హోమ్ పార్లమెంట్ ప్రసంగంలో ప్రధాని మోదీ ‘రిజర్వేషన్లను వ్యతిరేకించలేదు’

పార్లమెంట్ ప్రసంగంలో ప్రధాని మోదీ ‘రిజర్వేషన్లను వ్యతిరేకించలేదు’

మార్చి 20 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
పార్లమెంట్ ప్రసంగంలో ప్రధాని మోదీ ‘రిజర్వేషన్లను వ్యతిరేకించలేదు’ పార్లమెంట్ ప్రసంగంలో మోదీ రిజర్వేషన్లని వ్యతిరేకించారని క్లైమ్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఉత్తరం నుండి మోదీ ఉటంకిస్తున్న భాగాన్ని తీసుకుని మోదీ ఆ వ్యాఖ్యలు చేసినట్టు క్లైమ్ చేశారు.

క్లైమ్ ఏంటి?

ప్రధాని మోదీ అన్ని రకాల రిజర్వేషన్లని వ్యతిరేకిస్తునట్టు ఉన్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. ఈ 33 సెకన్ల వీడియోలో, “నేను ఎటువంటి రిజర్వేషన్ని స్వాగతించను. ముఖ్యంగా ఉద్యోగాలలో రిజర్వేషన్లు. నైపుణ్యం లేని పనికి, నాణ్యతా రాహిత్యమైన పనికి బాటలు వేసే ఏ చర్యనైనా నేను వ్యతిరేకిస్తాను. అందుకే నేను కులానికి వ్యతిరేకం అని చెబుతున్నాను. ఎస్ సి, ఎస్ టి, బి సి కులాల వారికి రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు వస్తే ప్రభుత్వ పని తీరు దిగజారే ప్రమాదం ఉంది,” అని మోదీ హిందీలో అనటం మనం వినవచ్చు. తాను ఇలా చెబుతుండగా వెనుక నుండి “సిగ్గు చేటు, సిగ్గు చేటు” అని ఇతరులు అరవటం కూడా మనం వినవచ్చు.

ఈ వీడియోని కాంగ్రెస్ పార్టీ జాతీయ మీడియా ప్యానలిస్ట్ సురేంద్ర రాజ్ పుత్ కూడా తన ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) అకౌంట్ లో షేర్ చేశారు. ఈ పోస్ట్ ఆర్కైవ్ వెర్షన్ ని ఇక్కడ  చూడవచ్చు. ఇదే క్లైమ్ ని ఫేస్బుక్ లో కూడా షేర్ చేశారు. అటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ని ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ  చూడవచ్చు. 

వైరల్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం,: ఎక్స్/స్క్రీన్ షాట్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే, ఈ వైరల్ వీడియో తప్పుదోవ పట్టించేటట్టు ఉంది. ఇవి మోదీ సొంతంగా చేసిన వ్యాఖ్యలు కావు. జవహర్ లాల్ నెహ్రూని మోదీ ఉటంకిస్తున్న వీడియో ఇది.

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ వ్యాఖ్యల గురించి వెతుకగా పార్లమెంట్ లో మోదీ ప్రసంగం గురించి మీడియా కథనాలు మాకు లభించాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన ఒక కథనం ప్రకారం జవహర్ లాల్ నెహ్రూ రాసిన ఒక ఉత్తరాన్ని ప్రధాని మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకి హిందీలో చదివి వినిపించారు. 

సంసద్ టివి వారి యూట్యూబ్ చానల్ లో మార్చ్ 7, 2024 నాడు అప్లోడ్ చేసిన ఈ పార్లమెంట్ సెషన్ వీడియోని మేము చూశాము. రాజ్య సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియచేసే సెషన్ లో మోదీ ప్రసంగించిన భాగంలోనిదే ఈ వైరల్ వీడియో. ఈ ప్రసంగంలో ప్రతిపక్ష కాంగ్రెస్ మీద విమర్శలు గుప్పించారు. 

వీడియోలో 29 నిమిషాల దగ్గర మోదీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ నెహ్రూ రాసిన ఉత్తరాన్ని ఉటంకించారు. 31వ నిమిషం మార్క్ దగ్గర మోదీ మాట్లాడుతూ, “పండిట్ నెహ్రూ గారు ముఖ్యమంత్రులకి రాసిన ఈ లేఖ రికార్డులలో ఉంది. ‘నేను ఎటువంటి రిజర్వేషన్ని స్వాగతించను. ముఖ్యంగా ఉద్యోగాలలో రిజర్వేషన్లు. నైపుణ్యం లేని పనికి, నాణ్యతా రాహిత్యమైన పనికి బాటలు వేసే ఏ చర్యనైనా నేను వ్యతిరేకిస్తాను. అందుకే నేను కులానికి వ్యతిరేకం అని చెబుతున్నాను. ఎస్ సి, ఎస్ టి, బి సి కులాల వారికి రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు వస్తే ప్రభుత్వ పని తీరు దిగజారే ప్రమాదం ఉంది’. ఇది నెహ్రూ ముఖ్యమంత్రులకి రాసిన ఉత్తరం,” అని అన్నారు.

దీని బట్టి మోదీ నెహ్రూని ఉటంకించారు అని, వైరల్ వీడియోలో ఈ ఉటంకించిన భాగాన్ని తొలగించారని మనకి అర్థమవుతున్నది.

ముఖ్యమంత్రులకి నెహ్రూ రాసిన ఉత్తరం

నెహ్రూ తరుచుగా రాష్ట్రాల నాయకులతో సంభాషించేవారు. ఈ అలవాటుని దాదాపుగా తను చనిపోయేవరకు కొనసాగించారు. ఈ సంభాషణలు అన్నిటినీ కూడా ‘లెటర్స్ ఫర్ ఏ నేషన్: ఫ్రమ్ జవహర్ లాల్ నెహ్రూ టు హిస్ చీఫ్ మినిస్టర్స్ 1947-1963’ అనే సంకలనంలో పొందుపరిచారు. మోదీ ఉటంకించిన ఉత్తరం జూన్ 27, 1961 తేదీతో ఉంది.. అది ఈ సంకలనంలో ఉంది. 

“సమర్ధత గురించి పైన పేర్కొన్నాను. అలాగే సాంప్రదాయ ఊబి నుండి బయటపడవలసిన అవసరం గురించి కూడా పేర్కొన్నాను. రిజర్వేషన్లు అనే పాత అలవాటు నుండి ఇవన్నీ వస్తున్నాయి. అలాగే ఒక కులానికో, వర్గానికో ప్రత్యేక సదుపాయాలు కలిపిస్తున్నారు. జాతీయ సమగ్రత గురించి ఈ మధ్య ఇక్కడ ముఖ్య మంత్రులతో నిర్వహించిన సమావేశంలో సహాయం అనేది ఆర్థిక ప్రాతిపదికన ఇవ్వాలని, కుల ప్రాతిపదికన కాదని నిర్ణయించారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలకి మద్ధతు అందించటం గురించి ఏర్పాటు చేసిన కొన్ని నియమాలకి మనం బద్దులయి ఉండిపోయాము అనే మాట వాస్తవం. వారికి మద్ధతు అవసరం. అయితే నేను ఎటువంటి రిజర్వేషన్ని స్వాగతించను. ముఖ్యంగా ఉద్యోగాలలో. నిష్ఫలత్వానికి, రెండవ శ్రేణి ప్రమాణాలకు దారి తీసే దేనికైనా నేను వ్యతిరేకం. నా దేశం ప్రతి విషయంలో మొదటి శ్రేణిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. రెండవ శ్రేణి పనిని, పద్ధతులని మనం ప్రోత్సహించిన క్షణం మనం ఒడిపోయినట్టే,” అని నెహ్రూ ఈ ఉత్తరంలో రాశారు.

ప్రధాని మోదీ ఈ ఉత్తరం నుండి భాగాలని తన పార్లమెంట్ ప్రసంగంలో ఉటంకించారు. వెనుకబడిన వర్గాలకి చేయూత అందించాలంటే నాణ్యమైన విద్యావకాశాలు వారికి అందుబాటులో ఉంచాలని నెహ్రూ ఈ ఉత్తరంలో పేర్కొన్నారు. ఈ ఉత్తరాన్ని ఇక్కడ  చదవచ్చు.

తీర్పు

మోదీ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించడం లేదని మనకి అర్థమవుతున్నది. భారత మొదటి ప్రధాని నెహ్రూ 1961లో రాసిన ఉత్తరంలో భాగాలని మోదీ ఉటంకించారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.