ఎన్నికలలో ఓటు వేసేందుకు క్యూ జంప్ చేసినందుకు చిరంజీవిని ఒక ఓటరు ప్రశ్నించిన వీడియో 2014 నాటిది

ద్వారా: అనెట్ ప్రీతి ఫుర్తాధో
మే 16 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఎన్నికలలో ఓటు వేసేందుకు క్యూ జంప్ చేసినందుకు చిరంజీవిని ఒక ఓటరు ప్రశ్నించిన వీడియో 2014 నాటిది

2024 ఎన్నికలలో చిరంజీవి ఓటు వేయడానికి క్యూ జంప్ చేస్తుంటే ఓటర్ ప్రశ్నించారు అని క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

తాజా ఎన్నికలలో ఓటు వేసేందుకు చిరంజీవి క్యూ జంప్ చేశారని అర్థం వచ్చేటట్టు షేర్ చేసిన ఈ క్లిప్ 2014 ఎన్నికల నాటిది.

క్లైమ్ ఐడి fa58b22f

క్లైమ్ ఏంటి?

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల నేపధ్యంలో, ఒక తెలుగు టీవీ చానల్ క్లిప్ ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. ఈ 2 నిమిషాల 20 సెకన్ల క్లిప్ లో నటుడు, మాజీ రాజకీయ నాయకుడు చిరంజీవిని మనం చూడవచ్చు.

ఓటర్లలో అవగాహన పెరుగుదల గురించిన ఈ కార్యక్రమంలో, ఓటు వేయడానికి తన కుటుంబంతో సహా వచ్చిన చిరంజీవి క్యూ జంప్ చేయడానికి చేసిన ప్రయత్నం గురించి ఉంది. ఈ చర్యని ఒక ఓటరు ప్రశ్నించడం కూడా మనం ఈ క్లిప్ లో చూడవచ్చు.

చిరంజీవి తన చర్యని సమర్దించుకునే ప్రయత్నం చేయగా, ఆ ఓటరు సంతృప్తి చెందలేదు. దానితో చిరంజీవి తిరిగి క్యూలో నిలబడ్డారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా కాక, తన కుటుంబంతో కలిసి ఒక ఓటరుగా వచ్చినప్పుడు ఒక ఓటరుగానే ఉండాలి కదా అని ఈ ఓటర్ చిరంజీవిని ప్రశ్నించారు.

ఈ వైరల్ వీడియోలో 30 సెకన్ల టైమ్ స్టాంప్ దగ్గర ఆ ఓటర్, “మేము గంటన్నర్ర నుండి లైన్ లో ఉన్నాము. మీకేమన్నా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయాలా? లేదు, లేదు, లేదు, మీ అబ్బాయి కూడా ఇక్కడే లైన్ లో ఉన్నాడు; మీరు కూడా క్యూలోనే నుంచోవాలి. అవునా కాదా?” అని చిరంజీవిని ప్రశ్నించడం మనం చూడవచ్చు. ఆ తరువాత చిరంజీవి తిరిగి క్యూలో నుంచున్నారు అని, తనని ప్రశ్నించిన ఓటరుకి అందరూ చప్పట్లు కొట్టారని వాయిస్ ఓవర్ లో చెప్పడం మనం వినవచ్చు. ఈ చప్పట్లు మనకి ఈ వీడియోలో కూడా వినిపిస్తాయి. చిరంజీవి తన చర్యని సమర్దించుకునేది కూడా మనం ఈ క్లిప్ లో చూడవచ్చు. 

వైరల్ ఎక్స్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఈ పోస్ట్ ని ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో షేర్ చేసి, “జూబ్లీ హిల్స్ పోలింగ్ స్టేషన్ లో క్యూ జంప్ చేసి నిర్ఘాంతపోయిన చిరంజీవి” అనే శీర్షిక పెట్టారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకి సంబంధించిన #APElections2024 లాంటి హ్యాష్ ట్యాగ్ లు కూడా పెట్టి, ఇది తాజాగా జరిగిన ఘటన అనే అర్థం వచ్చేటట్టు షేర్ చేశారు.

ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఆంధ్ర ప్రదేశ్ లో శాసనసభ, లోక్ సభ ఎన్నికలు మే 13 నాడు జరిగాయి. అయితే, ఈ వీడియో 2014 నాటిది, 

మేము ఏమి తెలుసుకున్నాము?

వైరల్ వీడియోలో ఎడమ వైపు పై భాగాన V6 చానల్ లోగో చూశాము. దీని ద్వారా మరింత నిడివి ఉన్న ఇదే వీడియోని V6 న్యూస్  (ఆర్కైవ్ ఇక్కడ) వాళ్ళు తమ యూట్యూబ్ అకౌంట్ లో మే 1, 2014 నాడు పెట్టారని తెలుసుకున్నాము. “జూబ్లీ హిల్స్ పోలింగ్ బూత్ లో క్యూ జంప్ చేసి నిర్ఘాంతపోయిన చిరంజీవి” అనేది ఈ వీడియో శీర్షిక. 

ఈ వీడియోలో చిరంజీవి వివరణ మొత్తం ఉంది. 2:14 టైమ్ స్టాంప్ దగ్గర చిరంజీవి, “నియమాలని ఉల్లంఘించే వ్యక్తిని కాదు నేను. నా పేరు రిజిస్టర్ అయి ఉందో లేదో తెలుసుకోవటానికి మాత్రమే ఆ బల్ల వరకు వెళ్ళాను,” అని అనటం మనం వినవచ్చు. తన పేరు రిజిస్టర్ అయి ఉందో లేదో తెలుసుకోవటానికే మాత్రమే అధికారుల దగ్గరకి వెళ్ళాను అని తెలుపుతూ, ప్రజాస్వామ్యం అంటే తనకెంతో గౌరవం అని, తాను నియమాలు ఉల్లంఘించను అని నొక్కి వక్కాణించారు. 

ఏప్రిల్ 30, 2014 నాడు ఎన్ డి టి వి లో “ఓటర్ల క్యూ జంప్ చేయకుండా చిరంజీవిని ఆపిన ఒక ప్రవాస భారతీయుడిని మెచ్చుకున్న ప్రజలు” అనే శీర్షికతో ఇదే వీడియో ప్రచురించారు. ఇందులో ఈ భాగం 18 సెకన్ల టైమ్ స్టాంప్ దగ్గర మొదలవుతుంది. “ఆంధ్ర ప్రదేశ్ లో పోలింగ్ స్టేషన్ లో క్యూ దాటి వెళ్దామని ప్రయత్నించినట్టు ఆరోపణలు ఎదుర్కుంటున్న చిరంజీవిని ఓటర్లు మందలించారు” అని ఇందులో ఉంది.

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గంలోని ఒక పోలింగ్ స్టేషన్ కి మాజీ మంత్రి అయిన చిరంజీవి తన భార్య, కొడుకు, కూతురుతో వచ్చారని ఈ కథనంలో ఉంది. 

2018 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చిరంజీవి అక్టోబర్ 2012 నుండి మే 2014 వరకు పర్యాటక శాఖ సహాయ మంత్రి గా ఉన్నారు. తను కాంగ్రెస్ పార్టీ నుండి బయటకి వచ్చేశారు అని ఎటువంటి వార్తలు లేవు కానీ, రాజకీయాలలో ప్రస్తుతం క్రియాశీలకంగా ఉండటం లేదు. 

ది హిందూ లో వచ్చిన ఒక కథనం ప్రకారం చిరంజీవిని మందలించిన వ్యక్తి పేరు రాజా కార్తీక్ గంటా. కేంబ్రిడ్జ్ లో ఐటీ ఉద్యోగిగా చేస్తున్న తను, ఓటు వేయడానికి లండన్ నుండి వచ్చారు.

చిరంజీవి, 2024 ఎన్నికలు 

మే 13 నాడు చిరంజీవి, తన కుటుంబ సభ్యులు జూబ్లీ హిల్స్ లోని పోలింగ్ స్టేషన్ లో ఓట్లు వేస్తూ కనిపించారు. మిర్రర్ నౌ చానల్ వారు దీనిని తమ యూట్యూబ్ అకౌంట్ (ఆర్కైవ్ ఇక్కడ)లో పోస్ట్ చేశారు. ఇందులో చిరంజీవి నల్ల దుస్తులు ధరించి ఉన్నారు. వైరల్ వీడియోలో తెల్ల దుస్తులు ధరించి ఉన్నారు.

తీర్పు

పోలింగ్ స్టేషన్ లో క్యూ జంప్ చేసినందుకు చిరంజీవిని ఒక ఓటరు ప్రశ్నించిన వీడియో 2014 నాటిది. ఆ వీడియోని తాజా ఎన్నికల నేపధ్యంలో ఈ ఎన్నికలకి సంబంధించినది అన్నట్టు షేర్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ తప్పుదోవ పట్టించేటట్టు ఉందని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)

  

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.