పాత వీడియో షేర్ చేసి జగన్ మోహన్ రెడ్డికి మొన్న లండన్ లో లభించిన ఘన స్వాగతం అని క్లైమ్ చేశారు

ద్వారా: రాజేశ్వరి పరస
సెప్టెంబర్ 19 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
పాత వీడియో షేర్ చేసి జగన్ మోహన్ రెడ్డికి మొన్న లండన్ లో లభించిన ఘన స్వాగతం అని క్లైమ్ చేశారు

వైరల్ వీడియో స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/ఫేస్బుక్/స్క్రీన్ షాట్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

వైజాగ్ విమానాశ్రయంలో 2018 లో తీసిన వీడియోని లండన్ లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లభించిన అపూర్వ స్వాగత వీడియో అని షేర్ చేశారు.

క్లైమ్ ఐడి 72747f69

క్లైమ్ ఏమిటి?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన కూతుళ్లని కలవడానికి తన భార్యతో కలిసి సెప్టెంబర్ 2 నాడు లండన్ వెళ్లారు. ది న్యూ మినిట్ లో కథనం ప్రకారం ఆయన 10 రోజుల తరువాత తిరిగి వచ్చారు. ఈ నేపధ్యంలో ఆయన లండన్ వెళ్ళినప్పుడు ఆయనకి ఘన స్వాగతం లభించింది అని చెబుతూ ఒక క్లైమ్ సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నది. అటువంటి ఒక పోస్ట్ ఎక్స్ (పూర్వపు ట్విట్టర్)లో సర్కులేట్ అవుతున్నది. “ఆంధ్రాలోనే అనుకున్నాం ఆంధ్రాను తలదన్నే విధంగా ఉంది జగనన్నకు ఫాలోయింగ్ లండన్ లో”, అని ఒకరు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ తో పాటు ఒక వీడియో షేర్ చేశారు. అందులో తెల్ల బట్టలు వేసుకున్న ఒక వ్యక్తికి జనాలు స్వాగతం పలుకుతున్నారు. ఈ వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని ఈ పోస్ట్ చేసినవాళ్ళు తెలిపారు. ఈ వ్యక్తి కారు ఎక్కుతూ జనాలకి తన నమస్కారాలు తెలియచేస్తున్నారు. ఈ పోస్ట్ ఆర్కైవ్ ఇక్కడ చూడవచ్చు. 

యూట్యూబ్ లాంటి ఇతర సామాజిక మాధ్యమాలలో కూడా ఇదే క్లైమ్ సర్కులేట్ అయ్యింది. ఆ పోస్ట్ ఆర్కైవ్ లింక్స్ ఇక్కడ , ఇక్కడ చూడవచ్చు. 

వైరల్ వీడియో స్క్రీన్ షాట్ (సౌజన్యం: యూట్యూబ్/స్క్రీన్ షాట్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

 

అయితే ఈ వీడియో మొన్నీ మధ్య లండన్ లో తీసిన వీడియో అనే క్లైమ్ అబద్ధం. ఐది ఆంధ్ర ప్రదేశ్ లో 2018 లో తీసిన వీడియో. 

వాస్తవం ఏమిటి?

ఈ వీడియోని లాజికల్లీ ఫ్యాక్ట్స్ చాలా క్షుణ్ణంగా గమనించినప్పుడు ఇది లండన్ కి చెందిన వీడియో కాదేమోననిపించే క్లూస్ కొన్ని దొరికాయి. విమానాశ్రయంలాగా కనిపిస్తున్న ప్రాంతంలో జనాలని పోలీసులు అదుపు చేస్తున్న సన్నివేశం మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఇందులో పోలీసులు భారతదేశ పోలీసులు వేసుకునే ఖాకీ రంగు సమదుస్తులు ధరించి ఉన్నారు. లండన్ నగర పోలీసుల ఫేస్బుక్ పేజిలో చూస్తే లండన్ లో పోలీసులు నల్ల రంగు సమదుస్తులు వేసుకుంటారని తెలిసింది. 

వైరల్ వీడియోలో పోలీసులు వేసుకున్న సమదుస్తులు, లండన్ పోలీసుల సమదుస్తుల మధ్య పోలిక (ఎక్స్/ఫేస్బుక్/CityofLondonPolice/స్క్రీన్ షాట్స్)

ఇటువంటి వీడియోనే ఒకటి మాకు యూట్యూబ్ లో లభించింది. ఈ వీడియోని ‘సినిమా పాలిటిక్స్’ అనే యూట్యూబ్ హ్యాండిల్ నవంబర్ 11, 2018 నాడు అప్లోడ్ చేశారు. ఈ వీడియో శీర్షిక “ఘటన తరువాత వై ఎస్ జగన్ కి వైజాగ్ విమానాశ్రయంలో ఘన స్వాగతం” అని ఉంది. ఈ వీడియో, వైరల్ వీడియోలో అవే సన్నివేశాలు మాకు కనిపించాయి. ఉదాహరణకి ఖాకీ రంగు దుస్తులలో ఉన్న పోలీసులు జనాలని అదుపు చేయడం. తెల్ల చొక్కా వేసుకున్న జగన్ నల్ల రంగు కారు ఎక్కడం కూడా. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి యోనో ఆప్ హోర్డింగ్.

 వైరల్ వీడియో, 2018 లో అప్లోడ్ చేసిన వీడియో మధ్య పోలిక (సౌజన్యం: ఎక్స్/యూట్యూబ్/స్క్రీన్ షాట్స్)

జగన్ మోహన్ రెడ్డి మీద విశాఖపట్నం విమానాశ్రయంలో కత్తి దాడి జరిగిన తరువాత కొన్ని రోజులకి తీసిన వీడియో ఇది అని మేము తెలుసుకున్నాము. ది హిందూలో కథనం ప్రకారం అక్టోబర్ 25, 2018 నాడు విమానాశ్రయంలోని ఒక రెస్టారెంట్ లో  పని చేసే ఒక వెయిటర్ సెల్ఫీ దిగుతాను అని చెప్పి జగన్ మీద దాడి చేశాడు. ఆ సమయంలో జగన్ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్రమంతటా తిరుగుతున్నారు. న్యాయస్థానంలో హాజరవడానికి విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆయన చేతికి గాయాలు కాగా హైదరాబాద్ లో వైద్యం చేపించుకున్నారు. వైద్యం తరువాత ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మళ్ళీ నవంబర్ 12, 2018 నుండి ఆయన పాదయాత్ర కొనసాగించారు.

తీర్పు

2018 నాటి వీడియో షేర్ చేసి లండన్ లో జగన్ కి ఘనమైన స్వాగతం లభించింది అని సామాజిక మాధ్యమాలలో క్లైమ్ చేశారు. ఇది వైజాగ్ విమానాశ్రయంలో తీసిన వీడియో. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని నిర్ధారించాము. 

 

(అనువాదం- గుత్తా రోహిత్)

 

 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.