డబ్బులు పట్టుబడినప్పుడు తీసిన పాత వీడియో 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలకి సంబంధించినదని ప్రచారం చేస్తున్నారు

ద్వారా: రోహిత్ గుత్తా
ఆగస్టు 10 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
డబ్బులు పట్టుబడినప్పుడు తీసిన పాత వీడియో 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలకి సంబంధించినదని ప్రచారం చేస్తున్నారు

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

2019 లో కర్ణాటకలోని షిమోగా జిల్లాలో ఒక బండి టైర్లో డబ్బులు పట్టుబడినప్పటి వీడియో ఇది.

క్లైమ్ ఐడి 37981e91

నేపధ్యం

కర్ణాటక శాసనసభ ఎన్నికలు మే 10, 2023 నాడు జరిగాయి. ఆ సమయంలో సామాజిక మాధ్యమాలలో అనేక వీడియోలు ఆ ఎన్నికలకి సంబంధించిన వీడియోలు అన్న పేరు మీద వైరల్ అయ్యాయి. అందులో ఇదొకటి. 

“ఆర్ టి జి ఎస్ మర్చిపోండి, ఎన్ ఈ ఎఫ్ టి మర్చిపోండి, ఐ ఎం పి ఎస్ మర్చిపోండి, మొబైల్ బ్యాంకింగ్ మర్చిపోండి..డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే కొత్త విధానం ఇది. కర్ణాటక ఎన్నికలు వర్ధిల్లాలి,” అనే  వ్యాఖ్యతో ఒక వీడియో ట్విట్టర్, ఫేస్బుక్ లలో చక్కర్లు కొట్టింది. ఒక బండి టైర్లలో డబ్బులు పట్టుబడిన వీడియో క్లిప్ అది. 

ట్విట్టర్ లో ఒకరు ఇదే వీడియో క్లిప్ ట్వీట్ చేసి అప్పుడు జరుగుతున్న కర్ణాటక ఎన్నికల నేపధ్యంలో పట్టుబడిన డబ్బు అది అని వ్యాఖ్యానించారు. ఆ ట్వీట్ కి 25,000కి పైగా వ్యూస్ ఉన్నాయి. ఈ ట్వీట్ లో #కర్ణాటక ఎన్నికలు, #లంచం, #కర్ణాటక శాసనసభ ఎన్నికలు 2023 లాంటి హ్యాష్ ట్యాగ్ లు ఉన్నాయి. అయితే ఇది పాత వీడియో. మే 2023లో కర్ణాటకలో జరిగిన  ఎన్నికలకి సంబంధించిన వీడియో కాదు. 

వాస్తవం

ఈ వీడియో కీ ఫ్రేమ్స్ తీసుకుని వాటిని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే ఈ వీడియోని మొదటగా ఏఎన్ఐ వార్త సంస్థ తమ ట్విట్టర్ లో ఏప్రిల్ 20, 2019 నాడు పోస్ట్ చేసింది అని తేలింది. 

“బండి స్పేర్ టైర్ లో దాచిన 2.3 కోట్ల నగదుని ఆదాయపు పన్ను అధికారులు పట్టుకున్నారు. ఈ డబ్బుని కర్ణాటకలోని బెంగళూరు నుండి షిమోగా తరలిస్తుండగా పట్టుకున్నారు. #కర్ణాటక” అన్న వ్యాఖ్యతో ఏఎన్ఐ సంస్థ ఈ వీడియోని ట్వీట్ చేసింది. ఇదే ట్వీట్ ని ఎన్ డి టి వి వార్త సంస్థ తమ వార్తా కథనంలో ఉటంకించింది. 2019 లోక్ సభ ఎన్నికలప్పుడు ఆదాయపు పన్ను శాఖ వారికి అందిన సమాచారం మేరకు ఈ డబ్బుని తరలిస్తున్న మనిషిని పట్టుకుని, తన వాహనాన్ని తనిఖీ చేసి ఈ నగదు పట్టుకున్నారు అని ఎన్ డి టి వి తన వార్తా కధనంలో పేర్కొంది. 

ఈ ఘటన గురించి మరింత సమాచారం కోసం కీ వర్డ్స్ వాడి గూగుల్ సెర్చ్ చేస్తే డెక్కన్ హెరాల్డ్ పత్రికలో ఏప్రిల్ 20, 2019 నాటి వార్త ఒకటి కనిపించింది. “ఈ డబ్బు తరలిస్తున్న మనిషిని పట్టుకుని తన వాహనం తనిఖీ చేస్తే స్పేర్ టైర్ లో ఉంచిన 2.3 కోట్ల రూపాయల నగదు దొరికింది,” అని ఆదాయపు పన్ను అధికారులు విడుదల చేసిన ప్రకటనని ఆ వార్తలో ఉటంకించారు. ఈ డబ్బుని బెంగళూరు నుండి షిమోగా, భద్రావతి కి తరలిస్తున్నారు అని కూడా ఆ వార్తలో పేర్కొన్నారు. 

యూట్యూబ్ లో ఈ ఘటన గురించి కన్నడలో ఉన్న వీడియో వార్తా కథనాలు కూడా మాకు లభించాయి. ఆసియా నెట్ సువర్ణ ఛానల్ వారి యూ ట్యూబ్ ఛానల్ లో ఇదే వీడియో చూపించి బండి స్పేర్ టైర్ లో దాచిన కోట్ల రూపాయల నగదుని ఆదాయపు పన్ను అధికారులు పట్టుకున్నారు అని ఆ వీడియో వార్తా కథనంలో పేర్కొన్నారు. 2019 లోక్ సభ ఎన్నికలప్పుడు లెక్క చూపించని నగదుని ఆదాయపు పన్ను అధికారులు పట్టుకున్న అనేక దాఖలాలలో ఇదొకటి. 

పబ్లిక్ టివి కన్నడ ఛానల్ వారి ఒక వీడియో వార్తలో ఇదే వీడియో చూపించి బెంగళూరు నుండి షిమోగా తరలిస్తున్న ఈ నగదుని ఆదాయపు పన్ను అధికారులు పట్టుకున్నారు అని చెప్పారు. ఈ నగదు అంతా కూడా 2,000 రూపాయి నోట్లలో ఉంది. 

దీనిబట్టి ఈ ఘటన నాలుగు సంవత్సరాల క్రితం ఏప్రిల్, 2019 లో జరిగింది అనేది సుస్పష్టం. దీనికి మే 2023లో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికలకి సంబంధం లేదు. 

తీర్పు

ఒక బండి టైర్లో నగదు పట్టుబడిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. కొంతమంది ఇది మే, 2023లో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికలకి సంబంధించిన వీడియో అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వీడియో నాలుగు సంవత్సరాల క్రితం అంటే ఏప్రిల్, 2019 లో షిమోగాలో ఆదాయపు పన్ను అధికారులు నగదు జప్తు చేసిన సంఘటన వీడియో. కాబట్టి ఈ వార్త అబద్ధం అని మేము నిర్ధారించాము. 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.