ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు 2019లో ఈవీఎంని ధ్వంసం చేస్తున్న వీడియోని తాజా ఘటనగా షేర్ చేస్తున్నారు

ద్వారా: అనెట్ ప్రీతి ఫుర్తాధో
మే 29 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు 2019లో ఈవీఎంని ధ్వంసం చేస్తున్న వీడియోని తాజా ఘటనగా షేర్ చేస్తున్నారు

2024 ఆంధ్ర ఎన్నికలలో గుంతకల్లు కూటమి అభ్యర్ధి ఈవీఎం యంత్రాన్ని ధ్వంసం చేస్తూ పట్టుబడ్డారు అని క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

2019 ఎన్నికలలో జన సేన పార్టీ అభ్యర్ధి మధుసూధన్ గుప్తా ఈవీఎంని ధ్వంసం చేస్తున్న వీడియో ఇది

క్లైమ్ ఐడి 5f53988c

క్లైమ్ ఏంటి?

ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన రాజకీయ నాయకుడు మధుసూధన్ గుప్తా ఒక ఈవీఎం యంత్రాన్ని ధ్వంసం చేస్తునట్టున్న వీడియోని సామాజిక మాధ్యమాలలో షేర్ చేసి, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో జరిగిన ఘటన అని క్లైమ్ చేశారు. తను గుంతకల్లు నియోజకవర్గం నుండి తెలుగుదేశం - జన సేన ఉమ్మడి అభ్యర్ధి అని కూడా కొంత మంది రాసుకొచ్చారు.

ఈ 46 సెకన్ల వీడియోలో, తెల్ల చొక్కా వేసుకుని ఉన్న ఒక వ్యక్తిని మనం చూడవచ్చు. రెండు మైక్రోఫోన్లు తన వైపు ఉండటం కూడా మనం చూడవచ్చు. “ఇదంతా కూడా రాంగు. ఇప్పుడు నేను దీన్ని పగలగొడుతున్నాను. ఇదేమి ఎలక్షన్ అసలు? ఇంత అన్యాయం చేస్తారా? ఇదంతా మోసం. ఎలా చేస్తారు మీరు అసలు? ,” అని మధుసూధన్ అనటం మనం ఇందులో చూడవచ్చు. ఆ తరువాత ఈవీఎంని నేలకేసి కొట్టారు. ఆ తరువాత ఈ వ్యక్తిని పోలీసులు పోలీసు వ్యాన్ దగ్గరికి తీసుకువెళ్లడం మనం చూడవచ్చు. 

“టీడీపీ అభ్యర్థి EVM ధ్వంసం. గుంతకల్లు టీడీపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థి మధుసూదన్ గుప్తా EVM లు ధ్వంసం చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి పై కేసు నమోదు తో. తాజాగా ఈ వీడియో వెలుగు లోకి వచ్చింది..దీనిపై @ECISVEEP ఏమి చర్యలు తీసుకుంటుందో మరి” అంటూ ఒక యూజర్ ఈ వీడియోని షేర్ చేసి, శీర్షికగా రాశారు. 

ఈ పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

వైరల్ క్లైమ్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఆంధ్ర ప్రదేశ్ లో శాసనసభ, లోక్ సభ ఎన్నికలు మే 13 నాడు జరిగాయి.

అయితే ఇది ఈ ఎన్నికలకి సంబంధించిన వీడియో కాదు. ఇది 2019 నాటిది.

మేము ఏమి తెలుసుకున్నాము?

అనంతపురంలోని గుంతకల్లులో ఈ ఎన్నికలలో ఈవీఎం ధ్వంసం చేశారు అనే వార్తా కథనాలు ఏవీ మాకు లభించలేదు.

ఈ వీడియోలోని కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే ఏఎన్ఐ సంస్థ ఏప్రిల్ 11, 2019 నాడు ఎక్స్ లో పెట్టిన పోస్ట్ (ఆర్కైవ్ ఇక్కడమాకు లభించింది. ఈ వీడియోలో 12 సెకన్ల నుండి వైరల్ వీడియోలో ఉన్న ఫుటేజే ఉంది.

“అనంతపురంలోని గుత్తిలో జన సేన అభ్యర్ధి మధుసూధన్ గుప్తా ఈవీఎం యంత్రాన్ని ధ్వంసం చేస్తున్న వీడియోని చూడండి. పోలీసులు తనని అరెస్ట్ చేశారు” అని ఈ ఏఎన్ఐ పోస్ట్ లో ఉంది. 

2019 నాటి ఎన్ డి టీ వీ కథనంలో  కూడా ఇవే వివరాలు ఉన్నాయి. ఈవిఎం యంత్రాన్ని ధ్వంసం చేసినందుకు ఏప్రిల్ 11, 2019 నాడు పోలీసులు తనను అరెస్ట్ చేశారని ఇందులో ఉంది. శాసనసభ, లోక్ సభ నియోజకవర్గాల పేర్లు యంత్రంలో సరిగ్గా కనిపించనందుకు ఎన్నికల అధికారుల మీద కోపగించుకుని, యంత్రాన్ని ధ్వంసం చేశారని ఈ కథనంలో ఉంది. వైరల్ వీడియోలోని ఒక ఫ్రేమ్ ఈ కథనంలో ఉంది.

ఆంధ్ర ప్రదేశ్ లో 2019 నాటి ఎన్నికలు ఏప్రిల్ 11, 2019 నాడు జరిగాయి. 

అలాగే డెక్కన్ హెరాల్డ్ (ఆర్కైవ్ ఇక్కడ) వార్తా సంస్థ పోస్ట్ చేసిన యూట్యూబ్ వీడియో ఒకటి మాకు లభించింది. అందులో 48 సెకన్ల దగ్గర పోలీసులు తనని తీసుకువెళ్తున్న భాగం ఉంది. వైరల్ వీడియోలో కూడా ఇది ఉంది. 

వైరల్ వీడియో, డెక్కన్ హెరాల్డ్ వీడియో మధ్య పోలికలు (సౌజన్యం: ఎక్స్/యూట్యూబ్)

దీనిబట్టి ఈ వైరల్ వీడియో 2019 నాటిదని స్పష్టం అవుతున్నది.

మధుసూధన్ గుప్తా 2024లో గుంతకల్లు నుండి తెలుగుదేశం- జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారా?

2019లో తను జన సేన అభ్యర్ధి. తన ఫేస్బుక్ పేజ్ లో తను గుంతకల్లు మాజీ శాసనసభ్యుడు అని మాత్రమే ఉంది. 

గుంతకల్లు తెలుగుదేశం - జనసేన - భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్ధి గుమ్మనూరు జయరాం. తను ఇంతకుముందు  వై ఎస్ ఆర్ సి పి పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. జయరాం ఈవీఎం యంత్రాన్ని ధ్వంసం చేశారని ఎటువంటి వార్తా కథనం లేదు. 

ఈ ఎన్నికలలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఒక పోలింగ్ బూత్ లో వీవీప్యాట్ యంత్రాన్ని ధ్వంసం చేస్తూ సీసీటీవీలో పట్టుబడ్డారు. పోలీసులు తన మీద కేసు పెట్టారు. ఎన్నికల సంఘం తన మీద కఠిన చర్యలు తీసుకోమని ఆదేశించింది.

తీర్పు

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ లో మధుసూధన్ గుప్తా అనే నాయకుడు ఈవీఎం ధ్వంసం చేస్తున్న వీడియో అంటూ ఒక వీడియో వైరల్ అయ్యింది. అయితే ఇది 2019 ఎన్నికల నాటి వీడియో. అలాగే, మధుసూధన్ గుప్తా గుంతకల్లు తెలుగుదేశం- జన సేన ఉమ్మడి అభ్యర్ధి కాదు. కాబట్టి ఈ క్లైమ్ తప్పుదోవ పట్టించేటట్టు ఉందని మేము నిర్ధారించాము.

(అనువాదం - గుత్తా రోహిత్)

 

 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.