ద్వారా: రోహిత్ గుత్తా
ఆగస్టు 10 2023
కోయంబత్తూరు నుండి త్రిశూరుకు కుథిరన్ సొరంగం ద్వారా 10 నిమిషాలలో ప్రయాణించలేరు. ఆ సొరంగం పొడవు 1.6 కిలో మీటర్లు మాత్రమే.
నేపధ్యం
త్రిశూరు (కేరళ రాష్ట్రం లో ఒక నగరం) నుండి కోయంబత్తూరు (తమిళ నాడు రాష్ట్రం లో ఒక నగరం) మధ్య ప్రయాణ సమయం కేవలం 10 నిమిషాలకు తగ్గిపోయింది అంటూ సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో వైరల్ అయ్యింది. కుథిరన్ సొరంగం వల్ల ఇది సాధ్యపడింది అంటూ చెప్పుకొచ్చారు.
ఈ వీడియోతో పాటు షేర్ చేసిన ట్వీట్ లో “కోయంబత్తూరు నుండి త్రిశూరు సొరంగ మార్గం అందుబాటులోకి వచ్చింది. దీనితో 2 గంటల ప్రయాణం ఇప్పుడు పది నిమిషాలు మాత్రమే. ఇలాంటి మౌలిక సదుపాయాలు కల్పించినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇలాంటి వార్తల గురించి ఎటువంటి మీడియా సంస్థలు మాట్లాడవు” అని రాశారు. ఈ కథనం రాసే సమయానికి ఈ పోస్ట్ కి దాదాపుగా పది లక్షలు వ్యూస్ ఉన్నాయి.
అయితే, ఈ క్లెయిమ్ అబద్దం. ప్రయాణ సమయం 110 నిమిషాలు తగ్గలేదు (గంటా 50 నిమిషాలు). పైగా కుథిరన్ జంట సొరంగాలలో ఒకటి జులై 2021 నాడు మొదలయ్యింది. అలాగే రెండోది జనవరి 2022 నాడు ఓపెన్ అయ్యింది. ఇదే వైరల్ వీడియో ఇలాంటి క్లెయిమ్ తోనే ఇంతకమునుపు కూడా వైరల్ అయ్యింది.
వాస్తవం
కుథిరన్ సొరంగాన్నికేరళలోని పాలక్కాడ్- త్రిశూర్ మధ్య నిర్మించడం జరిగింది. ఈ 1.6 కిలోమీటర్ సొరంగ మార్గాన్ని, పీచి- వళహాని వన్యప్రాణ అభయారణ్యం మధ్య నిర్మించారు. ఈ సొరంగం కట్టడానికి మునుపు కుథిరన్ కొండ ద్వారా వాహనాలు ప్రయాణించాల్సి వచ్చేది. ఇది ప్రమాదాలు జరగడానికి పేరుగాంచిన ప్రదేశం. ఈ మార్గంలో ప్రమాదాలు మరియు రద్దీ సమస్యను తగ్గించడానికి కుథిరన్ సొరంగాన్ని ప్రారంభించారు.
గూగుల్ మ్యాప్స్ ప్రకారం కోయంబత్తూరు నుండి త్రిశూరు మధ్య దూరం 114 కిలోమీటర్లు. ఈ 1.6 కిలోమీటర్ సొరంగం ద్వారా ఈ దూరాన్నిప్రయాణించడానికి 2 గంటల 30 నిమిషాలు పడుతుంది, (ట్రాఫిక్ లేకపోతే). కాబట్టి రెండు గంటల ప్రయాణ సమయం ఉన్న దూరాన్ని 10 నిమిషాలలో చేరుకోలేరు. అయితే, కొత్తగా కట్టిన ఈ సొరంగం ద్వారా కుథిరన్ కొండని రెండు నిమిషాల లోపలే దాటవచ్చు.
పైగా ఈ సొరంగం, రెండు నగరాలను కనెక్ట్ చేయదు. ఇది కేవలం కుథిరన్ కొండను మాత్రమే బైపాస్ చేసి వెళ్తుంది.
తీర్పు
సొరంగం కేవలం 1.6 కిలోమీటర్లు పొడవు మాత్రమే ఉంటుంది. ఇది కేరళలోని కుథిరన్ కొండని బైపాస్ చేయడానికి నిర్మించారు.. ఇది ప్రయాణికులని ఒక నగరం నుంచి ఇంకో నగరానికి తీసుకువెళ్ళదు. కనుక మేము దీనిని అబద్ధం అని నిర్ధారించాము.