కర్ణాటకలో ఒక బడిలో జరిగిన బక్రీద్ పండుగ సంబరాలకి మతోన్మాద రంగు పులిమి ప్రచారం చేశారు

ద్వారా: రజిని కె జి
సెప్టెంబర్ 21 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
కర్ణాటకలో ఒక బడిలో జరిగిన బక్రీద్ పండుగ సంబరాలకి మతోన్మాద రంగు పులిమి ప్రచారం చేశారు

కర్ణాటకలో ఒక బడిలో బక్రీద్ వేడుక వీడియో (సౌజన్యం: ఎక్స్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

బడులలో ఖురాన్ చదవటం తప్పనిసరి అంటూ కర్ణాటక ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు.

క్లైమ్ ఐడి 559b5476

క్లైమ్ ఏమిటి?

కొంతమంది విద్యార్ధులు ఒక స్కిట్ లో భాగంగా ఖురాన్ చదువుతున్న వీడియోని సామాజిక మాధ్యమాలలో కొంతమంది  షేర్ చేసి బడులలో ఇస్లాంకి సంబంధించిన పాఠాలు చెప్పడాన్ని కర్ణాటక ప్రభుత్వం తప్పనిసరి చేసిందని క్లైమ్ చేశారు. 

ఈ వీడియోలో ఒక విద్యార్ధి ఈద్-ఉల్-అదా -అంటే బక్రీద్- అర్థాన్ని వివరిస్తుండగా ఇతర విద్యార్ధులు స్కిట్ వేయడం మనం చూడవచ్చు. అలాగే మత సంబంధిత వ్యాఖ్యలు వెనుక వినిపిస్తుండగా గదిలో మిగతా విద్యార్ధులు చేతులు కట్టుకుని ఉండటం కూడా మనం చూడవచ్చు. ఆ తరువాత ఆ బడి ప్రధానోపాధ్యాయులు విద్యార్ధులని ఉద్దేశించి ప్రసంగించారు. 

ఈ వీడియోని ఎక్స్ లో షేర్ చేసి “బడులలో ఖురాన్ పాఠాలు చెప్పడాన్ని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరి చేసింది * *ఉచితాలు ఉచితాలు* * హిందువులేమో ఉచిత టికెట్ల కోసం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు కోసం బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేశారు”, అని రాసుకొచ్చారు. ఇక్కడ ఆర్కైవ్ చేసిన ఈ పోస్ట్ హిందీలో ఉంది. ఈ ఫ్యాక్ట్ చెక్ ప్రచురించే సమయానికి ఈ పోస్ట్ కి 13000కి పైగా వ్యూస్ ఉన్నాయి. ఇటువంటి పోస్టులే ఇక్కడ , ఇక్కడ , ఇక్కడ , ఇక్కడ  కూడా చూడవచ్చు. 

ఈ వీడియోకి మతోన్మాద రంగు పులిమి ప్రచారం చేస్తూ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల పక్షపాతి అంటూ ఆరోపణలు గుప్పించారు. 

వైరల్ క్లైమ్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఈ క్లైమ్ అబద్ధం.

  • మొదటగా ఈ వీడియో కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఉన్న జ్ఞానసాగర ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ లో జరిగిన కార్యక్రమం వీడియో. అక్కడి విద్యార్ధులు బక్రీద్ సంబరాలు చేసుకుంటున్న వీడియో ఇది.
  • రెండవ విషయం ఏమిటంటే ఈ బడిలో అన్ని మతాల పండుగలు జరుపుకుంటారు. ఈ బడి ఫేస్బుక్ పేజిలో దానికి సంబంధించిన ఫొటోలు ఉన్నాయి.
  • బడులలో ఖురాన్ తప్పనిసరిగా బోధించాలి అని కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదు. 

మేము ఏమి తెలుసుకున్నాము?

వీడియోలో 0:25 సెకన్ల దగ్గర ఒక బ్యానర్ మీద “జ్ఞానసాగర” అని రాసి ఉండటం మేము గమనించాము.  కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఉన్న జ్ఞానసాగర ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ లో విద్యార్దులు వేసిన స్కిట్ ఇది అని మేము తెలుసుకోవటానికి ఈ క్లూ దోహదపడింది. 

వైరల్ క్లిప్ లో కనిపించిన బ్యానర్ మీద బడి పేరు ఉంది (సౌజన్యం: ఎక్స్/స్క్రీన్ షాట్)

జులై 1 నాడు టివి 9 కన్నడలో వచ్చిన కథనం ప్రకారం ఈ బడిలో విద్యార్ధులు ఖురాన్ చదువుతున్న వీడియో వైరల్ అయ్యాక జూన్ 30 నాడు హిందూ మితవాద సంఘాలకి చెందిన వారు బడి బయట నిరసన తెలిపారు. ఈ నిరసనల తరువాత బడి యాజమాన్యం ఒక ప్రకటన జారీ చేసింది. ముస్లిం సమాజానికి చెందిన ముగ్గురు విద్యార్ధులు మాత్రమే ఖురాన్ చదివారని, మిగతా విద్యార్ధులు కేవలం వాళ్ళ కళ్ళు మూసుకుని, చేతులు జోడించారని ఈ ప్రకటనలో తెలిపారు. 

ఈ బడి ప్రధానోపాధ్యాయులు సుజా ఫిలిప్ లాజికల్లీ ఫ్యాక్ట్స్ తో మాట్లాడుతూ, “మేము మా బడిలో రకరకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. ఈ స్కిట్ కూడా అందులో ఒక భాగం. ముస్లిం సమాజానికి చెందిన విద్యార్ధులు ఈ స్కిట్ లో పాల్గొని ఖురాన్ చదివారు. మిగతా విద్యార్ధులు చదవలేదు.”, అని తెలిపారు. ఈ వీడియో తమ బడిలో తీసిందేనని సుజా ఫిలిప్ ధృవీకరించారు. ఈ వీడియో బక్రీద్ పండుగ సందర్భంగా జూన్ 30, 2023 నాడు తీసిందని తెలిపారు. “మేము ఇతర మత పండుగలని కూడా జరుపుకుంటుంటాము”, అని ఆవిడ తెలిపారు. 

ఇతర మతాల పండుగలు 

ఈ బడి ఫేస్బుక్ పేజిని మేము చూసినప్పుడు మాకు బడిలో సెప్టెంబర్ 6 నాడు కృష్ణ జన్మాష్టమి పండుగ జరుపుకుంటున్న ఫొటోలు లభించాయి.   విద్యార్ధులు కృష్ణుడు, రాధ వేషధారణలో ఉన్నారు. అలాగే సెప్టెంబర్ 2019లో కృష్ణ జన్మాష్టమి పండుగ జరుపుకుంటున్న ఫొటోలు కూడా మాకు లభించాయి. 

జ్ఞానసాగర ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ లో 2019, 2023లలో కృష్ణ జన్మాష్టమి పండుగ జరుపుకుంటున్న ఫొటోలు (సౌజన్యం: ఫేస్బుక్/స్క్రీన్ షాట్)

అలాగే జనవరి 16, 2023 నాడు ఈ బడిలో సంక్రాంతి పండుగ కూడా జరుపుకున్నారు. ఈ బడి వెబ్సైట్ లో ‘ఎబౌట్ అస్’ సెక్షన్ లో విద్యార్ధులు యక్షగానం వేషధారణలో ఉన్న ఫొటోలు ఉన్నాయి. యక్షగానం అనేది కర్ణాటక కోస్తా ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన జానపద నృత్య కళారూపం. 

జ్ఞానసాగర ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ లో జనవరి 16 నాడు జరిగిన సంక్రాంతి వేడుకలు (సౌజన్యం: ఫేస్బుక్/స్క్రీన్ షాట్)

అలాగే డిసెంబర్ 2021 నాటి క్రిస్మస్ వేడుక ఫొటోలు కూడా మాకు లభించాయి. 

జ్ఞానసాగర ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ లో జరిగిన క్రిస్మస్ వేడుక ఫొటోలు (సౌజన్యం: ఫేస్బుక్/స్క్రీన్ షాట్)

న్యూస్ 18 కన్నడ ఛానల్ తో మాట్లాడుతూ “ఈ బడిలో పర్యావరణ దినోత్సవం, తల్లుల దినోత్సవం లాంటి అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలాగే బక్రీద్ పండుగ గురించి అవగాహన కలిపించడానికి ఈ పండుగ కూడా జరిపారు”, అని మంజునాథ్ అని ఒక విద్యార్ధి తండ్రి తెలిపారు. కేవలం బక్రీద్ పండుగ ఒక్కటే జరిపి ఉంటే విద్యార్ధుల తల్లితండ్రులు అభ్యంతరం వ్యక్తం చేసేవారేమో కానీ, ఈ బడిలో అన్ని పండుగలు జరుపుతారు కాబట్టి ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు అని ఆయన తెలిపారు.

ఖురాన్ తప్పనిసరి చేయడం గురించిన వాస్తవం ఏమిటి?

బడులలో ఖురాన్ బోధించాలి అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చినట్టు తనకైతే ఏమీ తెలియదని, తమకైతే అటువంటి ఉత్తర్వులు ఏమీ రాలేదు అని సుజా ఫిలిప్ లాజికల్లీ ఫ్యాక్ట్స్ కి తెలిపారు.

అలాగే బడులలో ఖురాన్ బోధించాలి అని చెబుతూ ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వు ఏదీ లాజకల్లీ ఫ్యాక్ట్స్ దృష్టికి రాలేదు. అలాగే దీని గురించి నమ్మదగిన వార్తా కథనాలు కూడా ఏమీ లేవు. రాష్ట్ర విద్యా శాఖకి చెందిన పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులు ఇద్దరు లాజికల్లీ ఫ్యాక్ట్స్ తో మాట్లాడుతూ ప్రభుత్వం కానీ తమ శాఖ కానీ అటువంటి ఉత్తర్వు ఏదీ ఇవ్వలేదని తెలియచేశారు.

తీర్పు

కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఒక ప్రైవేటు స్కూల్ లో జరిగిన బక్రీద్ వేడుక వీడియో షేర్ చేసి బడులలో ఖురాన్ చదవడాన్ని కర్ణాటక ప్రభుత్వం తప్పనిసరి చేసిందని క్లైమ్ చేశారు. ఈ బడిలో అన్ని మతాల పండుగలు జరుపుకుంటుంటారు. అలాగే కర్ణాటక ప్రభుత్వం కూడా అటువంటి ఉత్తర్వు ఏదీ జారీ చేయలేదు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

 

(అనువాదం- గుత్తా రోహిత్)

 

 

 

 

 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.