2016 నాటి వివరాలు షేర్ చేసి తెలంగాణలో తాజాగా 95000 రేషన్ కార్డులని రద్దు చేశారని క్లైమ్ చేశారు

ద్వారా: రాజేశ్వరి పరస
జనవరి 11 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
2016 నాటి వివరాలు షేర్ చేసి తెలంగాణలో తాజాగా 95000 రేషన్ కార్డులని రద్దు చేశారని క్లైమ్ చేశారు

వైరల్ క్లైమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

కొత్త తెలంగాణ ప్రభుత్వం కార్డులని రద్దు చేయలేదు. ఇది 2016 నాటి వార్త. నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం 2016లో 95,040 కార్డులని రద్దు చేసింది.

క్లైమ్ ఐడి e0ab6d14

క్లైమ్ ఏంటి?

తెలంగాణలో 95000కి పైగా రేషన్ కార్డులని ప్రభుత్వం రద్దు చేసిందనే క్లైమ్ సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం 'ప్రజల పాలన' గ్రామ సభలలో భాగంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించిన కొద్ది రోజులకే ఈ క్లైమ్ సర్కులేట్ అవ్వటం మొదలయ్యింది.

ఎక్స్ లో ఒక యూజర్ తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులని అధికారికంగా తొలగించారని తెలుగులో రాసుకొచ్చారు. ప్రాంతాల వారీగా తొలగించిన జాబితా అంటూ ఒక జాబితా కూడా అందులో ఇచ్చారు. ఈ జాబితా ప్రకారం, బాచుపల్లి- 2378, కేసర- 3388, మేడ్చల్- 2306, ముదుచింతపల్లి- 3209, ఉప్పల్ మున్సిపల్ సర్కిల్- 39270, బాలానగర్ మున్సిపల్ సర్కిల్- 35210. ఈ పోస్ట్ కి 160000కి పైగా వ్యూస్ ఉన్నాయి. ఈ లెక్కలన్నీరాసి, “ఇతర జిల్లాలలో కూడా రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం ఉండటంతో జనాలు ఆందోళన పడుతున్నారు,” అని రాసుకొచ్చారు. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ  చూడవచ్చు. 

వైరల్ క్లైమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

వాస్తవం ఏమిటి?

కాంగ్రెస్ ప్రభుత్వం హయాములో 95,000కి పైగా రేషన్ కార్డులు తొలగించారని ఎక్కడా వార్త కూడా లేదు. ఆలాగే ఈ రద్దు గురించి తెలంగాణ ప్రభుత్వం చేసిన అధికారిక ప్రకటన ఏదీ కూడా మాకు లభించలేదు.

అయితే ది హాన్స్ ఇండియా పత్రికలో, “రేషన్ కార్డులు తొలగింపు పుకార్లని ఉత్తమ్ ఖండించారు,” అనే శీర్షికతో వచ్చిన కథనం ఒకటి మాకు లభించింది. జనవరి 6 నాడు ప్రచురించిన కథనంలో తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, “ఒక్క కార్డు కూడా మా ప్రభుత్వం రద్దు చేయలేదు,” అని తెలిపారని ఉంది. 

లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఎక్స్ లో ఈ వైరల్ పోస్ట్ ఒకదానిని షేర్ చేసి వివరణ కోసం అడిగినప్పుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి దానికి జవాబిస్తూ, “అసద్, రేషన్ కార్డులు రద్దు అనేది పూర్తిగా తప్పు. రాష్ట్రంలో మా ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా రద్దు చేయలేదు,” అని తెలిపారు. 

లాజికల్లీ ఫ్యాక్ట్స్ తెలంగాణ రేషన్ కార్డ్ డీలర్స్ అసోసియేషన్ వారిని సంప్రదించింది. ఈ మధ్య కాలంలో తెలంగాణలో భారీ సంఖ్యలో రేషన్ కార్డులు రద్దు చేశారా అని మేము వారిని అడిగాము. అసోసియేషన్ అధ్యక్షులు నైకోటి రాజు లాజికల్లీ ఫ్యాక్ట్స్ తో మాట్లాడుతో, “ఈ మధ్య కాలంలో అలాంటిది ఏమీ  జరగలేదు,” అని తెలిపారు. 

2016లో రద్దు చేసిన రేషన్ కార్డులు

సాక్షి తెలంగాణ ఎడిషన్ లో 2022లో “తెల్ల రేషన్ కార్డుల పునఃపరిశీలన...ఇళ్ల వద్దకు అధికారులు” అనే శీర్షికతో ఒక వార్తా కథనం వచ్చింది. ఈ కథనం ప్రకారం 2016లో నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు అనర్హుల చేతుల్లో ఉన్నాయని చెబుతూ భారీ సంఖ్యలో  రేషన్ కార్డులని రద్దు చేసింది.  అయితే ప్రభుత్వం రేషన్ కార్డుదారులకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా రద్దు చేసిందని చెబుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాలు చేశారు. ప్రాంతాల వారీగా రద్దు అయిన రేషన్ కార్డుల సంఖ్య ఇస్తూ మేడ్చల్ జిల్లాలో మొత్తం 95,040 కార్డులు రద్దు అయ్యాయని ఈ కథనంలో ఉంది. ఇప్పుడు వైరల్ అయిన పోస్ట్ లో పేర్కొన్న సంఖ్య బహుశా ఇక్కడ నుండి తీసుకున్నదే అయ్యుండొచ్చు. 

మేడ్చల్ లో రేషన్ కార్డుల రద్దు గురించి సాక్షిలో వచ్చిన కథనం స్క్రీన్ షాట్ (సౌజన్యం: సాక్షి తెలంగాణ)

రేషన్ కార్డుల రద్దు గురించి సుప్రీం కోర్టు ఏప్రిల్, 2022లో తీర్పునిచ్చింది. సమాచారం ఇవ్వకుండా రద్దు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు తప్పుబట్టింది. లైవ్ లా లో కథనం ప్రకారం, కార్డులు రద్దు అయిన వారి వివరాలు క్షేత్ర స్థాయిలో నిర్ధారించాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. డిసెంబర్ 2023లో ఆంధ్ర జ్యోతిలో వచ్చిన కథనం ప్రకారం ఈ సర్వే తరువాత 983 మంది కార్డుదారులు అర్హులుగా తేలటంతో వారి కార్డులని పునరుద్ధరించారని ఉంది.

తీర్పు

టిఆర్ఎస్ ప్రభుత్వం హయాములో 2016లో భారీ సంఖ్యలో రేషన్ కార్డులని రద్దు చేశారు. 2016 నాటి డేటాని తాజా సమాచారంగా షేర్ చేశారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులని రద్దు చేయలేదని మేము తెలుసుకున్నాము. కాబట్టి ఈ క్లైమ్ తప్పుదోవ పట్టించేట్టు ఉందని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.