కేవలం రెడ్డి కులానికి చెందిన ఎస్ పి అధికారులకి మాత్రామే ఆంధ్ర ప్రదేశ్ డిజిపి పురస్కారాలు ఇవ్వలేదు

ద్వారా: రోహిత్ గుత్తా
డిసెంబర్ 21 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
కేవలం రెడ్డి కులానికి చెందిన ఎస్ పి అధికారులకి మాత్రామే ఆంధ్ర ప్రదేశ్ డిజిపి పురస్కారాలు ఇవ్వలేదు

ఆంధ్ర ప్రదేశ్ డిజిపి పెర్ఫార్మెన్స్ అవార్డులు పొందిన ఎస్ పి అధికారులు అందరూ ఒకే కులానికి చెందిన వారనే అర్థం వచ్చేటట్టు పెట్టిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఆంధ్ర ప్రదేశ్ డిజిపి 21 మంది ఎస్ పి అధికారులకి పెర్ఫార్మెన్స్ అవార్డులు ఇచ్చారు. అందులో ఆరుగురు మాత్రమే రెడ్డి కులానికి చెందిన వారు.

క్లైమ్ ఐడి a9942ded

క్లైమ్ ఏంటి?

డిసెంబర్ 16 నాడు ఆంధ్ర ప్రదేశ్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కే. వి. రాజేంద్ర నాథ్ రెడ్డి 77 మంది పోలీసు ఉద్యోగులకి పనితీరులో ప్రతిభ కనబరిచినందుకు పురస్కారాలు ఇవ్వటం జరిగింది. డిజిపి డిస్క్ అవార్డులుగా పిలవబడుతున్న వీటిని అదనపు డిజిపి నుండి కానిస్టేబుల్ స్థాయి వరకు 2022లో ఉత్తమ పనితీరు కనబరిచిన 77 మందికి ఇవ్వటం జరిగింది. 

ఈ నేపధ్యంలో డిజిపి అవార్డులు ఇచ్చిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ పి) అధికారులు అందరూ కూడా రెడ్డి కులానికి చెందిన వారేనని ఒక క్లైమ్ సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. రెడ్డి కులస్థులు ఎక్కువుగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉంటారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు, ఆంధ్ర ప్రదేశ్ డిజిపి ఈ కులానికి చెందిన వారే.

ఎక్స్ (పూర్వపు ట్విట్టర్)లో ఒకరు ఒక ఫొటో కొలాజ్ ని షేర్ చేసి, “26 జిల్లాలలో కేవలం 5 జిల్లాల ఎస్పీలు మాత్రమే “బెస్ట్ పెర్ఫార్మర్స్” గా గుర్తింపు పొందిన ఒక సామాజిక వర్గం”, అని రాసుకొచ్చారు. ఈ ఫొటో కొలాజ్ లో ప్రతి ఫొటో మీద అందులో అవార్డ్ స్వీకరిస్తున్న ఎస్ పి అధికారి పేరు ఉంది. వారందరి పేరులో రెడ్డి అని ఉంది. దీని ద్వారా ఈ అవార్డ్ పొందిన ఎస్ పి అధికారులు అందరూ రెడ్డి కులానికి చెందిన వారేనని చెప్పటం ఈ పోస్ట్ ఉద్దేశం. ఈ పోస్ట్, ఇటువంటి ఇతర పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ  మరియు ఇక్కడ  చూడవచ్చు. 

సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన క్లైమ్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

మేము ఏమి తెలుసుకున్నాము?

అవార్డులు పొందిన పోలీసుల జాబితా కోసం మేము చూడగా మాకు ఎక్స్ లో ఒక త్రెడ్ కనిపించింది. ఆంధ్ర ప్రదేశ్ పోలీసు వారి అధికారిక అకౌంట్ నుండి డిసెంబర్ 16 నాడు పోస్ట్ చేసిన త్రెడ్ అది. అందులో అవార్డుల కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలతో పాటు అవార్డులు అందుకున్న పోలీసుల జాబితా కూడా ఉంది. 

ఈ జాబితా ప్రకారం 21 జిల్లాల ఎస్ పి అధికారులకి పతకాలు ఇవ్వటం జరిగింది. వీరితో పాటు అదనపు డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడిజిపి), ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజి), డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డిఐజి), అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఏఐజి) లాంటి అధికారులకి కూడా పతకాలు ప్రధానం చేయడం జరిగింది. 21 మంది ఎస్ పి అధికారులలో 5 కి బంగారు పతాకం, ఇతరులకి వెండి పతాకం ప్రధానం చేశారు. 

ఈ 21 మంది ఎస్ పి అధికారులలో చిత్తూరు, నెల్లూరు, శ్రీ సత్య సాయి, పల్నాడు, నంద్యాల, తిరుపతి జిల్లాల ఎస్ పి అధికారులు రెడ్డి కులానికి చెందినవారు. ఈ జిల్లాల క్రమం అనుగుణంగా వీరి పేర్లు రిషంత్ రెడ్డి, తిరుమలేశ్వర్ రెడ్డి, ఎస్. వి. మాధవ్ రెడ్డి, వై. రవి శంకర్ రెడ్డి, కే. రఘువీరా రెడ్డి, పి. పరమేశ్వర రెడ్డి. ఇందులో రిషంత్ రెడ్డికి బంగారు పతాకం ప్రధానం చేయగా, ఇతరులకి వెండి పతకాలు ప్రధానం చేశారు.

పతకాలు పొందిన ఇతర 15 మంది ఎస్ పి అధికారులలో రెడ్డేతర తెలుగు అధికారులు, తెలుగు మాతృ భాష కాని అధికారులు ఉన్నారు.  

ఈ అవార్డుల ప్రధానోత్సవం, ప్రాతిపదిక గురించి తెలుసుకోవడానికి లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఆంధ్ర ప్రదేశ్ పోలీసు ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించింది. పేరు తెలపడానికి ఇష్టపడని కార్యాలయ ప్రజా సమాచార విభాగానికి చెందిన కీలక అధికారు ఒకరు మాతో మాట్లాడుతూ చేసిన నేరానికి శిక్ష పడేటట్టు చేయడం, శాంతి భద్రతలు మెరుగుపరచడం, మహిళల రక్షణకి చర్యలు తీసుకోవడం లాంటి అంశాలలో 2022 సంవత్సరానికి కానూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని పోలీసు శాఖకి  చెందిన ఒక అంతర్గత కమిటీ ఈ అవార్డులకి ఎంపిక చేసిందని తెలిపారు.

ఈ విషయం గురించి డిసెంబర్ 18 నాడు ఆంధ్ర ప్రదేశ్ పోలీసు వారు ఎక్స్ లో ఒక వివరణ ఇచ్చారు. డిజిపి డిస్క్ అవార్డుల గురించి ఈ “పై పోస్టులో ఫేక్ న్యూస్ కలదు. ఇటువంటి అవాస్తవ వార్తలు, పోస్ట్, షేర్ లేదా ప్రచారం చేసినవారు ఎవరైనా చట్టపరమైన చర్యలకు అర్హులు” అని తెలిపారు. 

దీని బట్టి ఈ అవార్డు పొందిన ఎస్ పి అధికారులు అందరూ రెడ్డి కులానికి చెందిన వారు కాదనేది స్పష్టం అవుతున్నది. 

తీర్పు

ఆంధ్ర ప్రదేశ్ డిజిపి నుండి 2022 సంవత్సరానికి కానూ పెర్ఫార్మెన్స్ అవార్డులు పొందిన ఎస్ పి అధికారులు అందరూ రెడ్డి కులానికి చెందిన వారని ఒక అబద్ధపు క్లైమ్ సర్కులేట్ అయ్యింది. 21 మంది ఎస్ పి అధికారులకి పతకాలు ప్రధానం చేస్తే, అందులో 6 మాత్రమే రెడ్డి కులానికి చెందిన వారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.