పాత వీడియోని ఎడిట్ చేసే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ లో ‘జై శ్రీ రామ్’ నినాదాలు ఇచ్చారని క్లైమ్ చేశారు

ద్వారా: ప్రవీణ్ కుమార్ హెచ్
అక్టోబర్ 23 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
పాత వీడియోని ఎడిట్ చేసే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ లో ‘జై శ్రీ రామ్’ నినాదాలు ఇచ్చారని క్లైమ్ చేశారు

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 2022లో తీసిన వీడియోని ఎడిట్ చేసి అక్టోబర్ 14, 2023 నాడు ఐసిసి పురుషుల వరల్డ్ కప్ లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో 'జై శ్రీ రామ్' అని నినాదాలు ఇస్తున్న వీడియో అనే క్లైమ్ తో షేర్ చేశారు

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

అక్టోబర్ 14 నాడు జరిగిన మ్యాచ్ లో ‘జై శ్రీరామ్’ నినాదాలు ఇవ్వటమయితే జరిగింది కానీ, ఈ వైరల్ వీడియో మాత్రం 2022 నుండి సర్కులేట్ అవుతున్నది.

క్లైమ్ ఐడి 6f9e5afa

అక్టోబర్ 14, 2023 నాడు భారత్-పాకిస్థాన్ మధ్య గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐసిసి పురుషుల వరల్డ్ కప్ 2023 మ్యాచ్ లో భారత దేశం గెలిచింది. మ్యాచ్ గెలవగానే మ్యాచ్ కి సంబంధించిన వీడియోలు అంటూ అనేక వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. 

క్లైమ్ ఏమిటి?

అటువంటి ఒక 10 సెకండ్లు నిడివి ఉన్న వీడియోలో జనాలతో నిండి ఉన్న స్టేడియంలో ‘జై శ్రీరామ్’ అనే నినాదం ఇస్తున్నట్టు ఉంది. ఇతర యూజర్లతో పాటు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ వీడియోని తన అధికారిక ఎక్స్ (పూర్వపు ట్విట్టర్), యూట్యూబ్ లో షేర్ చేసి, “ఏమి సంబరం! #Narendra Modi స్టేడియంలో వాళ్ళందరూ కూడా ‘జై శ్రీరామ్’ అని నినదిస్తున్నారు. #INDvsPAK #ICCCricketWorldCup2023 #TeamIndia #JaiShreeRam #PrabhuShreeRam”, అని రాసుకొచ్చారు. 

ఇదే వీడియోని ఎక్స్ లో అనేక మంది షేర్ చేశారు. అన్నిటికీ కలిపి కొన్ని లక్షల వ్యూస్ ఉన్నాయి. అటువంటి కొన్ని పోస్ట్ ల ఆర్కైవ్ వెర్షన్స్ ఇక్కడ  మరియు ఇక్కడ  చూడవచ్చు. 

దేవేంద్ర ఫడ్నవీస్, ఇతరులు ఎక్స్ లో షేర్ చేసిన వైరల్ క్లైమ్ (సౌజన్యం: ఎక్స్/స్క్రీన్ షాట్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఇదే వీడియోని ఫేస్బుక్ లో కూడా షేర్ చేశారు. ఈ పోస్ట్ ల ఆర్కైవ్ వెర్షన్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

ఇదే క్లైమ్ ఫేస్బుక్ లో కూడా సర్కులేట్ అవుతున్నది. (సౌజన్యం: ఫేస్బుక్/స్క్రీన్ షాట్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఇది పాత వీడియో. దీనిని ఎడిట్ చేశారు.

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ వీడియో కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే ఎడిట్ చెయ్యని, మరింత నిడివి ఉన్న ఇదే వీడియో ఒరిజినల్ వెర్షన్ మాకు యూట్యూబ్ లో దొరికింది. ఈ వీడియోని ఆర్ కె స్పోర్ట్జ్ ఫౌండేషన్ అనే యూజర్ మే 28, 2022 నాడు యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. “రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఒక లక్ష మంది వందేమాతరం పాడుతున్నారు”, అనేది ఈ వీడియో శీర్షిక. ఏ.ఆర్. రెహ్మాన్ వందేమాతరం పాట స్టేడియంలో వినిపిస్తుండగా దానికి ఆ స్టేడియంలో ఉన్న వాళ్ళు తమ గొంతు కలపటాన్ని మనం ఈ వీడియోలో చూడవచ్చు. 

ఈ వీడియోలో 1:20-1:30 మధ్య ఉన్న భాగమే పైన పేర్కొన్న వైరల్ వీడియో. ఈ రెండు వీడియోల మధ్య అనేక పోలికలు మేము గమనించాము. ఉదాహరణకి స్టేడియంలో ప్రకటనలు/మైదానంలో లోగోలు, ప్రేక్షకులు, వారి భంగిమలు లాంటివి. 

వైరల్ వీడియో, ఆర్ కె స్పోర్ట్జ్ ఫౌండేషన్ అనే యూజర్ యూట్యూబ్ లో 2022లో అప్లోడ్ చేసిన వీడియో మధ్య పోలికలు (సౌజన్యం: ఎక్స్/యూట్యూబ్/స్క్రీన్ షాట్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

వైరల్ వీడియో, ఆర్ కె స్పోర్ట్జ్ ఫౌండేషన్ అనే యూజర్ యూట్యూబ్ లో 2022లో అప్లోడ్ చేసిన వీడియో మధ్య పోలికలు (సౌజన్యం: ఎక్స్/యూట్యూబ్/స్క్రీన్ షాట్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

వైరల్ వీడియో, ఆర్ కె స్పోర్ట్జ్ ఫౌండేషన్ అనే యూజర్ యూట్యూబ్ లో 2022లో అప్లోడ్ చేసిన వీడియో మధ్య పోలికలు (సౌజన్యం: ఎక్స్/యూట్యూబ్/స్క్రీన్ షాట్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఈ వీడియో గురించి మరింత వెతికితే ఇటువంటి వీడియోనే అదే తారీఖు నాడు- అంటే మే 28, 2022- అనేక మంది ఎక్స్ యూజర్లు షేర్ చేశారని గుర్తించాము. ఈ వీడియో షేర్ చేస్తూ వారు వాడిన శీర్షికలు, హ్యాష్ ట్యాగ్ లని బట్టి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలంజర్స్ బెంగళూరు (ఆర్ సి బి) రాజస్థాన్ రాయల్స్ (ఆర్ ఆర్) మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మే 27, 2022 నాడు జరిగిన మ్యాచ్ అని అర్థమయ్యింది. 

వైరల్ వీడియో, 2022లో ఎక్స్ లో షేర్ చేసిన వీడియో మధ్య పోలికలు (సౌజన్యం: ఎక్స్/స్క్రీన్ షాట్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఇవన్నీ కూడా వివిధ కోణాల నుండి తీసిన ఒకటే వీడియో అని నిర్ధారించుకోవడానికి వైరల్ వీడియోలో కనిపించిన మైదానంలో ఉన్న ప్రకటన బోర్డులని, అలాగే డిస్ప్లే బోర్డుని ఆ సమయంలో సామాజిక మాధ్యమాలలో వచ్చిన వీడియోలలో ఉన్నవాటితో, అలాగే మే 27, 2022 నాడు జరిగిన మ్యాచ్ అధికారిక హైలైట్ వీడియోలలో ఉన్నవాటితో పోల్చి చూశాము. 

వైరల్ వీడియో, అధికారిక ఐపిఎల్ హైలైట్స్ వీడియో మరియు యూట్యూబ్ లో 2022 లో అప్లోడ్ చేసిన వీడియో మధ్య పోలికలు (సౌజన్యం: ఎక్స్/ఐపిఎల్/యూట్యూబ్/స్క్రీన్ షాట్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

భారత్-పాకిస్థాన్ 2023 మ్యాచ్ ఐసిసి అధికారిక హైలైట్స్ వీడియో, మొన్నీ మధ్య యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియో మధ్య పోలికలు (సౌజన్యం: ఐసిసి/యూట్యూబ్/స్క్రీన్ షాట్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఆడియో సంగతేంటి?

మరింత నిడివి ఉన్న ఈ వైరల్ వీడియోలో కానీ, 2022లో సామాజిక మాధ్యమాలలో షేర్ చేసిన వీడియోలో కానీ మాకు ఎక్కడా ‘జై శ్రీ రామ్’ అనే నినాదం వినపడలేదు. ప్రేక్షకులు వందేమాతరం పాటకి గొంతు కలపటం ఒక్కటే ఈ వీడియోలలో ఉంది.

వీటిని బట్టి, వైరల్ వీడియోలో ఎడిటింగ్ ద్వారా ‘జై శ్రీ రామ్’ అనే నినాదాన్ని జొప్పించారని అర్థమయ్యింది. వైరల్ వీడియోలో ‘జై శ్రీ రామ్’ అని జొప్పించిన నినాదాన్ని ఎక్కడ నుండి తీసుకువచ్చి ఈ వీడియోలో పెట్టారో అనే దానిని లాజికల్లీ ఫ్యాక్ట్స్ కనుగొనలేకపోయింది.

అక్టోబర్ 14 మ్యాచ్ లో ‘జై శ్రీ రామ్’ నినాదం

అక్టోబర్ 14 నుండి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో సహా అనేక మంది సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన వీడియోల ప్రకారం, అలాగే వివిధ వార్తా కథనాల ప్రకారం అక్టోబర్ 14 నాడు భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో ‘భారతదేశంలోని ప్రతి బాలుడు/బాలిక జై శ్రీ రామ్ అని నినదిస్తారు’ అనే పాటని స్టేడియంలో వినిపించారు. ఈ పాటకి స్టేడియంలోని ప్రేక్షకులు తమ గొంతు కలిపారు. అయితే అక్టోబర్ 14 నాటి వీడియోలు అన్నీ పగటి పూట తీసిన వీడియోలు. వైరల్ వీడియో రాత్రి పూట తీసిన వీడియో. 

దీనిబట్టి వైరల్ వీడియో మొన్న జరిగిన మ్యాచ్ కి సంబంధించిన వీడియో కాదని, కనీసం 2022 నాటి వీడియో అని మనకి అర్థమవుతున్నది.

తీర్పు

మే 2022 నుండి ఆన్లైన్ లో సర్కులేట్ అవుతున్న వీడియోని ఎడిట్ చేసి, అందులోకి ‘జై శ్రీ రామ్’ అనే నినాదం జొప్పించి, ఈ ఎడిట్ చేసిన వీడియో అక్టోబర్ 14, 2023 నాడు భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన ఐసిసి వరల్డ్ కప్ మ్యాచ్ కి సంబంధించిన వీడియో అని క్లైమ్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము.  

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.