తెలంగాణాలో రాళ్ళ దాడికి సంబంధించిన పాత వీడియోని హర్యానాలో తాజాగా చోటుచేసుకున్న హింసకి సంబంధించినదిగా షేర్ చేస్తున్నారు

ద్వారా: రోహిత్ గుత్తా
ఆగస్టు 10 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
తెలంగాణాలో రాళ్ళ దాడికి సంబంధించిన పాత వీడియోని హర్యానాలో తాజాగా చోటుచేసుకున్న హింసకి సంబంధించినదిగా షేర్ చేస్తున్నారు

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

తెలంగాణలో 2022 లో జరిగిన ఒక రాజకీయ ర్యాలీలో జరిగిన ఘటనకి సంబంధించిన వీడియోని తాజాగా హర్యానాలో జరిగిన అల్లర్ల నేపధ్యంలో గురుగ్రామ్ లో జరిగిన హింసకి సంబ

క్లైమ్ ఐడి 1e7600f9

నేపధ్యం

ఉత్తర భారతదేశంలోని హర్యానాలోని నూహ్ జిల్లాలో మొదలయ్యి రాష్ట్రంలో ఇతర జిల్లాలకి పాకిన అల్లర్ల నేపధ్యంలో ఈ అల్లర్లకి సంబంధించిన వీడియోలు అని చెప్పి సంబంధం లేని అనేక వీడియోలో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. అటువంటి ఒక వీడియోలో ర్యాలీ కోసం గుమిగూడిన జనం మీద రాళ్ళు విసురుతున్న ఒక వీడియోని ఇది హర్యానాలోని గురుగ్రామ్ కి చెందిన వీడియో అని చెప్పి షేర్ చేశారు. ఈ వీడియోని ఎక్స్ (మునుపటి ట్విట్టర్) షేర్ చేస్తూ “హింస ఎలా మొదలుపెట్టాలి అని చూపిస్తూ గురుగ్రామ్ కి చెందిన ఒక వీడియో బయటకి వచ్చింది. ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటూ ఇరు వర్గాల మధ్య చిచ్చు పెడుతున్న ఈ వెధవలని తీవ్రంగా శిక్షించాలి,” (తెలుగు అనువాదం) అని ఒక యూజర్ రాసుకొచ్చారు. 

ఈ ఫ్యాక్ట్ చెక్ ప్రచురించే సమయానికి ఈ పోస్ట్ కి 45000 వ్యూస్ ఉన్నాయి. అనేక మంది యూజర్స్ ఇది గురుగ్రామ్ కి చెందిన వీడియో అని నమ్మారు. అయితే ఈ వీడియో హర్యానాకి చెందినది కాదని, ఈ వీడియో కనీసం ఆగస్ట్ 2022 నాటిదని లాజికల్లీ ఫ్యాక్ట్స్ కనుగొంది. 

వాస్తవం

ఈ వీడియోకి చెందిన కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే మరింత నాణ్యత కలిగిన ఇదే వీడియోని- కాకపోతే నిడివి కాస్త తక్కువున్నది- ఆగస్ట్ 24, 2022 నాడు ఎక్స్ (X) లో షేర్ చేశారని తెలిసింది. ఈ వీడియోని ‘మన_ప్రకాశం’ అనే హ్యాండిల్ వారు షేర్ చేశారు. అయితే అందులో ఈ వీడియోకి సంబంధించి ఎక్కడికి, ఎప్పటిది లాంటి సమాచారం ఏమీ లేదు. అయితే ఈ వీడియో కనీసం సంవత్సరం క్రితం నాటిది అనేది మాత్రం దీని ద్వారా స్పష్టమయ్యింది. 

మరింత నాణ్యత కలిగిన ఈ వీడియోని క్షుణ్ణంగా విశ్లేషిస్తే 0:55 నిడివి దగ్గర బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న ఒక తెల్ల రంగు బస్సు నంబర్ ప్లేట్ మీద ‘టిఎస్’ అనే అక్షరాలు కనిపించాయి. అలాగే ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న నీలం రంగు బస్సు వెనుకాల పచ్చ రంగులో ఉన్న రహదారి సూచీ బోర్డు కనిపించింది. దాని మీద ‘సూర్యాపేట 68 కెఎం’ అని రాసుంది. సూర్యాపేట దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ఒక నగరం. ఇక్కడ వాహనాల రిజిస్ట్రేషన్ సంఖ్య ‘టిఎస్’ అనే అక్షరాలతో మొదలవుతుంది. దీని బట్టి ఈ వైరల్ వీడియో తెలంగాణకి చెందినదని అర్థమవుతుంది. 

ఈ వీడియోలో ఉన్న విజువల్సే ఉన్న ఇంకొక వీడియోని మేము ఫేస్బుక్ లో గుర్తించాము. ‘న్యూస్ టుడే ఛానల్’ అనే పేజి ఆగస్ట్ 25, 2022 నాడు పోస్ట్ చేసిన వీడియోలో ఈ వైరల్ వీడియోలో ఉన్న నీలం రంగు బస్సు, భవనాలు ఉన్నాయి. ఈ వీడియో పోస్ట్ లో ఇచ్చిన వివరాలు ఈ వీడియో భారతీయ జనతా పార్టీ నాటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ర్యాలీ జరుగుతున్నప్పుడు తీసిన వీడియో అని సూచించే విధంగా ఉన్నాయి. “బిజెపి అధ్యక్షుని పాదయాత్రలో పోలీసుల సమక్షంలో రాళ్ళు రువ్విన బిజెపి కార్యకర్తలు”, అని ఈ వీడియో శీర్షిక ఉంది. 

భారత రాష్ట్ర సమితి నాయకులు, తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ  ఛైర్మన్ మన్నెక్రిశాంక్ కూడా ఈ వీడియోని ఎక్స్ లో ఆగస్ట్ 25, 2022 నాడు షేర్ చేశారు. బిజెపి సీనియర్ లీడర్ల ఆదేశానుసారం బిజెపి కార్యకర్తలు రాళ్ళు రువ్వారని ఆరోపిస్తూ ఈ వీడియో షేర్ చేశారు. 

ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ది ప్రింట్ మొదలుకుని వివిధ వార్తా సంస్థలు తెలంగాణలోని జనగామ జిల్లాలో దేవరుప్పల గ్రామంలో ఆగస్ట్ 15, 2022 నాడు బండి సంజయ్ పాదయాత్రలో రాళ్ళు రువ్విన ఘటన చోటుచేసుకునట్టు కథనాన్ని ప్రచురించాయి. పాదయాత్రలో బండి సంజయ్ బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చెయ్యని వాగ్ధానాల గురించి ప్రశ్నించినప్పుడు బిఆర్ఎస్ కార్యకర్తలు తిరిగి కేంద్ర ప్రభుత్వ పధకాల గురించి ప్రశ్నించారు. ఈ నేపధ్యంలో ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవ రాళ్ళ దాడికి కారణం అయ్యింది. 

తీర్పు

ఈ వీడియో ఈ మధ్య కాలంలో తీసింది కాదు, అలాగే హర్యానాకి చెందినదీ కాదు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని నిర్ధారించాము. 

 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.