కర్ణాటక కాంగ్రెస్ విజయోత్సవ సభ వీడియోలో కనిపించింది పాకిస్థాన్ జెండా కాదు

ద్వారా: రోహిత్ గుత్తా
ఆగస్టు 14 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
కర్ణాటక కాంగ్రెస్ విజయోత్సవ సభ వీడియోలో కనిపించింది పాకిస్థాన్ జెండా కాదు

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

వైరల్ వీడియోలో కనిపించిన జెండా ఇస్లామిక్ మత జెండా అని భత్కల్ పోలీసులు నిర్ధారించారు. ఇస్లామిక్ మత జెండా, పాకిస్థాన్ జాతీయ జెండా రెండూ వేరు వేరు.

క్లైమ్ ఐడి 8a3b147d

నేపధ్యం

కర్ణాటక ఎన్నికలలో 135 సీట్లతో కాంగ్రెస్ విజయం సాధించింది. బిజెపి 66 సీట్లు గెలుచుకోగా, జెడిఎస్ 19 సీట్లు గెలుచుకుంది. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత కర్ణాటకలో విజయోత్సవ సంబరాలు మొదలయ్యాయి. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలుపుతూ, విజయోత్సవ వీడియోలని, ఫొటోలని సామాజిక మాధ్యమాలలో షేర్ చేశారు. 

అటువంటి వీడియో ఒకదాన్ని ఒకరు ట్విట్టర్ లో ట్వీట్ చేసి కర్ణాటకలో గెలుపు అనంతరం భత్కల్ లో పాకిస్థాన్ జెండా ఎగరేశారు అని రాశారు.  భత్కల్ కర్ణాటకలో ఉత్తర కన్నడ జిల్లాలోని ఒక పట్టణం. 

“కర్ణాటకలో కాంగ్రెస్ విజయం వెంటనే  భత్కల్ లో ఇది జరుగుతున్నది”, అని రాసి బిజెపి ఐటి సెల్ అధ్యక్షుడు అమిత్ మాల్వియా ఒక వీడియో షేర్ చేశాడు. అందులో ప్రజలు వివిధ రంగుల జెండాలు ఎగరేస్తున్నారు. అందులో పచ్చ రంగు జెండాలు ఉన్నాయి, కాషాయం రంగు జెండాలూ ఉన్నాయి. 

 భత్కల్ లో పాకిస్థాన్ జెండా ఎగరేశారు అని కొంతమంది ప్రచారం చెయ్యగా, అమిత్ మాల్వియా మరికొందరు ఇదే వీడియో షేర్ చేసి “కాంగ్రెస్ ఇంకా ప్రభుత్వమే ఏర్పాటు చేయలేదు. కానీ అంతలోకే మనం ఏమి కోల్పోయామో చూడండి..” అంటూ రాసుకొచ్చారు. 

వాస్తవం

ఒక జంక్షన్ దగ్గర నాలుగు జెండాలు ఎగరేసినట్టు మనకి ఈ వీడియోలో కనిపిస్తుంది. 

ఈ వీడియోని జాగ్రత్తగా గమనించినట్టయితే అందులో మనకి ఈ నాలుగు జెండాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి ‘ఓం’ అని రాసున్న కాషాయ జెండా, ఒకటి కాంగ్రెస్ పార్టీ జెండా, ఒకటి బి ఆర్ అంబేద్కర్ బొమ్మ ఉన్న నీలి జెండా, ఇంకొకటి పచ్చ రంగు జెండా. ఈ పచ్చ రంగు జెండానే పాకిస్థాన్ జాతీయ జెండా అని తప్పుగా వ్యాఖ్యానించారు. 

దీనిని నిర్ధారించడానికి మేము ఈ పచ్చ జెండాని పాకిస్థాన్ జాతీయ జెండాతో పోల్చి చూశాము. ఈ పచ్చ రంగు జెండాకి పాకిస్థాన్ జెండాకి సంబంధం లేదు అని స్పష్టంగా నిర్ధారించగలిగాము. 

ఇస్లామిక్ మత జెండా, పాకిస్థాన్ జాతీయ జెండా రెండిటి రంగు, డిజైన్ ఒకేలా ఉండటంతో చాలా సందర్భాలలో ప్రజలు ఈ రెండు ఒకటే అని పొరబడుతుంటారు. అయితే పాకిస్థాన్ జాతీయ జెండాలో పచ్చ రంగు ప్రాంతం పక్కన తెల్ల రంగు చతురాస్రాకార ప్రాంతం ఉంటుంది. అలాగే పచ్చ రంగు ప్రాంతం మీద మధ్యలో తెల్ల రంగులో నెలవంక, నక్షత్రం ఉంటాయి. అయితే ఇస్లామిక్ మత జెండా కేవలం ఇస్లాం మతం సూచించే జెండా మాత్రమే. ఈ పచ్చ రంగు జెండా  రకరకాల డిజైన్లలో వివిధ చిహ్నాలతో ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వీడియోలో చూస్తే ఆ జెండా కేవలం పచ్చ రంగు జెండా. ఇందులో పచ్చ రంగు పక్కన తెలుపు రంగు ప్రాంతం లేదు, ఆలాగే మధ్యలో నెలవంక, నక్షత్రం కూడా లేవు. ఇటువంటి ఇస్లామిక్ మత జెండాలు ముస్లింల ఇళ్ళలో ఉంటాయి, ఆలాగే వివిధ ముస్లిం సంస్థలు కూడా ఇస్లామిక్ మత జెండాని వాడుతుంటాయి. 

ఈ విషయం నిర్ధారించడానికి లాజికల్లీ ఫ్యాక్ట్స్ భత్కల్ డిఎస్పి ని సంప్రదించింది. ఇది పాకిస్థాన్ జెండా అనే వ్యాఖ్యానం అబద్ధం అని డిఎస్పి స్పష్టం చేశారు. 

“ఈ వ్యాఖ్యానం అబద్ధం అని స్పష్టం చేస్తూ జిల్లా ఎస్పి ఇప్పటికే  ఒక ప్రకటన విడుదల చేశారు. భత్కల్ సర్కిల్ లో ఎవ్వరూ పాకిస్థాన్ జెండా ఎగరేయలేదు. ఈ విజయోత్సవ సంబరాలలో ప్రజలు నాలుగు జెండాలు ఎగరేశారు- ఒకటి కాషాయ జెండా, ఒకటి కాంగెస్ జెండా, ఒక బి ఆర్ అంబేద్కర్ జెండా, ఇంకొకటి ఇస్లామిక్ మత జెండా. ప్రజలు ఈ పచ్చ రంగు జెండాని ఇళ్ళల్లో కూడా వాడుతుంటారు. ఇది పాకిస్థాన్ జాతీయ జెండా కాదు”, అని డిఎస్పి మాకు తెలిపారు. 

తీర్పు

భత్కల్ లో జరిగిన కాంగ్రెస్ విజయోత్సవ సభలో పాకిస్థాన్ జాతీయ జెండా ఎగరేశారు అని అబద్ధపు ప్రచారం చేశారు. అక్కడ ఎగరేసింది ఇస్లామిక్ మత జెండా. కాబట్టి ఈ వార్త అబద్దం అని మేము నిర్ధారించాము. 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.