ఒక ఫేక్ వార్తా కథనం సృష్టించి తెలుగుదేశం నాయకులు ‘మహాసేన’ రాజేష్ మహిళలని అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు

ద్వారా: రోహిత్ గుత్తా
అక్టోబర్ 3 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఒక ఫేక్ వార్తా కథనం సృష్టించి తెలుగుదేశం నాయకులు ‘మహాసేన’ రాజేష్ మహిళలని అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు

ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన దళిత రాజకీయ నాయకులు 'మహాసేన' రాజేష్ మహిళలని అక్రమ రవాణా చేస్తున్నారని ఆంధ్ర ప్రభ పేర్కొందని క్లైమ్ చేస్తున్న వైరల్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/మెటా/స్క్రీన్ షాట్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఆంధ్ర ప్రభ ఇటువంటి కథనమేమి ప్రచురించలేదు. మహాసేన రాజేష్ గురించిన ఈ వార్తా క్లిప్ ఫేక్ అని ఆంధ్ర ప్రభ మాతో ధృవీకరించింది.

క్లైమ్ ఐడి e72dc819

క్లైమ్ ఏంటి?

సామాజిక మాధ్యమాలలో తప్పుడు సమాచారం షేర్ చేసిన చరిత్ర ఉన్న ‘తత్వం అసి’ అనే ఒక ఎక్స్ (పూర్వపు ట్విట్టర్)  యూజర్  ఆంధ్ర ప్రభ పత్రికలో వచ్చిన కథనం అని చెబుతూ ఒక ఫొటో పోస్ట్ చేశారు. “దళిత ముసుగులో విదేశాలకు మహిళల సప్లై!” అనేది ఈ కథనం శీర్షిక. ఈ శీర్షిక కింద “ఉమెన్ ట్రాఫికింగ్ లో దిట్ట సరిపల్లి రాజేష్”, “ మతం పేరుతో మహిళలకు గాలం”, రౌడీ షీటర్ స్థాయి నుండి ఆడీ కారు కొనే స్థాయికి” అని ఉప-శీర్షికలు ఉన్నాయి.

‘మహాసేన’ రాజేష్ గా సూపరిచితులైన సరిపెళ్ల రాజేష్ దళిత సామాజికవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత. “విదేశాలకి మహిళలని సప్లై చేస్తున్నాడు”, “క్రైస్తవం పేరు మీద మహిళలకి గాలం వేస్తున్నాడు” , “భారీగా డబ్బు సంపాదించాడు” అని సరిపెళ్ల రాజేష్ గురించి ఆంధ్ర ప్రభ కథనం పేరు మీద షేర్ చేసిన ఈ ఫొటోలో ఉంది. ఆయన వ్యక్తిగత జీవితం గురించి కూడా అనేక క్లైమ్స్ ఇందులో చేశారు. 

“ఈ కథనం ప్రకారం ఈ వ్యక్తి మహిళలని అక్రమ రవాణా చేస్తున్నాడు, అలాగే ఈ హిందూ వ్యతిరేకి విదేశీయులకి మహిళలని సమకూరుస్తున్నాడు అనే ఆరోపణలు ఉన్నాయి. మత మార్పిడి పేరు మీద మహిళలని ట్రాప్ చేస్తున్నాడు. తన లైంగిక వాంఛ తీరాక ఆ మహిళలని విదేశాలకి అమ్మేస్తున్నాడు”, అనే శీర్షికతో ఈ యూజర్ ఈ ఫొటోని ఎక్స్ లో షేర్ చేశారు. ఈ పోస్ట్ ఆర్కైవ్ ఇక్కడ చూడవచ్చు. 

ఇటువంటి క్లైమ్ తోనే ఇదే ఫొటో ఫేస్బుక్ లో కూడా సర్కులేట్ అవుతున్నది. అటువంటి ఒక ఫేస్బుక్ పోస్ట్ ఆర్కైవ్ ఇక్కడ చూడవచ్చు. 

ఆంధ్ర ప్రభ కథనం పేరు మీద వైరల్ అయిన ఫొటో స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/మెటా/స్క్రీన్ షాట్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఆంధ్ర ప్రభ ఇటువంటి కథనం ఏమీ ప్రచురించలేదు. ఇది ఒక ఫేక్ ఫొటో. 

మేము ఏమి కనుగొన్నాము?

కొన్ని సందోర్భచితమైన కీ వర్డ్స్ వాడి 'మహాసేన' రాజేష్ గురించి ఇటువంటి ఆరోపణలతో ఆంధ్ర ప్రభ ఏదైనా కథనం ప్రచురించిందా అని మేము వెతికాము. అయితే అటువంటి కథనమేదీ మాకు కనపడలేదు. 

ఆ తరువాత ఈ వైరల్ ఫొటోలో బ్యానర్ శీర్షిక పైన ఉన్న పదాలని, వ్యాఖ్యలని చూశాము. నాలుగు కాలమ్ లలో రెండు రెండు అసంపూర్తి వ్యాఖ్యలు అక్కడ ఉన్నాయి. “అయితే ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అటవీ శాఖ సీజే ధర్మాసనం ముందు అప్పీల్ చేసింది”, “...ధర్మాసనం సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించింది” లాంటి వ్యాఖ్యలు ఉన్నాయి. రాష్ట్ర అటవీ శాఖకి సంబంధించిన కేసుని ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు విచారిస్తున్నదని మేము దీని ద్వారా ఊహించాము. 

ఆంధ్ర ప్రభ కథనంగా  చెప్పబడుతున్న కథనం పైన ఉన్న టెక్స్ట్ (సౌజన్యం: ఎక్స్/మెటా/స్క్రీన్ షాట్)

హై కోర్టు, రాష్ట్ర అటవీ శాఖకి సంబంధించిన కథనాల కోసం మేము ఆంధ్ర ప్రభ ఈ-పేపర్ ఆర్కైవ్స్ వెతికాము.

ఆగస్ట్ 30 నాడు ప్రచురించిన ఇదే టెక్స్ట్- అంటే రాష్ట్ర అటవీ శాఖ, సీజీ ధర్మాసనం, సింగిల్ జడ్జి బెంచ్ ఉత్తర్వులు- ఉన్న కథనం ఒకటి మాకు అప్పుడు దొరికింది. ఆంధ్ర ప్రభ పత్రిక రెండవ పేజీలో ఈ కథనం వచ్చింది. 

ఎర్ర చందనం గురించి ఆంధ్ర ప్రభ పత్రికలో వచ్చిన కథనం స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఆంధ్ర ప్రభ ఈ-పేపర్/స్క్రీన్ షాట్)

ఈ ఆగస్ట్ 30 నాడు వచ్చిన కథనం శీర్షిక “ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసుల్లో సిట్ పై స్టే”. ఎర్ర చందనం స్మగ్లింగ్ విషయంలో సిట్ ఏర్పాటు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలపై సీజే ధర్మాసనం స్టే విధించింది అని ఈ కథనంలో ఉంది. 

ఎర్ర చందనం కేసులో సింగిల్ జడ్జి ధర్మాసనం ఆదేశం మీద స్టే విధించారు అంటూ ఆంధ్ర ప్రభలో ఆగస్ట్ 30, 2023 నాడు వచ్చిన కథనం స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఆంధ్ర ప్రభ ఈ-పేపర్/స్క్రీన్ షాట్)

'మహాసేన' రాజేష్ గురించి ఆంధ్ర ప్రభలో ఈ ఎర్ర చందనం కథనం కింద కథనం ప్రచురించారు అన్నట్టు వైరల్ ఫొటోలో ఉంది. అయితే ఆగస్ట్ 30 నాడు ఆంధ్ర ప్రభ రెండవ పేజీలో ఈ ఎర్ర చందనం కథనమే చివరిది. దీని కింద ఇంకే వార్త లేదు. 

వైరల్ ఫొటోలో ఉన్న టెక్స్ట్ ఆంధ్ర ప్రభ కథనం మధ్య పోలిక (సౌజన్యం: ఎక్స్/మెటా/ఆంధ్ర ప్రభ ఈ-పేపర్/స్క్రీన్ షాట్స్)

ఆగస్ట్ 30  నుండి సెప్టంబర్ 20 మధ్య ఆంధ్ర ప్రభలో వచ్చిన ప్రతి వార్తని మేము చూశాము. సెప్టంబర్ 20 ఎందుకంటే ఈ ఫొటో అప్పుడే వైరల్ అవ్వటం మొదలుపెట్టింది కనుక.  అయితే ‘మహాసేన’ రాజేష్ మీద ఇటువంటి కథనమేది మాకు ఆంధ్ర ప్రభలో కనిపించలేదు. 

ఆంధ్ర ప్రభ వారు ఈ కథనం ప్రచురించారో లేదో తెలుసుకోవటానికి వారిని లాజికల్లీ ఫ్యాక్ట్స్ సంప్రదించింది. అటువంటి కథనమేదీ తాము ప్రచురించలేదాని ఆంధ్ర ప్రభ జనరల్ మేనేజర్ పి. భాస్కర్ మాకు స్పష్టం చేశారు. అలాగే తాము తమ పత్రికలో ‘ముద్రిక’ ఫాంట్ వాడతామని, ఈ వైరల్ ఫొటోలో ఉన్న ఫాంట్ ‘పల్లవి’ అనే విషయాన్ని కూడా తెలియచేశారు.

‘మహాసేన’ రాజేష్ తన యూట్యూబ్ ఛానల్ లో ఆగస్ట్ 30, 2023 నాడు అప్లోడ్ చేసిన వీడియోలో తన మీద ఆరోపణలని ఖండించారు. ఇది తమ పత్రికలో వచ్చిన కాదని ఆంధ్ర ప్రభ తనకు స్పష్టం చేసిందని కూడా ఆయన అందులో తెలిపారు.

‘మహాసేన’ రాజేష్ మహిళలని అక్రమ రవాణా చేస్తున్నారని చెబుతూ ఏ విశ్వసనీయ పత్రిక కూడా ఎటువంటి కథనం ప్రచురించలేదు.

దీనిబట్టి ఈ వైరల్ ఫొటో ఆంధ్ర ప్రభ కథనం కాదని, ఇది ఫేక్ కథనం అని స్పష్టం అవుతున్నది.

తీర్పు

ఒక ఫేక్ వార్తా కథనం సృష్టించి తెలుగుదేశం నాయకులు ‘మహాసేన’ రాజేష్ మహిళలని అక్రమ రవాణా చేస్తున్నారని క్లైమ్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము.

 

(అనువాదం- గుత్తా రోహిత్) 

 

 

 

 

 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.