పశ్చిమ బెంగాల్ లో పోలీసు ఉద్యోగాలు అన్నీ ముస్లింలకే ఇచ్చారు అనే పాత క్లైమ్ సందేశ్ ఖాలీ వివాదం నేపధ్యంలో వైరల్ అయ్యింది

ద్వారా: రాహుల్ అధికారి
మార్చి 8 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
పశ్చిమ బెంగాల్ లో పోలీసు ఉద్యోగాలు అన్నీ ముస్లింలకే ఇచ్చారు అనే పాత క్లైమ్ సందేశ్ ఖాలీ వివాదం నేపధ్యంలో వైరల్ అయ్యింది

పశ్చిమ బెంగాల్ పోలీసు ఉద్యోగాలకి కేవలం ముస్లింలని మాత్రమే ఎంపిక చేశారని క్లైమ్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

పోలీసు ఉద్యోగాల భర్తీ మత ప్రాతిపదికన జరగలేదు. ఉద్యోగానికి ఎంపికైన వారిలో అత్యధికులు హిందువులే.

క్లైమ్ ఐడి ecad8a53

క్లైమ్ ఏంటి?

పోలీసు అధికారి ఉద్యోగాలు భర్తీలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముస్లింలకి ప్రాధాన్యత ఇచ్చింది అని ఉద్దేశం వచ్చేలా సామాజిక మాధ్యమాలలో అనేక మంది పోస్ట్స్ పెట్టారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ షేక్ ఇంటి మీద ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు జనవరిలో దాడి చేసిన నేపధ్యంలో సందేశ్ ఖాలీలో చోటు చేసుకున్న పరిణామాలకి దీనికి లంకె పెడుతున్నారు.

వికె న్యూస్ అనే ఆన్లైన్ వార్తా చానల్ వీడియో ఒకటి షేర్ చేసి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముస్లింకి ప్రాధాన్యత ఇస్తున్నది అంటూ క్లైమ్ చేశారు. ఈ వీడియోలో యాంకర్ ఒక జాబితా చూపించి, పశ్చిమ బెంగాల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసిన ఉద్యోగ అభ్యర్ధుల జాబితా అని తెలిపారు. ఉద్యోగానికి ఎంపికైన వారందరూ ముస్లింలేనని యాంకర్ పేర్కొంది. “ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ ఉద్యోగాలకి కేవలం ముస్లింలే దరఖాస్తు చేసుకున్నారా? అలా కానప్పుడు మరి ఉద్యోగాలన్ని ముస్లింలకే ఎందుకు వచ్చాయి? పశ్చిమ బెంగాల్ లో ముస్లింలు మాత్రమే ఉన్నారా?” అని వీడియోలో యాంకర్ అనటం మనం వినవచ్చు. బిజేపి పార్లమెంట్ సభ్యుడు ప్రవేష్ వర్మ ఈ జాబితాని తన సామాజిక మాధ్యమ అకౌంట్ లో షేర్ చేసి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రశ్నించారు అని కూడా ఈ వీడియోలో యాంకర్ అనటం మనం వినవచ్చు.

ఈ జాబితా షేర్ చేసి “ఇందులో ఒక్కరంటే ఒక్కరూ కూడా హిందువులు లేరు” అని సామాజిక మాధ్యమ యూజర్లు రాసుకొచ్చారు. తృణమూల్ ప్రభుత్వం ముస్లిం ప్రాధాన్యతకి ఇదొక ఉదాహరణ అని, ముస్లింలకి ఇలా ప్రాధాన్యత ఇవ్వటం కారణంగానే షాజహాన్ షేక్ ని చాలా కాలం వెనకేసుకు వచ్చారని రాసుకొచ్చారు. ఈడీ దాడి తరువాత సందేశ్ ఖాలీలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. షాజహాన్, తన అనుచరులు తమ మీద దాడులకి, లైంగిక దాడులకి పాల్పడ్డారని స్థానిక బాధితులు ఆరోపిస్తున్నారు.

ఈ పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ  చూడవచ్చు. 

వైరల్ సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఈ క్లైమ్ తప్పు. ఈ జాబితాలో కేవలం ఒక కేటగిరికీ చెందిన అభ్యర్ధుల పేర్లు మాత్రమే ఉన్నాయి. ఇదే కేటగిరీలో ముస్లిమేతరులు కూడా ఎంపిక అయ్యారు. అలాగే మొత్తం జాబితా చూసుకుంటే ఎంపికైన వారిలో అత్యధికులు హిందువులే.

మేము ఏమి తెలుసుకున్నాము?

వైరల్ వీడియో రిజల్యూషన్ బాగా తక్కువగా ఉండటం కారణంగా ఈ వీడియోని అనలైజ్ చేయలేకపోయాము. ఆలాగే వికె న్యూస్ ఒరిజినల్ వీడియో కూడా మాకు దొరకలేదు. అయితే వైరల్ వీడియోలో చెప్పినదాని బట్టి ప్రవేష్ వర్మ షేర్ చేసిన జాబితా కనుక్కున్నాము.

ప్రవేష్ తన ఎక్స్ అకౌంట్ లో ఈ జాబితాని జూన్ 19, 2021 నాడు షేర్ చేశారు. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ లో ‘జెనోసైడ్’ కి దారులు వేస్తున్నారని ఆరోపించారు. ఇదే జాబితా షేర్ చేసి, ఇప్పుడు చేస్తున్న క్లైమ్స్ నే 2021లో కూడా అనేక మంది యూజర్స్ చేశారు. దీనిబట్టి ఈ క్లైమ్ కనీసం 3 సంవత్సరాలుగా సర్కులేట్ అవుతున్నదని మనకి అర్థమవుతుంది. 

బిజేపి పార్లమెంట్ సభ్యుడు ప్రవేష్ వర్మ 2021లో షేర్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్)

ఈ జాబితాని మేము పరిశీలించగా తేలింది ఏమిటంటే ఈ జాబితాలో ఉన్న పేర్లు పశ్చిమ బెంగాల్ లో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి  ఓబీసీ- ఏ కేటగిరీలో ఉన్న 50 ఖాళీలకి ప్రొవిజినల్ గా ఎంపికైన అభ్యర్ధుల పేర్లు. ఈ ఉద్యోగాల భర్తీ ప్రకటన 2019లో ఇవ్వగా, జూన్ 2021లో పశ్చిమ బెంగాల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఈ జాబితాని విడుదల చేసింది. 

ఓబీసీ-ఏ కేటగిరీలో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ఎంపికైన 50 మంది అభ్యర్ధుల జాబితా (సౌజన్యం: ఎక్స్/స్క్రీన్ షాట్)

సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ఎంపికైన వారి అన్ని జాబితాలని మేము పరిశీలించాము. ఓబీసీ-ఏ కేటగిరీలోనే కనీసం ఇద్దరి పేర్లు ముస్లిమేతర పేర్లుగా మాకు కనిపించాయి. అందులో ఒకటి సౌమేన్ మైతీ, రెండోది హృదయ్ బిశ్వాస్.

భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ఉద్యోగాలని అన్ రిజర్వ్డ్,  షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, ఇతర వెనుకబడిన తరగతలు (ఓబీసీ) కేటగిరీల కింద భర్తీ చేస్తారు. పశ్చిమ బెంగాల్ లో కూడా 2022 వరకు అదే నడిచింది. ఆ తరువాత ఓబీసీ కేటగిరీని ఓబీసీ-ఏ (మారిత వెనుకబడిన), ఓబీసీ- బి (వెనుకబడిన) గా వర్గీకరించారు.

అన్నిజాబితాలని పరిశీలించగా, మొత్తం 668 మంది అభ్యర్ధులలో 567 మంది వారి పేర్లని బట్టి ముస్లిమేతరులు (చాలా వరకు హిందువులు) ఉన్నారు.   

ప్రతి కేటగిరీలో భర్తీ రెండు విభాగాలలో జరుగుతుంది- ‘ఆర్మ్డ్ బ్రాంచ్’, ఆన్ ఆర్మ్డ్ బ్రాంచ్’. పశ్చిమ బెంగాల్ మొత్తం 10 జాబితాలని విడుదల చేసింది. ఆర్మ్డ్ బ్రాంచ్ విభాగంలో అన్ రిజర్వ్డ్, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, ఓబీసీ-ఏ, ఓబీసీ-బీ కేటగిరీలు. అన్ ఆర్మ్డ్ విభాగంలో కూడా ఇవే 5 కేటగిరీలు.

ఈ మొత్తం 10 జాబితాలలో ఆర్మ్డ్ బ్రాంచ్ విభాగంలో ఓబీసీ- ఏ కేటగిరీలో ఎంపికైన 18 మంది ముస్లిం అభ్యర్ధుల జాబితానే ప్రవేష్ వర్మ షేర్ చేసింది. ఇంకా చెప్పాలంటే కొన్ని జాబితాలలో అయితే కేవలం హిందువులు మాత్రమే ఉన్నారు. 

ఓబీసీ-బి కేటగిరీలో ఆర్మ్డ్, అన్ ఆర్మ్డ్ విభాగాలలో ఎంపికైన అభ్యర్ధుల జాబితాలు (పశ్చిమ బెంగాల్ పోలీస్/స్క్రీన్ షాట్ )

పశ్చిమ బెంగాల్ లో ఓబీసీ-ఏ కేటగిరీలో మొత్తం 81 కులాలు ఉండగా, అందులో 71 ముస్లిం కులాలే. ఈ జాబితా పశ్చిమ బెంగాల్ వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ వెబ్సైట్ లో ఉంది. అలాగే ఓబీసీ-బి కేటగిరీలో 98 కులాలు ఉండగా, అందులో 45 ముస్లిం కులాలే. కాబట్టి ఓబీసీ కేటగిరీ అభ్యర్ధులలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉండటం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు.

తీర్పు

2019లో పశ్చిమ బెంగాల్ లో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగ అభ్యర్ధుల జాబితాలో ఓబీసీ-ఏ జాబితాని పూర్తి నేపధ్యం ఇవ్వకుండా షేర్ చేసి ఉద్యోగాలు అన్నీ ముస్లింలకే ఇచ్చారని తప్పుగా క్లైమ్ చేశారు. ఈ ఓబీసీ-ఏ జాబితాలో అత్యధికులు ముస్లింలు ఉన్నారు. ఎందుకంటే ఓబీసీ-ఏ కేటగిరీలో ఎక్కువ ఉన్నవి ముస్లిం కులాలే కాబట్టి. మొత్తం అన్నీ కేటగిరీల జాబితాలు చూస్తే మొత్తంగా హిందువులే అత్యధికంగా ఉన్నారని అర్థం అవుతుంది. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము.  

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , অসমীয়া , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.