రాముడు, అయోధ్య రామాలయం బొమ్మలు ఉన్న 500 రూపాయల నోటు ఫొటో డిజిటల్ గా ఎడిట్ చేసినది

ద్వారా: ఉమ్మే కుల్సుం
జనవరి 17 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
రాముడు, అయోధ్య రామాలయం బొమ్మలు ఉన్న 500 రూపాయల నోటు ఫొటో డిజిటల్ గా ఎడిట్ చేసినది

ఆన్లైన్ లో పోస్ట్ చేసిన క్లైమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు ఫేక్

ఈ ఫొటోలో ఉన్న లొసుగులు బట్టి ఇది డిజిటల్ గా ఎడిట్ చేసిన ఫొటో అనేది సుస్పష్టం. కొత్త నోటు విడుదల గురించి రిజర్వ్ బ్యాంకు ఎటువంటి ప్రకటనా చేయలేదు.

క్లైమ్ ఐడి 98b2d196

క్లైమ్ ఏంటి?

అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం నేపధ్యంలో రాముడు, రామయాలం బొమ్మలు ఉన్న 500 రూపాయల నోటు ఒకటి సామాజిక మాధ్యమాలలో షేర్ చేసి, భారత రిజర్వ్ బ్యాంకు ఈ నోటుని జనవరి 22 నాడు విడుదల చేయనుందని క్లైమ్ చేశారు.

ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో ఒక యూజర్ ఈ ఫొటో షేర్ చేసి (ఆర్కైవ్ ఇక్కడ), “జనవరి 22 నాడు కొత్త 500 రూపాయల నోటుని విడుదల చేయనున్నారని ఇప్పుడే తెలిసింది. అదే నిజమైతే కనుక మన కల సాకారమైనట్టే. జై శ్రీ రాం,” అని శీర్షిక పెట్టారు. ఇంకొకరు ఈ ఫొటో షేర్ చేసి (ఆర్కైవ్ ఇక్కడ), “‘జాతి పిత’ దగ్గర నుండి ‘జాతి దేవుడు’ వరకు మనం ఎదిగాము. కొత్త 500 రూపాయల నోటుని జనవరి 22 నాడు విడుదల చేయనున్నారు,” అనే శీర్షిక పెట్టారు.

ఈ క్లైమ్ ప్రకారం ప్రస్తుతం 500 రూపాయల నోటు మీద ఉన్న గాంధీ, ఎర్ర కోట బొమ్మలు తొలగించి, రాముడు, రామాలయం బొమ్మలు పెడతారు. ఈ క్లైమ్ ఫేస్బుక్ లో కూడా వైరల్ అయ్యింది. అటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ  చూడవచ్చు. 

ఆన్లైన్ లో క్లైమ్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే భారత దేశంలో నోట్లు జారీ చేసే అధికారం కలిగిన ఏకైక సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 నోట్ల మీద బొమ్మలని మార్చటం లేదు.

మేము ఏమి తెలుసుకున్నాము?

కొత్త నోట్లు అని చెప్పబడుతున్న నోట్ల ఫొటోలు చూస్తే మాకు ఎన్నో లొసుగులు కనిపించాయి. దాని బట్టి ఇవి డిజిటల్ గా ఎడిట్ చేసినవి అని అర్థమయ్యింది. ఈ ఫొటోలలో రాముడు, రామాలయం చుట్టూ మసకబారినట్టు ఉంది. అసలైన నోట్ల ఫోటోలలో ఉన్న బొమ్మలని తొలగించి, వీటిని ఆ ప్రదేశంలో పెట్టారు అని దీని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే నోటులో మిగతా భాగం అంతా కొంచెం మసకబారినట్టు ఉంటే, రాముడు బొమ్మ, ఆ బొమ్మ కింద ఉన్న ‘శ్రీ రామచంద్ర’ అనే లైను మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి. దీని బట్టి కూడా ఇది ఎడిట్ చేసిన ఫొటో అని మనకి అర్థమవుతున్నది. 

వైరల్ ఫొటోలో లొసుగులు (సౌజన్యం: ఎక్స్)

కొన్ని పోస్ట్స్ లో నోటులో ఎడమ వైపు కింద పక్క “X raghunmurthy07” అనే వాటర్ మార్క్ గమనించాము. “@raghunmurthy07” అనే ఎక్స్ యూజర్ తానే ఈ నోటు తయారు చేశానని ఒక పోస్ట్ కింద జవాబులో తెలిపారు. “సర్, ఈ ఫొటో చేసింది నేనే. ఇది కేవలం ఊహాజనితం. దయ చేసి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దు,” అని తను తన జవాబులో రాశారు. లాజికల్లీ ఫ్యాక్ట్స్ తనని సంప్రదించింది. తను “పిక్స్ ఆర్ట్, లైట్ రూమ్, పిక్సెల్ ల్యాబ్” వాడి ఈ వైరల్ ఫొటో తయారు చేశానని మాకు తెలిపారు. తాను ఎలా ఎడిటింగ్ చేశారో మాకు తెలియచేయటానికి దీనికి సంబంధించిన వివిధ ఫొటోలు మాతో షేర్ చేశారు. 

రాముడు, రామాలయం బొమ్మలతో కూడిన కొత్త 500 రూపాయల నోటుని రిజర్వ్ బ్యాంకు విడుదల చేయనుందని తెలిపిన నమ్మదగిన వార్తా కథనం ఏదీ మాకు దొరకలేదు. గాంధీ, ఎర్ర కోట బొమ్మల స్థానంలో వీటిని పెడుతున్నామంటూ రిజర్వ్ బ్యాంకు అధికారిక ప్రకటన కూడా ఏదీ లేదు. కొత్త కరెన్సీ నోట్లు చలామణిలోకి తీసుకురావటం లాంటి అధికారిక నిర్ణయాలని రిజర్వ్ బ్యాంక్ తమ వెబ్సైట్ ద్వారా తెలియచేస్తుంది. ఇక్కడ అటువంటిది ఏమీ లేదు. రిజర్వ్ బ్యాంక్ తాజా పత్రికా ప్రకటన (జనవరి 16 నాడు) “మనీ మార్కెట్ ఆపరేషన్స్” గురించి ఇచ్చింది.

రిజర్వ్ బ్యాంకు వెబ్సైట్ లో “మీ నోట్ల గురించి తెలుసుకోండి” సెక్షన్ లో 500 రూపాయల నోటు దగ్గర ఇప్పటికీ ముందు భాగాన గాంధీ, వెనుక భాగాన ఎర్ర కోట బొమ్మలు ఉన్న నోటే ఉంది. 

రిజర్వ్ బ్యాంక్ వెబ్సైట్ లో ఉన్న అధికారిక 500 రూపాయల నోటు నమూనా స్క్రీన్ షాట్ (సౌజన్యం: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)

అలాగే, రిజర్వ్ బ్యాంకు వారు కొత్తగా విడుదల చేసే నోట్లలో “000000” అనే కోడ్ ఉంటుంది. ఈ వైరల్ ఫొటోలో “6 CM 302 379” అనే కోడ్ ఉంది. ఈ కోడ్ ఉంది అంటే ఈ నోటు ఇప్పటికే చలామణిలో ఉందని.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కమ్యూనికేషన్స్ విభాగం జనరల్ మేనేజర్ యోగేష్ దయాళ్ ని మేము సంప్రదించాము. కొత్త కరెన్సీ నోటు విడుదల గురించి రిజర్వ్ బ్యాంకుకి ఏమీ తెలియదని జవాబిచ్చారు.

తీర్పు

రాముడు, అయోధ్య రామాలయం బొమ్మలు ఉన్న 500 రూపాయల నోటు ఫొటో ఫేక్. ఇలా మారుస్తున్నామని రిజర్వ్ బ్యాంకు ఎటువంటి ప్రకటనా చేయలేదు. కాబట్టి ఈ క్లైమ్ ఫేక్ అని మేము నిర్ధారించాము. 

(ఏబీపీ న్యూస్ వారు ఈ క్లైమ్ ని మా దృష్టికి తీసుకువచ్చారు)

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , অসমীয়া , हिंदी , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.