పాకిస్థాన్ కి చెందిన వీడియోని కర్ణాటకలో ప్రజలు విద్యుత్తు బోర్డు అధికారులతో వాగ్వాదానికి దిగిన వీడియో అని ప్రచారం చేస్తున్నారు

ద్వారా: రోహిత్ గుత్తా
ఆగస్టు 10 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
పాకిస్థాన్ కి చెందిన వీడియోని కర్ణాటకలో ప్రజలు విద్యుత్తు బోర్డు అధికారులతో వాగ్వాదానికి దిగిన వీడియో అని ప్రచారం చేస్తున్నారు

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

విద్యుత్తు బిల్లు గురించి వాదిస్తున్నట్టున్న వీడియో కర్ణాటకకి చెందిన 2023 నాటిది కాదు. పాకిస్థాన్ లోని కరాచీకి చెందిన 2020 నాటి వీడియో ఇది.

క్లైమ్ ఐడి def7f333

నేపధ్యం

కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుండి ఎన్నికలకి ముందు కాంగ్రెస్ ఇచ్చిన వాగ్ధానాల గురించి అనేక ఆరోపణలు ప్రచారంలోకి వచ్చాయి. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు వాగ్ధానం అందులో ఒకటి. ఈ నేపధ్యంలో కర్ణాటకలో విద్యుత్తు శాఖ వారు బకాయిలని వసూలు చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు అని ఒక వీడియో వాట్స్ ఆప్, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. తను చావనైనా చస్తాను కానీ బిల్లు మాత్రం కట్టణాని ఒక వ్యక్తి వాదించటం మనం ఆ వీడియోలో చూడవచ్చు. 

“కాంగ్రెస్ వాగ్ధానాలకి మూల్యం చెల్లిస్తున్న కర్ణాటక విద్యుత్తు శాఖ,” అని ఫేస్బుక్ లో ఒకరు ఈ వీడియో కింద రాసుకొచ్చారు. అయితే ఈ వీడియో ఈ మధ్య కాలానికి చెందినది కాదు, కర్ణాటకకి చెందిన వీడియో అసలే కాదు. 

వాస్తవం

ఈ వీడియో 2020 నుండి సామాజిక మాధ్యమలలో ప్రచారంలో ఉంది. ఈ వీడియోని షేర్ చేసిన కొంతమంది ఇది భారతదేశానికి చెందిన వీడియో అని కూడా రాసుకొచ్చారు. కొంతమంది ఈ వీడియోకి మతోన్మాద రంగు పులిమి భారతదేశాన్ని తాలిబాన్ లాంటి దేశంగా మార్చే ప్రయత్నాలకి ఈ వీడియో ఒక సాక్ష్యం అని అర్థం వచ్చేటట్టు రాసుకొచ్చారు. 

అయితే ఈ వీడియో పాకిస్థాన్ కి చెందిన వీడియో. అక్కడ ఒక వ్యక్తి బిల్లులు చెల్లించకపోవడంతో అధికారులు తనని పట్టుకున్నారు. అధికారులని తిడుతున్నట్టున్న ఈ వ్యక్తి తాను బిల్లులు చెల్లించను అని చెబుతున్నాడు. కె-ఎలెక్ట్రిక్ లిమిటెడ్ అనే సంస్థ ఈ వీడియోని తమ అధికారిక ఫేస్బుక్ పేజిలో జులై 27, 2020 నాడు షేర్ చేసింది. కె-ఎలెక్ట్రిక్ పాకిస్థాన్ లో ఒక ప్రధానమైన విద్యుత్తు సరఫరా సంస్థ.

పాకిస్థాన్ కి చెందిన సియాసత్ అనే వార్తా సంస్థ కూడా ఈ వీడియోని జులై 28, 2020 నాడు షేర్ చేసి ఈ ఘటన కరాచీలో జరిగింది అని తెలిపారు. ఈ కథనానికి సంబంధించిన లింకు ఈ సంస్థ ట్విట్టర్ అకౌంట్ లో కూడా ఉంది. 

అలాగే పాకిస్థాన్ కి చెందిన ఏ ఆర్ వై అనే వార్తా సంస్థ కూడా ఈ ఘటన మీద ఒక వీడియో కథనం చేసింది. ఈ వీడియోలో వాదిస్తున్న వ్యక్తి పేరు షెహ్రి అతా-ఉర్-రెహ్మాన్ అని ఈ కథనం లో వారు పేర్కొన్నారు. విద్యుత్తు దొంగతనం చేస్తుండగా అధికారులు ఈ వ్యక్తిని పట్టుకున్నారని ఈ కథనంలో పేర్కొన్నారు. దీని బట్టి ఈ వీడియో పాకిస్థాన్ కి చెందిన పాత వీడియో అని మనకి అర్థం అవుతున్నది.   

అలాగే ఒక వ్యక్తి  విద్యుత్తు అధికారుల మీద దాడి చేస్తున్న వీడియో ఒకటి షేర్ చేసి  సిద్ధరామయ్య ప్రభుత్వం వాగ్ధానాల ప్రభావం ఇది అని చెబుతూ వైరల్ అయిన కర్ణాటకకి సంబంధం లేని ఇంకొక వీడియోని కూడా లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్ చెక్ చెయ్యడం జరిగింది. 

తీర్పు

కర్ణాటక విద్యుత్తు అధికారులతో వాగ్వాదం అని క్లైమ్ చేస్తూ సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన వీడియో అసలు భారతదేశానికి చెందిన వీడియోనే కాదు. 2020 లో పాకిస్థాన్ లోని కరాచీలో ఒక వ్యక్తి  విద్యుత్తు దొంగతనం చేస్తుండగా  అధికారులు పట్టుకున్న వీడియో ఇది. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారిస్తున్నాము. 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.