హోమ్ ఇజ్రాయెల్ సైన్యం నుండి తప్పించుకోవటానికి పాలస్తీనా ప్రజలు భారతీయ జెండా చూపిస్తున్న వీడియో కాదిది

ఇజ్రాయెల్ సైన్యం నుండి తప్పించుకోవటానికి పాలస్తీనా ప్రజలు భారతీయ జెండా చూపిస్తున్న వీడియో కాదిది

ద్వారా: సోహం శా

అక్టోబర్ 19 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఇజ్రాయెల్ సైన్యం నుండి తప్పించుకోవటానికి పాలస్తీనా ప్రజలు భారతీయ జెండా చూపిస్తున్న వీడియో కాదిది పాలస్తీనా ప్రజలు భారతీయ జెండాను చూపి తప్పించుకుంటున్నారు అనే పోస్ట్ స్క్రీన్ షాట్(సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

అబద్ధం

ఇది ఇరాక్ లో ఆగస్ట్ 2023లో తీసిన వీడియో. భారతీయులు అర్బాయీన్ నడకలో పాల్గొన్నప్పుడు తీసిన వీడియో ఇది.

క్లెయిమ్ ఏమిటి?

భారతీయ జెండా చాలా మంది పాలస్తీనా వాసులకు ఇజ్రాయెలీ సైన్యం నుండి తమను తాము రక్షించుకోవడానికి ఉపయోగపడింది అంటూ సామాజిక మాధ్యమలలో అనేక మంది క్లైమ్ చేస్తూ ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఈ వైరల్ వీడియోలో జనాలు భారతీయ జెండాను పట్టుకుని నడవటం మనం చూడవచ్చు. అలాంటి పోస్ట్ ల ఆర్కైవ్ లింకులు ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు. 

ఈ వీడియోను షేర్ చేస్తూ ఇజ్రాయెలీ సైన్యం భారతీయ జెండాను పట్టుకున్న వారి మీద దాడి చేయట్లేదు కాబట్టి, పాలస్తీనా ముస్లింలు భారతీయ జెండాను వాడి పాలస్తీనా నుండి బయటపడుతున్నారాని హిందీ లో రాసుకొచ్చారు .

పాలస్తీనా ప్రజలు భారతీయ జెండాను చూపి తప్పించుకుంటున్నారు అనే పోస్ట్ స్క్రీన్ షాట్(సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఈ వీడియో ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయెల్ హమస్ యుద్దానికి, పాలస్తీనాకి సంబంధించినది కాదని మేము తెలుసుకున్నాము.

వాస్తవం ఏమిటి?

రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఆధారంగా ఇది ఆగస్టు 31 2023 నాడు ఫలక్ హక్ అనే యూజర్ తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారని తెలుసుకున్నాము. ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయెల్-హమస్ యుద్ధం అక్టోబర్ 7, 2023 నాడు మొదలయ్యింది. దీని ప్రకారం ఈ యుద్ధం ప్రారంభానికి ముందే తీసిన వీడియో అని అర్దమయ్యింది. పైగా ఈ వీడియో షేర్ చేస్తూ శీర్షికగా ‘అర్బాయీన్ వాక్ 2013’ అని రాశారు. 

ఫాక్ట్ చెకింగ్ సంస్థ, బూమ్, ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యజమాని భర్త అయిన అలీ హక్ తో మాట్లాడింది. “ఇది పాలస్తీనాకి చెందిన వీడియో కాదు. ఇరాక్ లోని కర్బాలాలో ఆగస్ట్ 20, 2023 నాడు నేను తీసిన వీడియో. నడుస్తున్న మహిళల బృందంలో నా భార్య కూడా ఉంది. నజఫ్ నుండి కర్బాలా ద్వారకు ఆర్బాయీన్ నడకలో భాగంగా వారు నడిచారు”, అని ఆయన తెలిపారు. తాను, తన భార్య కర్ణాటకలోని బీదర్ కి చెందినవారిమని కూడా తెలిపారు. లాజికల్లీ ఫ్యాక్ట్స్ కూడా ఆ అకౌంటు యూజర్ ని సంప్రదించింది. వారి నుండి జవాబు వచ్చిన వెంటనే ఈ కథనంలో పొందుపరుస్తాము. 

అల్ జజీరా ప్రకారం, ప్రతీ ఏడాది ఇరాక్ లో అర్బాయీన్  నడక జరుగుతుంది.  దీనిలో భాగంగా చాలా మంది కాలినడకన దేశం నలుమూలల నుండి కర్బాలా వరకు 20 రోజుల పాటు నడుస్తారు.
 
ఇది క్రీస్తు శకం 680లో జరిగిన యుద్ధంలో చనిపోయిన ఇమామ్ హుస్సైన్ 40వ రోజు సందర్భంగా ఆయన జ్ఞాపకార్ధం చేస్తారు. ఇమామ్ హుస్సైన్ సమాధి కర్బాలా లో ఉంది. బ్రిటాన్నిక ప్రకారం ఇమామ్ హుస్సైన్ ప్రోఫేట్ మహమ్మద్ మనవడు. ఈయనను షియా ముస్లింలు మూడవ ఇమామ్ గా కొలుస్తారు. 

ఎన్ డి టి వి ప్రకారం, భారతదేశానికి చెందిన కొన్ని లక్షల మంది షియా ముస్లింలు ఈ నడకలోపాల్గొనడానికి ప్రతి సంవత్సరం ఇరాక్ వెళతారు. అలాగే ఈ నడకలో పాల్గొనే భారతీయులు భారతదేశం జెండా పట్టుకుని నడుస్తారు అని కూడా ఈ కథనంలో పేర్కొన్నారు. అలాగే, ఒక మిడ్ డే పత్రికా కథనంలో ఈ యాత్రకు వెళ్ళిన వారు భారతీయ జెండాను పట్టుకుని ఉన్న ఫొటోలు ఉన్నాయి.

అర్బాయీన్  నడకలో ప్రజలు భారతీయ జెండాని పట్టుకుని ఉన్న ఫోటోలు(సౌజన్యం: మిడ్ డే/స్క్రీన్ షాట్)

ఇరాక్ నుండి ఎన్ డి టి వి వారు ఇచ్చిన క్షేత్ర స్థాయి కథనం ఈ శీర్షికతో యూట్యూబ్ లో పోస్ట్ చేసి ఉంది. “Karbala: Arbaeen के मौके पर Karbala के रास्ते में Najaf शहर में भारतीय तीर्थयात्रियों से बातचीत”. ఈ వీడియోని సెప్టెంబర్ 6 2023 నాడు పోస్ట్ చేశారు.ఈ వీడియోలో కూడా భారతీయులు భారత దేశ జెండా పట్టుకుని అర్బాయీన్  నడకలో పాల్గొనటాన్ని చూపించారు.

ఇరాక్ నుండి ఎన్ డి టి వి రిపోర్ట్ (సౌజన్యం: యూట్యూబ్)

తీర్పు

ఇది ఆగస్టు 2023లో ఇరాక్ లో అర్బాయీన్ నడక సందర్భంలో తీసిన వీడియో. దీనికి ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయెల్ హమస్ యుద్ధానికి సంబంధం లేదు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(ఆనువాదం: రాజేశ్వరి పరస)

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.