సంబంధం లేని వీడియోని వై ఎస్ ఆర్ సి పి నాయకుడు తన అత్త మీద హత్యాప్రయత్నం చేస్తున్నట్టుగా షేర్ చేశారు

ద్వారా: రోహిత్ గుత్తా
ఫిబ్రవరి 1 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
సంబంధం లేని వీడియోని వై ఎస్ ఆర్ సి పి నాయకుడు తన అత్త మీద హత్యాప్రయత్నం చేస్తున్నట్టుగా షేర్ చేశారు

ఆంధ్ర ప్రదేశ్ లో ఒక వై ఎస్ ఆర్ సి పి నాయకుడు తన మేనత్త మీద హత్యాప్రయత్నం చేస్తున్న వీడియో అంటూ క్లైమ్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఆంధ్ర ప్రదేశ్ లోని అనకాపల్లిలో ఒక కేబుల్ ఆపరేటర్ ఒక వృద్ధురాలి మీద హత్యాప్రయత్నం చేస్తున్న వీడియో ఇది.

క్లైమ్ ఐడి fc27112f

(సూచన- ఈ కథనంలో దాడికి సంబంధించిన వివరణ ఉంది. పాఠకులు గమనించగలరు.)

క్లైమ్ ఏంటి?

ఒక నిమిషం 27 సెకన్ల నిడివి ఉన్న ఒక వీడియోని ఎక్స్ (పూర్వపు ట్విట్టర్)లో షేర్ చేసి, అందులో అనంతపురం జిల్లా గుంతకల్లు వై ఎస్ ఆర్ సి పి అధికార ప్రతినిధి యాగంటి సత్తి రెడ్డి క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు కోల్పోయి, నగల కోసం పిల్లలు లేని తన మేనత్త మీద హత్యాప్రయత్నం చేయడం మనం చూడవచ్చు అంటూ క్లైమ్ చేశారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి ఒక వృద్ధ మహిళ మీద దాడి చేయటం, తన నుండి వృద్ధ మహిళ తనని తాను కాపాడుకునే ప్రయత్నం చేయడం మనం చూడవచ్చు. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ  మరియు ఇక్కడ  చూడవచ్చు. 

వైరల్ సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే సంబంధం లేని వీడియోని ఈ అధికార ప్రతినిధికి ఆపాదించారు.

మేము ఏమి తెలుసుకున్నాము?

యాగంటి సత్తి రెడ్డి అనే వై ఎస్ ఆర్ సి పి అధికార ప్రతినిధి తన మేనత్త మీద దాడి చేసిన ఘటన గురించి ఏమైనా వార్తా కథనాలు ఉన్నాయేమో చూశాము. అటువంటివి ఏమీ కనపడలేదు. అలాగే గుంతకల్లులో సత్తి రెడ్డి పేరిట అధికార పార్టీ నాయకుడు ఉన్నట్టు కూడా మాకు ఎక్కడా ఆధారాలు లభించలేదు.

ఆ తరువాత, ఈ వీడియోలో కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే ఇదే ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ వారి వార్తా కథనం ఒకటి మాకు లభించింది. జనవరి 29, 2024 నాడు వచ్చిన కథనంలో ఈ వీడియో ఉంది. జనవరి 26, 2024 నాడు అనకాపల్లిలో నారాయణమ్మ అనే ఒక వృద్ధ మహిళా ఒంటరిగా ఉన్నప్పుడు, గోవింద్ అనే కేబుల్ ఆపరేటర్ తన మీద దాడి చేశాడని ఈ కథనంలో ఉంది.

నారాయణమ్మ ఒంటి మీద ఉన్న నగలు దొంగలించటం కోసం గోవింద్ తనని వెనుక నుండి టవల్ తో గొంతు నులిమే ప్రయత్నం చేశాడు. నారాయణమ్మ సృహ కోల్పోయాక తన నగలు తీసుకుని పరారయ్యాడు. ఆ తరువాత నారాయణమ్మని ఆసుపత్రిలో చేర్చాక  కోలుకుంది. 

ఈ వీడియో ఆ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీ. ఆ ఫుటేజీలో తారీఖు, సమయం మనం చూడవచ్చు. నిందితుడు ఆ తరువాత పోలీసుల ముందు లొంగిపోయాడు అని ఈ కథనంలో పేర్కొన్నారు.

ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలలో ఈ ఘటన గురించి వచ్చిన వార్తాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి.

లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఈ ఘటనకి సంబంధించిన కేసు నమోదైన అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ వారిని సంప్రదించింది. పట్టణ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. శంకరయ్య మాతో మాట్లాడుతూ, ఇది అనకాపల్లిలో జరిగిన ఘటనేనని, నిందితుడికి అధికార పార్టీకి సంబంధం లేదని ధ్రువీకరించారు. మీడియా కథనాలు వాస్తవమేనని, ఈ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉందని, నిందితుడు తమ ముందు లొంగిపోయాడు అని తెలిపారు.

తీర్పు

దొంగతనం, హత్యా ప్రయత్నంకి చెందిన సంబంధం లేని వీడియోని వై ఎస్ ఆర్ సి పి నాయకుడు తన మేనత్త మీద హత్యాప్రయత్నం చేస్తున్న వీడియోగా షేర్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)



ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.