కుజ గ్రహానికి సంబంధించి నాసా విడుదల చేసిన ఫొటోలని చంద్రమండలం మీద చంద్రయాన్-3 తీసిన మొదటి వీడియో అని చెబుతూ షేర్ చేశారు

ద్వారా: రాహుల్ అధికారి
సెప్టెంబర్ 6 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
కుజ గ్రహానికి సంబంధించి నాసా విడుదల చేసిన ఫొటోలని చంద్రమండలం మీద చంద్రయాన్-3 తీసిన మొదటి వీడియో అని చెబుతూ షేర్ చేశారు

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

నాసాకి చెందిన మార్స్ క్యూరియాసిటీ రోవర్ తీసిన కుజ గ్రహ ఉపరితరం ఫొటోలని 360 డిగ్రీలలో జూమ్ చేసి ఈ వీడియో తయారుచేశారు.

క్లైమ్ ఐడి dcc373dd

ఇస్రో వారి చంద్రయాన్-3 మిషన్ ఆగస్ట్ 23 నాడు విజయవంతంగా చంద్రుని ఉపరితలం మీద సాఫ్ట్ ల్యాండ్ అవ్వడంతో చంద్రమండలం మీదకి చేరుకున్న నాలుగో దేశంగా భారత దేశం నిలిచింది. ఇస్రో విజయాన్ని లక్షల మంది భారతీయలు ఆస్వాదించారు. 

క్లైమ్ ఏంటి?

ఈ నేపధ్యంలో సామాజిక మాధ్యమాలలో అనేక మంది చంద్రయాన్-3కి చెందిన వీడియో అంటూ సంబంధం లేని వీడియోలు షేర్ చేశారు. అటువంటి ఒక వీడియో ఫేస్బుక్ లో వైరల్ అయ్యింది. చంద్రాయన్-3 చంద్రుడి మీద నుండి పంపిన మొదటి వీడియో అంటూ ఆ వీడియోని షేర్ చేశారు. మూడు నిమిషాల ఈ బ్లాక్ అండ్ వైట్ వీడియో చంద్రుడి రాతి ఉపరితలాన్ని చూపిస్తున్నది అంటూ షేర్ చేశారు. “చంద్రయాన్-3 చంద్రుడి నుండి మొదటి వీడియో పంపించింది. చూడండి చంద్రమండలం ఎంత అద్భుతంగా ఉన్నదో”, అని ఒక శీర్షిక పెట్టి ఒకరు ఈ వీడియోని షేర్ చేశారు. ఇదే క్లైమ్ తో ఇదే వీడియోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేశారు. 

ఫేస్బుక్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

 

అయితే ఈ క్లైమ్ అబద్ధం. నాసాకి చెందిన మార్స్ క్యూరియాసిటీ రోవర్ తీసిన కుజ గ్రహ ఉపరితరం ఫొటోలని 360 డిగ్రీ జూమ్ చేసి ఈ వీడియో తయారుచేశారు. 

మేము ఏమి కనుగొన్నాము?

మేము ఈ వీడియోని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు వీడియో కింద భాగాన ఒక టెక్స్ట్ మాకు కనిపించింది. ఈ టెక్స్ట్ లో ఒక వ్యాఖ్య ఇలా ఉంది, “ఈ సన్నివేశాన్ని క్యూరియాసిటీ రోవర్ యొక్క..” అని ఆంగ్లంలో ఉంది. అలాగే వీడియో చివర ఉన్న టెక్స్ట్ లో “తాజా 4కె రిజల్యూషన్స్.. నాసా మార్స్ రోవర్ నుండి తీసిన అద్భుతమైన సన్నివేశం…’మొంట్ మెర్కో’ మీద నుండి 360 డిగ్రీలలో తీసిన సన్నివేశం” అని ఆంగ్లంలో ఉంది.  పైన ఎడమ భాగంలో ఆంగ్లంలో ‘టీటీ స్పేస్’ అని ఆంగ్లంలో ఉంది. మొదటి ఆంగ్ల ‘టి’ తలకిందులుగా ఉంది. 

వీటిని వాడి మేము వెతికితే మరింత నిడివి ఉన్న ఇదే వీడియో మాకు యూట్యూబ్ లో దొరికింది. ‘టవి టెక్నికల్ స్పేస్’ అనే ఛానల్ ఈ వీడియోని ఆగస్ట్ 8నాడు యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఎనిమిది నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో శీర్షిక “మార్స్ రోవర్ కెమెరా కుజ గ్రహ ఉపతలాన్ని అనుకోని విధంగా వింతగా 360 డిగ్రీలలో తీసిన 4కె ఫుటేజ్” అని రంగులో ఉన్నది. “మార్స్ రోవర్ మీదున్న మస్ట్ కెమెరాలు 4కె రిజల్యూషన్ లో 360 డిగ్రీలలో రియల్ టైమ్ లో తీసిన ఫొటోలు” ఇవి అంటూ ఈ వీడియో వివరణలో ఉన్నది. 

ఈ రెండు వీడియోలని పోల్చి చూసినప్పుడు ఈ యూట్యూబ్ వీడియో నుండే ఆ వైరల్ వీడియోని క్రాప్ చేశారని మాకు అర్థమయ్యింది. యూట్యూబ్ వీడియోలో 0:28 సెకన్ల నుండి 04:12 వరకు ఉన్న ఫుటేజిని క్రాప్ చేశారు. ఈ యూట్యూబ్ వీడియోలో నుండి క్రాప్ చేసిన భాగంలో ఉన్న కొన్ని ఫొటోలని తొలగించి మిగతా భాగాన్ని  ఇది చంద్రాయన్-3 పంపిన వీడియో అంటూ షేర్ చేశారు. 

రెండు వీడియోలలోనూ మేము అండాకార ఆకృతిలో ఉన్న ఒక గొయ్యిని, అలాగే రాతి శిలలని గమనించాము. అదే విధంగా ఒకటే బ్యాక్గ్రౌండ్ తో ఒకటే టెక్స్ట్ కూడా రెండు వీడియోలలో ఉన్నది. ఈ వీడియో అమెరికాకి చెందిన నాసా నుండి తీసుకున్నదని యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసినవారు అక్కడ తెలిపారు.

వైరల్ వీడియో యూట్యూబ్ వీడియోలలోని ఫొటోల మధ్య పోలిక (సౌజన్యం: ఫేస్బుక్/యుట్యూబ్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

మరింతగా పరిశోధిస్తే తేలింది ఏమిటంటే నాసాకి చెందిన క్యూరియాసిటీ రోవర్ తీసిన 360 డిగ్రీల ఫొటోల వివిధ భాగాలని జూమ్ చేసి దానికి వీడియో రూపం ఇచ్చి యూట్యూబ్ లో పెట్టారు అని. ఈ వీడియో చేసిన వ్యక్తి ఫొటోలో ఉన్న చిన్న భాగాల మీద అల్ట్రా-జూమ్ చేసి కింద ఆ వస్తువు ఏమిటి అంటూ ప్రశ్నలు టెక్స్ట్ రూపంలో పెట్టారు. పైన ఫొటోలో చూపించినట్టు ఉపరితలం మీద ఉన్న గొయ్యి మీద జూమ్ చేసి ఇది ఒకప్పుడు చెరువు అయ్యి ఉంటదా లేదా ఆ రాళ్ళ వెనుక రహస్యం ఏమిటి లాంటి ప్రశ్నలు వీడియో కింద భాగాన టెక్స్ట్ రూపంలో పెట్టారు. 

నాసాకి చెందిన జెట్ ప్రొపల్షన్ లేబరేటరీ వారు తయారుచేసిన  రోబోటిక్ అంతరిక్ష వాహనమే ఈ క్యూరియాసిటీ రోవర్. దీనిని నియంత్రించేది కాలిఫోర్నియాలోని పాసడీనాలో ఉన్న కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే సంస్థ.  పైన పేర్కొన్న ఫొటో జెట్ ప్రొపల్షన్ లేబరేటరీ వారి వెబ్సైట్ లో కూడా ఉన్నది.

ఈ ఫొటోలో ఉన్న గొయ్యి పేరు ‘జౌ’. దానిని రోవర్లో ఉన్న మస్ట్ కెమెరాలు జులై 25, 2023 నాడు తీసాయి. అంటే ఈ మిషన్ యొక్క 3899వ రోజు నాడు. ఈ ఫొటోని వెబ్సైట్ లో ఆగస్ట్ 3, 2023 నాడు పెట్టారు. ఈ ఫొటోని 360 డిగ్రీలలో జూమ్ చేసి, దానిని యూట్యూబ్ వీడియోలో ఉన్న ఫొటోతో పోల్చి చూస్తే మాకు అవే గొయ్యి, రాళ్ళు కనిపించాయి. కాబట్టి ఈ ఫొటోని జూమ్ చేసి ఆ యూట్యూబ్ వీడియో షేర్ చేశారని మేము నిర్ధారణకి వచ్చాము. 

యూట్యూబ్ వీడియోలో ని ఫొటో  నాసా ఫొటో మధ్య పోలిక (సౌజన్యం: యూట్యూబ్/నాసా/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

రెండిటిలోనూ అవే వస్తువులని మేము గమనించాము. ఉదాహరణకి ఒక నల్ల రంగులో ఉన్నపెద్ద రాయి లాంటి వస్తువు, అలాగే  కపిల వర్ణంలో ఉన్న ఇంకొక చిన్న వస్తువు. యూట్యూబ్ వీడియోలో 3:37 సెకన్ల దగ్గర ఈ చిన్న కపిల వర్ణపు వస్తువుని ఎడిట్ చేసి హిందూ దేవుడు గణేషుడు లాగా కనిపించేటట్టు చేశారు. ఎడిటింగ్ చేశారని చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఈ గణేషుడి లాగా ఉన్న వస్తువు ఆరు సెకన్ల వ్యవధిలో వీడియోలో మళ్ళీ మాయమైపోతుంది. అలా ఎడిట్ చేసి “హిందూ దేవుడు గణేషుడిని పోలిన విగ్రహం” అంటూ వీడియోలో రాసుకొచ్చారు. 

నాసా ఫొటోని ఎడిట్ చేసి యూట్యూబ్ వీడియోలో పెట్టారు (సౌజన్యం: యూట్యూబ్/నాసా/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అలాగే చంద్రయాన్-3 మిషన్ కి సంబంధించిన అధికారిక ఫొటోలని ప్రజలకి అందుబాటులో ఉంచుతున్న ఇస్రో ఈ వీడియోని విడుదల చేసినట్టు ఎక్కడా లేదు. ఇస్రో ఇప్పటికీ ఒక్క వీడియో మాత్రమే విడుదల చేసింది. చంద్రయాన్-3 రోవర్ అయిన ప్రగ్యాన్ చంద్రుడి మీద ఉన్న వీడియో అది. ఇంకొక ట్వీట్ లో ఇస్రో ఇంకో రెండు ఫొటోలని విడుదల చేసినాయి. అందులో ఒకటి చంద్రుడి ఉపరితలం మీద గొయ్యి ఫొటో ఒకటి, అలాగే రోవర్ దారి ఫొటో ఒకటి.

తీర్పు

ఈ వీడియో చంద్రయాన్-3 చంద్రుడి మీద తీసిన మొదటి వీడియో అనే క్లైమ్ అబద్ధం. నాసాకి చెందిన క్యూరియాసిటీ రోవర్ కుజ గ్రహం ఉపరితలం మీద తీసిన ఫొటోలని 360 డిగ్రీలలో జూమ్ చేసి తయారుచేసిన వీడియో ఇది. ఈ ఫొటోని నాసా రోవర్ జులై 25 నాడు తీయగా ఈ ఫొటోని ఆగస్ట్ 3 నాడు నాసా అందరికీ అందుబాటులోకి తెచ్చింది. అంటే చంద్రయాన్-3 చంద్రుడి మీద సాఫ్ట్ ల్యాండ్ అవ్వటానికి చాలా ముందే. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారిస్తున్నాము. 

అనువాదం- గుత్తా రోహిత్

  

 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.