అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ తీసిన పాత ఫొటోలు చంద్రయాన్-3 తీసిన ఫొటోలు అని షేర్ చేస్తున్నారు

ద్వారా: రోహిత్ గుత్తా
ఆగస్టు 22 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ తీసిన పాత ఫొటోలు చంద్రయాన్-3 తీసిన ఫొటోలు అని షేర్ చేస్తున్నారు

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఇది పాత వీడియో. ఇది 2022 నాటి వీడియో. ఇది చంద్రయాన్-3 తీసిన వీడియో కాదు.

క్లైమ్ ఐడి 8ff2c245

నేపధ్యం

జులై 14, 2023 నాడు శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ స్టేషన్ నుండి చంద్రాయన్- 3ని చంద్రుడి మీదకి ప్రయోగించారు. చంద్రయాన్ చంద్రుడి మీదకి భారతదేశం నుండి మూడవ మిషన్. ఈ ఫ్యాక్ట్ చెక్ ప్రచురించే సమయానికి చంద్రయాన్ చంద్రుడి కక్ష్యలో ఉంది. అలాగే ప్రధాన మాడ్యూల్ నుండి విక్రమ్ లాండర్ వేరుబడింది. చంద్రుడి దక్షిణ ధృవం మీద ఆగస్ట్ 23, 2023 నాడు విక్రమ్ లాండర్ ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

చంద్రయాన్-3 ప్రయోగించాక సామాజిక మాధ్యమాలలో అంతరిక్షం నుండి తీసిన భూమి వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఈ వీడియో చంద్రయాన్-3 తీసింది అనే క్లైమ్ తో వైరల్ అయ్యింది. ఈ వీడియో షేర్ చేసి ఎక్స్ (ఇంతకమునుపు ట్విట్టర్)లో ఒకరు ఇలా రాసుకొచ్చారు- అద్భుతమైన వీక్షణం. #చంద్రయాన్-3 #ఇస్రో #ఇస్రో ఇండియా #మూన్ ల్యాండింగ్ #విక్రం లాండర్@ఇస్రో. 

ఈ హాష్ టాగ్స్ బట్టి ఈ వీడియో చంద్రయాన్-3 తీసింది అని ఈ యూజర్ పరోక్షంగా చెబుతున్నట్టు అర్థమమయింది. 

అయితే ఇది పాత వీడియో. చంద్రయాన్-3 ప్రయోగానికి మునుపు నుండే ఈ వీడియో ఆన్లైన్ లో ఉంది. 

వాస్తవం

ఈ వైరల్ వీడియో చివర్లో-అంటే 23 సెకండ్ల దగ్గర- ఉన్న టెక్స్టులో ఈ వీడియో అయోవా విశ్వవిద్యాలయం వారి సౌజన్యం అని రాసుంది. “ఎస్ఓఎం ఈటి-క్రెడిట్: యూనివర్శిటీ ఆఫ్ అయోవా, ఇమేజ్ కర్టెసీ ఆఫ్ ది ఎర్త్ సైన్స్ అండ్ రిమోట్ సెన్సింగ్ యూనిట్, నాసా జాన్సన్ స్పేస్ సెంటర్ (ISS067-E-357091-357756)”, అని ఆయా వీడియో సౌజన్యం గురించి ఉంది. 

 

వీడియో చివర్లో ఇచ్చిన క్రెడిట్స్ స్క్రీన్ గ్రాబ్ (సౌజన్యం: ఎక్స్/ Badalka24453653)

దీనిబట్టి మనకి అర్థమయ్యేది ఏమిటంటే ఈ వీడియో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్) తీసిన వీడియో అయ్యుండొచ్చు అని. వీడియో చివర్లో ఉన్న ఆల్ఫా-న్యూమరిక్ కోడ్ ద్వారా ఈ వీడియోకి ఐఎస్ఎస్ కి సంబంధం ఉందని అర్థమవుతుంది. ఇవే క్రెడిట్స్ వాడి ఈ వీడియో గురించి వెతుకగా ఇదే వీడియోని “ఎస్ఓఎం ఈటి” అనే హ్యాండిల్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ , ఫేస్బుక్, రెడ్డిట్ సహా అన్ని సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసినట్టు తెలుసుకున్నాము. ఈ హ్యాండిల్ ఫేస్బుక్  పేజ్ లో “ఎబౌట్’ సెక్షన్ లో “ఆర్టిస్ట్- సాంగ్, సైన్స్ అండ్ టెక్” అని రాసుంది. అలాగే యూట్యూబ్ లో ఈ హ్యాండిల్ వివరాలలో ఈ హ్యాండిల్ లొకేషన్ బ్రెజిల్ అని ఉంది. 

ఎస్ఓఎం ఈటి ఫేస్బుక్, యూట్యూబ్ అకౌంట్లలో “ఎబౌట్” సెక్షన్ స్క్రీన్ గ్రాబ్ (సౌజన్యం: యూట్యూబ్/@Som ET, ఫేస్బుక్/ఎస్ఓఎం ఈటి)

ఈ వీడియోలో కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతుకగా ఇదే వీడియోని ‘ది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ)’ అనే సంస్థ తమ వెబ్సైట్ లో అక్టోబర్ 13, 2022 నాడు అప్లోడ్ చేసినట్టు గుర్తించాము. “ఈఎస్ఏ వ్యోమగామి సమంత క్రిస్టోఫోరెట్టి అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ రెండవ మిషన్- మిషన్ పేరు మినర్వ- సందర్భంగా తీసిన టైమ్ లాప్స్ వీడియో ఇది”, అని ఈ వీడియో వివరణ ఉంది. ఇదే వీడియోని సమంత తన సామాజిక మాధ్యమాలలో షేర్ చేసి, “చివరిసారిగా మరొక్కసారి నాతో కలిసి ప్రయాణించండి. అందరికీ ధన్యవాదాలు”, అని రాసుకొచ్చారు. సమంత ఎక్స్ అకౌంట్ లో కూడా ఇదే పోస్ట్ మాకు కనిపించింది. 

దీనిబట్టి ఈ వీడియోని ఐఎస్ఎస్ తీసిందని, అలాగే ఈ వీడియోని మొదటిసారిగా అక్టోబర్, 2022లో ఆన్లైన్ లో షేర్ చేశారని మనకి స్పష్టం అవుతున్నది. చంద్రయాన్-3 ప్రయోగించకముందు నుండే ఈ వీడియో ఆన్లైన్ లో ఉంది, అలాగే ఈ వీడియోకి చంద్రయాన్-3 కి సంబంధమే లేదు. ల్యాండ్ ఇమేజర్ కెమెరా, ల్యాండ్ హారిజాంటల్ వెలాసిటీ కెమెరా తీసిన ఫొటోలను ఇస్రో ఆగస్ట్ 10, 2023 నాడు విడుదల చేసింది. ఇస్రో అధికారికంగా విడుదల చేసిన ఈ ఫొటోలు, వైరల్ వీడియోలో ఉన్న ఫొటోలు వేరు వేరు. 

తీర్పు

వైరల్ వీడియోని తీసింది ఐఎస్ఎస్ మీద ఉన్న ఒక వ్యోమగామి. ఈ వీడియోని 2022లో తీశారు. ఈ ఫొటోలని మొదటిసారి అక్టోబర్, 2022లో ఆన్లైన్ లో షేర్ చేశారు. చంద్రాయన్-3 తీసిన భూమి ఫొటోలు వేరేవి. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారిస్తున్నాము.   

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , অসমীয়া , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.