హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి జరిమానా విధించింది రాజీవ్ గాంధీ పేరు మీద ఒక స్టేడియంను నామకరణం చేసినందుకు కాదు

ద్వారా: రోహిత్ గుత్తా
ఆగస్టు 10 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి జరిమానా విధించింది రాజీవ్ గాంధీ పేరు మీద ఒక స్టేడియంను నామకరణం చేసినందుకు కాదు

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

స్టేడియం పేరు ‘రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం’ గా ఇరు వర్గాల అంగీకారాంతో మార్చటం జరిగింది.

క్లైమ్ ఐడి a4f2f807

నేపధ్యం

అబద్ధపు వార్తలను ప్రచారం చేస్తూ పలు మార్లు పట్టుబడిన ట్విట్టర్ యూజర్ రిషి బగ్రీ  మే 17, 2023 నాడు ఒక ట్వీట్ చేశారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ లో ఒక స్టేడియం పేరుని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంగా మార్చినందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 55 కోట్లతో పాటు దానికి “ఆరింతలు” జరిమానా కట్టవలసి వచ్చింది అని ఆ ట్వీట్లో రాసుకొచ్చారు. 

2003లో నాటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల మద్దతుతో ఒక స్టేడియం నిర్మించాలని నిర్ణయించుకుందని, దాని కోసం వేసిన బిడ్లలో విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (విఐఎల్) అత్యధిక బిడ్ వేసిందని, దానితో ఆ స్టేడియం పేరు విఐఎల్ గా పెట్టాలని నిర్ణయించిందని రాసుకొచ్చారు. విఐఎల్ 55 కోట్లు స్పాన్సర్ చేసింది, 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈస్టేడియం పేరు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం గా మార్చటం జరిగింది అని, దాని కారణంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 330 కోట్లు కట్టవలసి వచ్చింది అని ఆయన తన ట్వీట్లో రాసుకొచ్చారు. 

“ఈ నిర్ణయం కారణంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విశాఖ ఇండస్ట్రీస్ కి కాంట్రాక్ట్ విలువకి ఆరింతలు కట్టవలసి వచ్చింది,” అని రాసుకొచ్చారు. అలాగే “గాంధీ కుటుంబం పేరు అన్ని చోట్ల ఉంచడానికి దేశ ప్రజలు డబ్బులు కట్టవలసిన పరిస్థితి”, అని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ కి 2,42,000కి పైగా వ్యూస్, 2800కి పైగా  లైక్స్, 800 రీట్వీట్స్ ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు 2011లో ఇచ్చిన ఒక తీర్పు కాపీ లింకు కూడా తన ట్వీట్ లో జత చేశారు. 

అయితే బగ్రీ ట్వీట్ తప్పుల తడక.

వాస్తవం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సి ఏ) ఒక రిజిస్టర్డ్ సొసైటీ. అలాగే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) అనుబంధ సంస్థ. హెచ్ సి ఏ బిసిసిఐ వారి క్రికెట్ టోర్నమెంటులని హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రాలలో నిర్వహిస్తుంది. అలాగే హైదరాబాద్, తెలంగాణలో క్రికెట్ క్రీడా అభివృద్ధి కోసం పనిచేస్తుంది. 

విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (విఐఎల్) సంస్థ సిమెంట్ ఇంటి  కప్పుల ఉత్పత్తి, సౌర విద్యుత్తు ఇంటి కప్పుల ఉత్పత్తి, నూలు తయారీ తదితర పరిశ్రమలు కలిగిన సంస్థ. 

రిషీ బగ్రీ తన తరువాత ట్వీట్లో ఇచ్చిన న్యాయస్థానం తీర్పు కాపీని లాజికల్లీ ఫ్యాక్ట్స్ పరిశీలించింది. హెచ్ సి ఏ, విఐఎల్ మధ్య ఒప్పందం గురించిన తీర్పు అది. తెలంగాణలో హైదరాబాద్ లో ఉప్పల్ లో ఒక అంతర్జాతీయ స్టేడియం నిర్మాణం కొరకు అక్టోబర్ 16, 2004 నాడు విఐఎల్ తో హెచ్ సి ఏ 25  సంవత్సరాల ప్రాతిపదికన ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఈ స్టేడియం నిర్మాణానికి విఐఎల్ నిధులు సమకూరుస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం స్టేడియం పేరు ‘విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం’ అని పెట్టడానికి కానూ, అలాగే ఇతర ప్రకటనల హక్కుల కోసం విఐఎల్ హెచ్ సి ఏ కి 6.5 కోట్లు చెల్లిస్తుంది అని ఈ ఒప్పందంలో ఉంది. 

ఆ తరువాత, 2004లో ఆంధ్రప్రదేశ్ లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు మేరకు ఈ స్టేడియం పేరుని మాజీ ప్రధాన మంత్రి పేరు మీద ‘రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం’గా మార్చటానికి ఇరు వర్గాల మధ్య పరస్పర అంగీకారం కుదిరింది. హెచ్ సి ఏ విఐఎల్ కి 10 నవంబర్ 2005 నాడు రాసిన ఉత్తరంలో ఈ అంగీకారాన్ని మనం చూడవచ్చు. 25 ఏప్రిల్ 2006 నాడు సవరణ చేసిన ఒప్పందం ప్రకారం స్టేడియం పేరు ‘రాజీవ్ గాంధీ అంతర్జాతీయక్రికెట్ స్టేడియం’ గా మార్పు చెందగా, క్రీడా మైదానం పేరు ‘విశాఖ క్రికెట్ గ్రౌండ్స్’ గా పెట్టడం జరిగింది. ఈ మార్పులకు గానూ విఐఎల్ హెచ్ సి ఏ కి చెల్లించాల్సిన మొత్తాన్ని 6.5 కోట్ల నుండి  4.32 కోట్లకి తగ్గించడం జరిగింది. విఐఎల్ కి దాఖలు పరిచిన ఇతర హక్కులు అలాగే ఉంటాయి. 

ఈ రెండు పార్టీల మధ్య వివాదం భారతదేశంలో 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభంతో మొదలయ్యింది. విఐఎల్ కి దాఖలు పరిచిన హక్కులు కేవలం టెస్ట్, ఓడిఐ ఫార్మాట్ కి మాత్రమే అని, ఐపిఎల్ ఫార్మాట్ కి ఈ హక్కులు చెల్లవని హెచ్ సి ఏ వాదించింది. ఇంకొకపక్క విఐఎల్ ఏమో ఈ ఒప్పందం అన్ని ఫార్మాట్లకి వర్తిస్తుందని, మధ్యలో తిరగదోడే ఒప్పందం కాదని వాదించింది. ఒప్పందం తిరగదోడినందుకు తాము కట్టిన డబ్బులకి ఆరింతలు మరియు ఇతర పెనాల్టీలు- అంటే మొత్తం 25.92 కోట్లు- హెచ్ సి ఏ కట్టాలని విఐఎల్ వాదించింది. ఈ సమాచారం మొత్తం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరియు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కి మధ్య ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టులో నడిచిన కేసులో ఇచ్చిన తీర్పు నుండి తీసుకోవటం జరిగింది. ఈ కేసు సంఖ్య సివిల్ మిసలేనియస్ అప్పీల్ . 1025/2011. 

ఈ విషయం గురించి లాజికల్లీ ఫ్యాక్ట్స్ విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ (లీగల్) రజనికాంత్ తో మాట్లాడింది. ఈ వివాదం న్యాయస్థానాలలో తిరిగి చివరికి ఆర్బిట్రేషన్ తో ముగిసింది అని ఆయన తెలిపారు. హెచ్ సి ఏ వారి 2015-16 వార్షిక నివేదిక ప్రకారం ఆర్బిట్రేషన్ ప్యానల్ హెచ్ సి ఏ విఐఎల్ కి 25.92 కోట్లు కట్టాలని మార్చ్ 15, 2016 నాడు తీర్పు ఇచ్చింది. ఈ మొత్తం కూడా విఐఎల్ మొదట్లో అడిగిన ఆరింతలు సంఖ్యే. అయితే పెనాల్టీ మొత్తం ఇందులో లేదు. డెక్కన్ క్రానికల్ వార్తా పత్రిక కూడా ఇదే మొత్తాన్ని మే 15, 2016 నాడు ప్రచురించిన కథనంలో పేర్కొంది. 

స్టేడియం పేరుని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం గా మార్చటం అనేది పరస్పర అంగీకారంతో జరిగిందని, అందుకు కాను విఐఎల్ కట్టాల్సిన మొత్తాన్ని 6.5 కోట్లు నుండి 4.32 కోట్లకి తగ్గించడం జరిగిందని రజనీకాంత్ ధ్రువీకరించారు.  ఈ రెండు పార్టీల మధ్య వివాదం అంతా కూడా విఐఎల్ కి దాఖలు పరిచిన హక్కుల గురించి, ముఖ్యంగా ఈ హక్కులు ఐపిఎల్ ఫార్మాట్లో కూడా వర్తించటం గురించని, అలాగే స్టేడియం పేరు మార్పు గురించి ఈ వివాదం కాదని కూడా ఆయన స్పష్టపరిచారు. ఆర్బిట్రేషన్ ప్యానల్ 25.92 కోట్లు కట్టమని తీర్పు ఇచ్చిందని, అయితే తమకి ఇంకా హెచ్ సి ఏ వారు ఈ మొత్తాన్ని కట్టలేదు అని ఆయన తెలిపారు. 

తీర్పు

స్టేడియం పేరు ‘రాజీవ్ గాంధీ స్టేడియం క్రికెట్ స్టేడియం’ గా ఇరు వర్గాల అంగీకారాంతో మార్చటం జరిగింది. ఆర్బిట్రేషన్ ప్యానల్ వారు హెచ్ సి ఏ వారు విఐఎల్ కి పరిహారం చెల్లించమని చెప్పింది హెచ్ సి ఏ వాళ్ళు ఒప్పందాన్ని రద్దు చేసినందుకు, ఆలాగే విఐఎల్ హక్కులకి భంగం కలిగించినందుకు. ఈ పరిహారం మొత్తం కూడా పోస్ట్ లో చెప్పినట్టు 55 కోట్లు మరియు పెనాల్టీ కాదు. పరిహారం మొత్తం 25.92 కోట్లు. కాబట్టి ఈ క్లైమ్ తప్పుదోవ పట్టించేటట్టు ఉండని మేము నిర్ధారించాము. 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.