ఫేక్ వార్తా కథనం షేర్ చేసి తెలంగాణ ఎన్నికలకి సంబంధించి తెలుగుదేశం కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరిందని క్లైమ్ చేశారు

ద్వారా: రోహిత్ గుత్తా
నవంబర్ 23 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఫేక్ వార్తా కథనం షేర్ చేసి తెలంగాణ ఎన్నికలకి సంబంధించి తెలుగుదేశం కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరిందని క్లైమ్ చేశారు

వార్తా కథనం ఫొటో షేర్ చేస్తూ పెట్టినస్ పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు ఫేక్

దిశ పత్రిక అటువంటి కథనాన్ని ప్రచురించలేదు. ఇది ఫేక్ అని ఈ పత్రిక స్పష్టం చేసింది.

క్లైమ్ ఐడి 6d1a6095

క్లైమ్ ఏమిటి?

నవంబర్ 30 నాడు జరగనున్న తెలంగాణ ఎన్నికల నేపధ్యంలో దిశ దినపత్రిక ప్రచురించిన కథనం అని చెబుతూ ఒక వార్తా కథనం ఫొటో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. ఈ కథనం శీర్షిక “చంద్రబాబుతో రేవంత్ రెడ్డి అర్థరాత్రి భేటీ?” అని ఉంది. శీర్షిక కింద “హస్తం పార్టీ గెలుపునకు చంద్రబాబు సూచనలు?”, “అవసరమైతే డబ్బులు కూడా పంపిస్తానని హామీ”, “కానీ ఏపీలో తెలంగాణ విలీనం చేయాలని షరతు”, “బాబు ఒప్పందాన్ని అంగీకరించిన రేవంత్ రెడ్డి”, “రేవంత్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు, తెలంగాణ ఉద్యమకారులు” అనే ముఖ్య పాయింట్లు ఉన్నాయి. ఈ పోస్ట్స్ ఆర్కైవ్ వెర్షన్స్ ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ  చూడవచ్చు. 

చంద్రబాబు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు. తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షం. అలాగే తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులలో కూడా పనిచేస్తున్నది. రాబోయే తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయకూడదని తెలుగుదేశం నిర్ణయించుకుంది.

దశాబ్దాల తరబడి సాగిన భారీ ఉద్యమం తరువాత 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు.  

దిశ పత్రిక కథనంగా చెప్పబడుతున్న వార్తా కథనాన్ని పోస్ట్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

మేము ఏమి తెలుసుకున్నాము?

సంబంధిత కీ వర్డ్స్ వాడి దిశ ఇటువంటి కథనాన్ని ఏమైనా ప్రచురించిందా అని వెతికాము. అయితే అటువంటి కథనమేదీ మాకు కనపడలేదు. 

ఆ తరువాత వైరల్ ఇమేజ్ లో ఉన్న శీర్షిక పైన ఉన్న చిన్న వ్యాఖ్యలని చూశాము. రెండు వరుసలలో రెండు అసంపూర్ణ వ్యాఖ్యలు అక్కడ ఉన్నాయి. “.. వినడం లేదని, పోటీలో ఉంది తీరుతామని వారు..”, “.. సాగర్ ముంపు బాధితులు, నిరుద్యోగులు నామి..” అనేవి ఈ రెండు వ్యాఖ్యలు. దీనిబట్టి ఈ రెండు వ్యాఖ్యలు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్, ఎన్నికలలో అభ్యర్ధుల గురించని అర్థమయ్యింది. అలాగే ఈ వ్యాఖ్యల పక్కన లేత గోధుమ రంగులో ఉన్న ఇన్ సెట్ ని మనం చూడవచ్చు.

వైరల్ ఇమేజ్ లో వార్తా కథనంగా చెప్పబడుతున్న దానిపైన ప్రచురించిన మరొక కథనంలోని వ్యాఖ్యలు మనం చూడవచ్చు  (సౌజన్యం: ఫేస్బుక్/స్క్రీన్ షాట్)

దిశ పత్రిక మల్లన్న సాగర్ బాధితులు, నిరుద్యోగులు ఎన్నికలలో పోటీ చేయడం గురించి ఏమైనా కథనం ప్రచురించిందా అని వెతికాము. నవంబర్ 15 నాడు ఒక కథనం ప్రచురించింది అని, అందులో పైన పేర్కొన్న అసంపూర్ణ వ్యాఖ్యలు ఉన్నాయని తెలుసుకున్నాము. పత్రిక ప్రింట్ ఎడిషన్ లో నవంబర్ 15 నాడు మూడవ పేజీలో ఈ కథనం వచ్చింది. వైరల్ ఇమేజ్ లో కనిపించిన లేత గోధుమ రంగు ఇన్ సెట్ ఇందులో కూడా చూడవచ్చు.

దిశలో నవంబర్ 15 నాడు వచ్చిన కథనం శీర్షిక “కేసీఆర్ పరేషాన్”. దాని కింద “అధినేతకు తప్పని గజ్వేల్, కామారెడ్డి కష్టాలు” అని ఉంది. కేసీఆర్ తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత. తను ఈ ఎన్నికలలో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్నారు. ఈ కథనంలో మల్లన్న సాగర్ నిర్వాసితులు, నిరుద్యోగులు కేసీఆర్ మీద పోటీ చేస్తున్నారని రాశారు. 

కేసీఆర్ గురించిన కథనం ఉన్న నవంబర్ 15 నాటి ఎడిషన్ (సౌజన్యం: దిశ ఈ పేపర్/స్క్రీన్ షాట్)

వైరల్ ఇమేజ్ లో ఆ చంద్రబాబు-రేవంత్ కథనం ఈ కేసీఆర్ కథనం కిందనే ఉన్నట్టు ఉంది. అయితే నవంబర్ 15 ఎడిషన్ లో ఆ రేవంత్-చంద్రబాబు కథనమే లేదు. కేసీఆర్ కథనం కింద వేరే రెండు వార్తా కథనాలు ఉన్నాయి.

ఈ క్లైమ్ సర్కులేట్ మొదలయ్యిన నవంబర్ 15 నుండి వచ్చిన ప్రతి దిశ ఎడిషన్ చూశాము. అందులో ఎక్కడా కూడా ఈ రేవంత్-చంద్రబాబు వార్త లేదు.

దిశ పత్రిక కూడా ఈ వార్తా కథనం గురించి రెండు స్పష్టమైన వివరణలు ఇచ్చింది. ఒక వివరణ వారి తెలంగాణ డైనమిక్ ఎడిషన్ లో ఇవ్వగా, రెండో దానిని తెలంగాణ ఎడిషన్ లో ఇచ్చారు. ఈ రెండూ కూడా నవంబర్ 16 నాడు ఇచ్చారు. ఈ వివరణలో దిశ పత్రిక తాము ఈ కథనాన్ని ప్రచురించలేదని, తమ విశ్వసనీయతని దెబ్బతీసే కుట్రలో భాగంగా ఇది చేశారని, తాము దీని గురించి పోలీసులకి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ వివరణ శీర్షిక “దిశ పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ క్లిప్పింగ్స్..”

అలాగే చంద్రబాబు-రేవంత్ రహస్య సమావేశం అంటూ మరే పత్రికలో కూడా ఎటువంటి వార్తా రాలేదు.

తీర్పు

దిశ పత్రిక ప్రచురించిన కథనం అని చెబుతూ ఒక ఫేక్ ఇమేజ్ ని సర్కులేట్ చేసి తెలంగాణ ఎన్నికలకి సంబంధించి రేవంత్-చంద్రబాబు ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని క్లైమ్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ ఫేక్ అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.