బురఖా ధరించి స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ఒక అధికారి వీడియో కర్ణాటకకి చెందిన వీడియో అని షేర్ చేస్తున్నారు

ద్వారా: రోహిత్ గుత్తా
సెప్టెంబర్ 5 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
బురఖా ధరించి స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ఒక అధికారి వీడియో కర్ణాటకకి చెందిన వీడియో అని షేర్ చేస్తున్నారు

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఈ వీడియోలో ఉన్న వ్యక్తి జమ్మూ కశ్మీర్ లోని కిష్ట్వర్ జిల్లా అభివృద్ధి కౌన్సిల్ ఉపాధ్యక్షులు. ఈ మహిళ పేరు సైమా పర్వీన్ లోన్.

క్లైమ్ ఐడి f2dc1969

క్లైమ్ ఏంటి?

కర్ణాటకకి చెందిన ఒక ఐఏఎస్ అధికారి స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి బురఖాలో హాజరయ్యారు అంటూ ఒక వ్యక్తి ఆగస్ట్ 24, 2023 నాడు ఫేస్బుక్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని హిజాబ్ గురించి కర్ణాటకలో 2022లో జరిగిన అల్లర్లకి  లంకె పెడుతూ ‘బురఖా వేసుకున్నందుకు కర్ణాటకలో గతంలో గొడవలే జరిగాయి’ అని తెలుగులో రాసుకొచ్చారు. 

ఇదే వీడియోని ఎక్స్ (పూర్వపు ట్విట్టర్)లో ఆగస్ట్ 29, 2023 నాడు పోస్ట్ చేస్తూ మరొక యూజర్ ‘హిందువులు ఒక్క తప్పు ఓటు వేసినా కూడా భారతదేశం ఇస్లామిక్ దేశంగా మారిపోతుంది’ అని హిందీలో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ కి ఈ ఫ్యాక్ట్ చెక్ ప్రచురించే సమయానికి 1300కి పైగా వ్యూస్, 100 కి పైగా రీపోస్ట్స్ ఉన్నాయి. 

ఎక్స్, ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన వీడియో స్క్రీన్ షాట్స్ (సావుజన్యం: ఎక్స్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఈ వీడియో జమ్మూ కశ్మీర్ లోని కిష్ట్వర్ ప్రాంతానికి చెందినది.

మాకెలా తెలిసింది?  

 

వీడియోలో 00:18-00:19 సెకన్ల దగ్గర ప్రజలు కూర్చోవటానికి ఏర్పాటు చేసిన స్థలంలో ఉన్న ఒక బోర్డు మీద “కిష్ట్వర్” అనే పదం కనిపించింది. అలాగే ఈ వీడియోలోనే 00:26-00:27 సెకన్ల దగ్గర వీడియోలోని మహిళ జీపులో వెళ్తుండగా పక్కనే ఉన్న బ్యానర్ క్రింద ఫొటోలో చూపించినట్టు మీద “జిల్లా పరిపాలనా విభాగం కిష్ట్వర్” అని కనిపించింది. 

జిల్లా పరిపాలనా విభాగం కిష్ట్వర్ అని కనిపిస్తున్న స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఈ వైరల్ వీడియోలో ‘ఫాస్ట్ న్యూస్’ అనే లోగో ఉంది. దీనికోసం మేము ఫేస్బుక్ లో వెతుకగా వారి ఫేస్బుక్ పేజి మాకు లభించింది. అలాగే మరింత నిడివి ఉన్న ఇదే వీడియో మాకు అందులో దొరికింది. 

ఈ వీడియోని ఆ పేజిలో ఆగస్ట్ 15, 2023 నాడు పోస్ట్ చేశారు. “స్వాతంత్ర దినోత్సవం 2023: కిష్ట్వర్ ఉపాధ్యక్షులు సైమా పర్వీన్ లోన్ కిష్ట్వర్ లోని చౌగన్ మైదానంలో జాతీయ జెండా ఎగరేశారు. చరిత్రలో మొదటిసారిగా హిజాబ్ వేసుకుని కిష్ట్వర్ ఉపాధ్యక్షులు ప్రజలని ఉద్దేశించి ప్రసంగించారు. #బురఖా మహిళ”, అనే శీర్షిక ఈ వీడియోకి పెట్టారు. 

ఈ వీడియోలో మహిళని ఇద్దరు పోలీసు అధికారులు ఎస్కార్ట్ గా ఉంది తీసుకువెళ్లటం మనం చూడవచ్చు. అందులో ఒక పోలీసు అధికారి చేతిలో ఒక కత్తి పట్టుకుని ఉండటం కూడా చూడవచ్చు. 

పోలీసు ఎస్కార్ట్ తో వెళ్తున్న సైమా పర్వీన్ లోన్ వీడియో (సౌజన్యం: ఫేస్బుక్/ఫాస్ట్ న్యూస్)

 

ఫాస్ట్ న్యూస్ వారు తమ ఫేస్బుక్ పేజిలో పోస్ట్ చేసిన మరింత నిడివి ఉన్న వీడియోలో 00:03-01:01 వరకు ఉన్న భాగాన్ని తీసుకుని ఇతరులు వైరల్ చేశారు. 

ఈ మరింత నిడివి ఉన్న వీడియోలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలని కూడా చూడవచ్చు. వారు ఒక బ్యానర్ పట్టుకుని నుంచుని ఉన్నారు. ఆ బ్యానర్ మీద కూడా జిల్లా పరిపాలనా విభాగం కిష్ట్వర్ అని ప్రింట్ చేసి ఉండటం మనం 01:02-01:03 సెకన్ల దగ్గర చూడవచ్చు.

వీడియోలో జిల్లా పరిపాలనా విభాగం కిష్ట్వర్ అని బ్యానర్ మీద ఉన్న స్క్రీన్ షాట్ (సౌజన్యం:ఫేస్బుక్/ఫాస్ట్ న్యూస్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఈ ఫేస్బుక్ వీడియోలో ఈ మహిళ సైమా పర్వీన్ లోన్ అని, ఈవిడ కిష్ట్వర్ జిల్లా అభివృద్ధి కౌన్సిల్ ఉపాధ్యక్షులు అని ఉంది. అలాగే ఈ మహిళ జిల్లా అభివృద్ధి కౌన్సిల్ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు అని చెబుతూ ‘సమాచారం మరియు ప్రజా సంబంధాలు, కిష్ట్వర్’ అనే ఎక్స్ హ్యాండిల్ ఫిబ్రవరి 18, 2021 నాడు చేసిన పోస్ట్ కూడా మాకు కనిపించింది. 

సైమా పర్వీన్ లోన్ గురించి కిష్ట్వర్ జిల్లా సమాచారం మరియు ప్రజా సంబంధాల శాఖ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/@DICKishtwar/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ ప్రజా సంబంధాల శాఖ వారు అక్కడ జరిగిన 77 వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలని గురించి తమ వెబ్సైట్ లో రాస్తూ కిష్ట్వర్ లో కార్యక్రమం జరిగిందని, “అక్కడ చారిత్రక చౌగన్ మైదానంలో జిల్లా అభివృద్ధి కౌన్సిల్ ఉపాధ్యక్షులు సైమా పర్వీన్ లోన్ జెండా వందనం చేశారు. వారితో పాటు ఎస్ ఎస్ పి ఖాళీ అహ్మద్ పోశ్వాల్ ఉన్నారు. ఆ తరువాత పోలీసు, సి ఆర్ పి ఎఫ్, సి ఐ ఎస్ ఎఫ్ లాంటి రక్షణ దళాల వందనం స్వీకరించారు”, అని రాశారు. 

దీనిబట్టి బురఖాలో ఉన్న మహిళ జమ్ము కశ్మీర్ లోని కిష్ట్వర్ కి చెందిన సైమా పర్వీన్ లోన్ అని మనకి స్పష్టంగా తెలుస్తున్నది. 

తీర్పు 

ఈ వీడియో జమ్మూ కశ్మీర్ లోని కిష్ట్వర్ కి చెందిన వీడియో. ఈ వీడియోలో ఉన్న మహిళ ఆ జిల్లా అభివృద్ధి కౌన్సిల్ ఉపాధ్యక్షులు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారిస్తున్నాము. 

అనువాదం- గుత్తా రోహిత్

 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.