోహన్ భగవత్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఇండియా కూటమికి తమ మద్ధతు ప్రకటిస్తూ ఎటువంటి ప్రకటన చేయలేదు.

జనార్ధన్ మూన్ ఆర్ఎస్ఎస్ గురించి అసలైన ఆర్ఎస్ఎస్ నాయకుల ప్రకటన

మోహన్ భగవత్ నాయకత్వం వహిస్తున్న ఆర్ఎస్ఎస్ పత్రికగా పేరున్న ఆర్గనైజర్ వార పత్రిక మార్చ్ 26 నాడు ఎక్స్ లో జనార్ధన్ మూన్ ఆర్ఎస్ఎస్ “ఫేక్ ఆర్ఎస్ఎస్” అని పోస్ట్ చేసింది. 

ఆర్ఎస్ఎస్ నాయకుడు డాక్టర్ మన్మోహన్ వైద్యని లాజికల్లీ ఫ్యాక్ట్స్ సంప్రదించింది. ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి సునీల్ అంబేద్కర్ ఇచ్చిన అధికారిక ప్రకటనని మన్మోహన్ వైద్య మాతో షేర్ చేశారు. “జనాలని ఇంకా తప్పుదోవ పట్టించాలని అతను చూస్తున్నాడు. తన చర్యల గురించి పోలీసులకి త్వరలోనే ఫిర్యాదు చేస్తాము, అలాగే ఈ సంస్థ పేరు మీద వస్తున్న పోస్ట్లని, వీడియోలని తొలగించమని సామాజిక మాధ్యమ సంస్థలని కోరతాము,” అని జనార్ధన్ మూన్ ని ఉద్దేశించి ఈ ప్రకటనలో ఉంది.

అలాగే జనార్ధన్ మూన్ ఆర్ఎస్ఎస్ “ఫేక్” అని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ విశ్వ హిందూ పరిషద్ జాతీయ సోషల్ మీడియా అండ్ ఇటీ ఇంఛార్జ్ రాకేష్ పాండే ఎక్స్ లో పోస్ట్ చేశారు.

తీర్పు

2024 ఎన్నికలలో మోహన్ భగవత్ నాయకత్వంలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఇండియా కూటమికి మద్ధతు ప్రకటించలేదు. ఈ ఆర్ఎస్ఎస్ తో సంబంధం లేని, ఇదే పేరున్న వేరే సంస్థ విపక్ష కూటమికి తమ మద్ధతు తెలియచేస్తున్న వీడియోని షేర్ చేసి అసలైన ఆర్ఎస్ఎస్ మద్ధతు ప్రకటించిందని క్లైమ్ చేస్తున్నారు. కాబట్టి ఈ క్లైమ్ తప్పుదోవ పట్టించేటట్టు ఉందని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.