సంబంధం లేని పాత వీడియో షేర్ చేసి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు దళిత మహిళ మీద చేశాడని క్లైమ్ చేశారు

ద్వారా: రోహిత్ గుత్తా
జనవరి 4 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
సంబంధం లేని పాత వీడియో షేర్ చేసి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు దళిత మహిళ మీద చేశాడని క్లైమ్ చేశారు

ఆంధ్ర ప్రదేశ్ లో ఒక తెలుగు దేశం నాయకుడు దళిత మహిళ మీద దాడి చేస్తున్న వీడియో అని క్లైమ్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఇది 2020లో నెల్లూరులో పర్యాటక శాఖ ఉన్నతాధికారి మహిళా ఉద్యోగి మీద దాడి చేసిన వీడియో అని ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు లాజికల్లీ ఫ్యాక్ట్స్ కి నిర్ధారించారు.

క్లైమ్ ఐడి 21f63ec5

(సూచన- ఈ కథనంలో దాడికి సంబంధించిన ఫొటోలు, వివరాలు ఉన్నాయి. పాఠకులు గమనించగలరు.)

క్లైమ్ ఏమిటి?

ఎక్స్ (పూర్వపు ట్విట్టర్), ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో వైరల్ అయ్యింది. తెలుగుదేశం నాయకుడు ఒకరు దళిత మహిళ మీద దాడి చేస్తున్న వీడియో అని ఈ వీడియో షేర్ చేసి క్లైమ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్ష పార్టీ.

కార్యాలయంలాగా ఉన్న ఒక భవనంలో ఒక పురుషుడు ఒక మహిళ దగ్గరికి వచ్చి, కర్ర లాగా ఉన్న వస్తువుతో ఆ మహిళ మీద దాడి చేస్తుండగా, మిగతవాళ్ళు తనని ఆపి, ఆ మహిళని రక్షించటం మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ  చూడవచ్చు. 

సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన పోస్ట్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఈ వీడియోలో ఉన్న మహిళ దళితా కాదు, కొడుతున్న అ వ్యక్తి తెలుగుదేశం నాయకుడూ కాదు.

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ వీడియో కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే ఇదే వీడియోతో ఉన్న ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ వారి జూన్ 30, 2020 నాటి వీడియో కథనం ఒకటి మాకు లభించింది. ఈ కథనం ప్రకారం ఈ వీడియో నెల్లూరులోని ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్నతాధికారైన ఒకరు తన క్రింది పని చేసే ఒక మహిళా ఉద్యోగ మీద దాడి చేసినప్పుడు సీసీటీవీలో రికార్డ్ అయిన ఫుటేజి. ఈ కథనం ప్రకారం 2020లో కోవిడ్ సమయంలో మాస్కు ధరించలేదు అని అడిగినందుకు ఈ అధికారి మహిళా ఉద్యోగి మీద దాడి చేశాడు. ఈ ఘటన జూన్ 27, 2020 నాడు జరిగింది అని ఈ కథనంలో తెలిపారు. ఆంగ్ల చానల్ ఎన్ డి టీ వీ కూడా ఇదే విషయాన్ని పేర్కొంది. అలాగే ఈ ఉన్నతాధికారి మీద కేసు నమోదయ్యింది అని పేర్కొంది. 

ఈ మహిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నెల్లూరులోని దర్గామిట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ ఐ ఆర్ కాపీని లాజికల్లీ ఫ్యాక్ట్స్ సంపాదించింది. ఈ ఎఫ్ ఐ ఆర్ ప్రకారం ఈ ఇద్దరికీ గతం నుండి విబేధాలు ఉన్నాయి. జూన్ 27, 2020 నాడు ఉన్నతాధికారి మాస్కు పెట్టుకోకుండా వచ్చినప్పుడు, కార్యాలయం పైభాగాన్ని క్వారన్టైన్ వార్డుగా మార్చిన పరిస్థితులలో కూడా మాస్కు పెట్టుకోకుండా ఎందుకు వచ్చారు అని అడిగినందుకు ఈ అధికారి మహిళ ఉద్యోగిని దూషిస్తూ  కుర్చీ నుండి కింద పడవేసి, జుట్టి పట్టుకుని, ఒక కర్ర ముక్క తీసుకుని తన నెత్తి మీద కొట్టాడు. పక్కన ఉన్న మిగతా ఉద్యోగులు తనని అధికారి నుండి కాపాడారు. ఈ అధికారు పేరు సి. భాస్కర్ అని ఆ ఎఫ్ ఐ ఆర్ లో ఉంది. తన మీద భారతీయ శిక్షా స్మృతి ప్రకారం 5 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. అందులో మహిళల గౌరవాన్ని భంగపరిచే ఉద్దేశంతో దాడి చేయడం, గాయపరిచే విధంగా దాడి చేయడంకి సంబంధించిన సెక్షన్లు ఉన్నాయి. ఈ మహిళ కమ్మ కులానికి చెందిన మహిళ అని ఎఫ్ ఐ ఆర్ లో ఉంది. అదే సమయంలో భాస్కర్ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అంటూ ఏమీ కూడా ఇందులో లేదు.

లాజికల్లీ ఫ్యాక్ట్స్ దర్గామిట్ట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ టి. వి. సుబ్బారావుని సంప్రదించింది. ఈ ఘటన నెల్లూరులోని పర్యాటక విభాగం కార్యాలయంలో జరిగిందని ఆయన ధ్రువీకరించారు. ఈ కేసుకి సంబంధించి ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యిందని, కేసు ట్రయిల్ దశలో ఉందని పేర్కొన్నారు. ఈ కోర్ట్స్ వెబ్సైట్ ప్రకారం ఈ కేసు ప్రస్తుతం నెల్లూరు జూనియర్ సివిల్ జడ్జ్ న్యాయస్థానంలో ట్రయిల్ దశలో ఉంది.

బాధిత మహిళతో మాట్లాడటానికి లాజికల్లీ ఫ్యాక్ట్స్ తనని సంప్రదించింది. తను జవాబివ్వగానే ఇక్కడ పొందుపరుస్తాము.

తీర్పు

2020లో నెల్లూరులోని పర్యాటక శాఖ విభాగం కార్యాలయంలో మాస్కు ఎందుకు వేసుకోలేదు అని ప్రశ్నించినందుకు ఒక మహిళ ఉద్యోగి మీద ఉన్నతాధికారి దాడి చేసిన ఘటనకి సంబంధించిన వీడియోని తెలుగుదేశం నాయకుడు దళిత మహిళ మీద దాడి చేసిన ఘటన వీడియోగా షేర్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.