హోమ్ పాత వీడియో షేర్ చేసి పాకిస్థాన్ రాజకీయ నాయకులు ఇజ్రాయెల్ మీద అణు దాడికి పిలుపునిచ్చారని క్లైమ్ చేశారు

పాత వీడియో షేర్ చేసి పాకిస్థాన్ రాజకీయ నాయకులు ఇజ్రాయెల్ మీద అణు దాడికి పిలుపునిచ్చారని క్లైమ్ చేశారు

ద్వారా: అనెట్ ప్రీతి ఫుర్తాధో

అక్టోబర్ 25 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
పాత వీడియో షేర్ చేసి పాకిస్థాన్ రాజకీయ నాయకులు ఇజ్రాయెల్ మీద అణు దాడికి పిలుపునిచ్చారని క్లైమ్ చేశారు ఇజ్రాయెల్-హమస్ యుద్ధం నేపధ్యంలో అక్టోబర్ 2023 లో పాకిస్థాన్ రాజకీయ నాయకులొకరు ఇజ్రాయెల్ మీద అణుదాడికి పిలుపునిచ్చారు అనే వైరల్ క్లైమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తప్పుదారి పట్టించేది

పాకిస్థాన్ రాజకీయ నాయకులు సర్వత్ ఫాతిమా 2021లో చేసిన వ్యాఖ్యలని ఇప్పుడు షేర్ చేసి ఇజ్రాయెల్-హమస్ యుద్ధానికి ముడిపెడుతున్నారు.

ఇజ్రాయెల్-హమస్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. గాజా మీద చేస్తున్న దాడులకు కాను, ఇతర చర్యలకు కానూ ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ ని విమర్శిస్తున్నాయి. ఇజ్రాయెల్ “ఆవివేకమైన దాడి”కి పాల్పడుతున్నదని విమర్శిస్తూ, గాజాకి మానవతా సహాయాన్ని అందించనున్నట్టు పాకిస్థాన్ అక్టోబర్ 14 నాడు ప్రకటించింది. పాలస్తీనా ప్రజలకి “పాకిస్థాన్ నుండి నిస్సందేహమైన దౌత్య, నైతిక, రాజకీయ మద్ధతు” ఉందని పాకిస్థాన్ సైన్యం అక్టోబర్ 17 నాడు పేర్కొంది.

క్లైమ్ ఏమిటి?

ఈ నేపధ్యంలో పాకిస్థాన్ రాజకీయ నాయకులు ఒకరు “ఇజ్రాయెల్ మీద అణుదాడికి పిలుపునిచ్చారు” అని క్లైమ్ చేస్తూ ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో సర్కులేట్ అవుతున్నది. ఈ వీడియోలో నల్ల బురఖా వేసుకున్న ఒక మహిళ ఉర్దూలో మాట్లాడుతున్నారు. “పాకిస్థాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. అవి కేవలం ప్రదర్శనకి మాత్రమే కాదు. ముస్లింలని, పాకిస్థాన్ ని కాపాడటానికి అవి ఉన్నాయి. పాలస్తీనా మీద ఇజ్రాయెల్ చేపడుతున్న చర్యలని ఆపమని, పాలస్తీనా భూభాగ ఆక్రమణని ఆపమని ఇజ్రాయెల్ కి చెప్పవలసిందిగా నేను పాకిస్థాన్ ప్రధాన మంత్రిని కోరుతున్నాను. ఇజ్రాయెల్ మాట వినని  పక్షంలో ప్రపంచ పటం నుండి ఇజ్రాయెల్ అనే దేశమే లేకుండా చేస్తాము”, అని ఆవిడ ఉర్దూలో మాట్లాడారు.  

అనేక మంది ఫాలోవర్స్, రీచ్ ఉన్న ఎన్నో ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) అకౌంట్స్ ఈ వీడియోని పోస్ట్ చేశాయి. అందులో ఒక హ్యాండిల్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ (ఆర్.ఎస్.ఎస్) ప్రచురించే పాంచజన్య పత్రిక హ్యాండిల్. ఈ హ్యాండిల్ ఈ వీడియోని అక్టోబర్ 17, 2023 నాడు పోస్ట్ చేసింది. ఈ వీడియోని ఈ ఫ్యాక్ట్ చెక్ ప్రచురించే సమయానికి 3,57,000 మంది చూశారు. ఈ పోస్ట్ ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు. 

పాంచజన్య ఎక్స్ లో పోస్ట్ చేసిన క్లైమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఈ పాంచజన్య  పోస్ట్ ని చాలా మంది రీ షేర్ చేసి ప్రస్తుతం ఇజ్రాయెల్-హమస్ మధ్య జరుగుతున్న యుద్ధానికి లంకె పెట్టారు. #యుద్ధంలో ఇజ్రాయెల్. పాకిస్థాన్ తన అణ్వాయుధాలని కేవలం ప్రదర్శన కోసం పెట్టుకోలేదు”, “#ఇజ్రాయెల్ కనుక ముస్లింల మీద దాడులు ఆపకపోతే ప్రపంచ పటం నుండి ఇజ్రాయెల్ ని తుడిచివేస్తాము”, లాంటి శీర్షికలతో ఈ వీడియోని రీషేర్ చేశారు (హిందీ నుండి అనువాదం). అటువంటి ఒక పోస్ట్ ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు. ప్రస్తుతం నడుస్తున్న యుద్ధానికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ లు వాడి ఇంకొందరు ఈ వీడియోని షేర్ చేశారు. అటువంటి ఒక ఎక్స్ పోస్ట్ ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు. 

ఆన్లైన్ లో సర్కులేట్ అవుతున్న క్లైమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఇది 2021 నాటి వీడియో.

వాస్తవాలు

ఈ వైరల్ వీడియోలో పైన ఎడమ వైపు యూట్యూబ్ లోగోతో పాటు “టి ఎల్ పి” అనే లోగో ఉంది. అలాగే కింద భాగాన “టి ఎల్ పి ఆఫీషియల్ స్టేటస్” అనే లోగో ఉంది. అలాగే ఎక్స్, “టి ఎల్ పి మర్కాజ్ రియల్” అనే లోగోలు కూడా స్పష్టంగా చూడవచ్చు. 

“టి ఎల్ పి”, “టి ఎల్ పి ఆఫీషియల్ స్టేటస్”, “టి ఎల్ పి మర్కాజ్ రియల్”, యూట్యూబ్, ఎక్స్ లోగోల స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఈ లోగోలు ఏదో ఒక ఛానల్ కి లేదా సంస్థకి చెందిన లోగోలు అయ్యుండాలి. దీని గరించి మరింత వెతుకగా ఈ వీడియోని మొదటిగా మే 2021లో యూట్యూబ్ లో అప్లోడ్ చేశారని తెలిసింది. “టి ఎల్ పి ఆఫీషియల్ స్టేటస్” అనే యూట్యూబ్ అకౌంట్ లో ఈ వీడియోని అప్లోడ్ చేశారు. “అల్లామా ఖాదీ రిజ్వీ 2021I పాలస్తీనా గురించి సింధ్ శాసనసభలో మాట్లాడుతున్న ఏంపిఏ సర్వత్ ఫాతిమా”, అనేది ఈ వీడియో శీర్షిక.

ఈ యూట్యూబ్ ఛానల్ తెహ్రీక్-ఈ-లబ్బైక్ పాకిస్థాన్ అని పాకిస్థాన్ కి చెందిన ఒక రాజకీయ పార్టీ అనుబంధ ఛానల్. ఒరిజినల్ వీడియో నిడివి 6 నిమిషాల 17 సెకన్లు. ఈ వీడియోలో మాట్లాడుతున్న మహిళ “సర్వత్ ఫాతిమా, మెంబర్ ప్రొవిన్షియల్ అసెంబ్లీ” గా తెలిపారు. ఫాతిమా పాకిస్థాన్ కి చెందిన రాజకీయ నాయకులు. ఆగస్ట్ 2018 నుండి ఆగస్ట్ 2023 వరకు సింధ్ శాసనసభ్యులు కూడా. 

టి ఎల్ పి ఆఫీషియల్ స్టేటస్ వారి వీడియో (సౌజన్యం: టి ఎల్ పి ఆఫీషియల్ స్టేటస్/యూట్యూబ్)

ఇజ్రాయెల్ అకృత్యాలకి పాల్పడుతున్నదని ఆరోపిస్తూ ఫాతిమా ఈ వీడియోలో వారి మీద చర్య తీసుకోవాలని చెబుతున్నారు. ఈ వీడియోలో 5:10 నుండి 5:38 మధ్య ఉన్న భాగమే వైరల్ వీడియో. ఈ భాగాన్ని ఒరిజినల్ వీడియో నుండి క్రాప్ చేసి తప్పుదోవ పట్టించే శీర్షిక పెట్టి షేర్ చేస్తున్నారు.

ఇజ్రాయెల్-హమస్ మధ్య 2021లో జరిగిన భీకర పోరాటం నేపధ్యంలో మే 2021లో ఫాతిమా ఈ వ్యాఖ్యలు చేశారు. రాయిటర్స్ వారి కథనం ప్రకారం మే 7 నాడు పాలస్తీనా ప్రజలు ఇజ్రాయెల్ సైన్యం మీదకి రాళ్ళు విసిరిన దరిమిలా ఇజ్రాయెల్ సైన్యం అల్-అక్సా మసీదు మీద రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ వాడి దాడి చేశారు. ఈ సంక్షోభం మరింత ముదిరి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరే ఈ గొడవని “భీతావహమైన”ది గా వర్ణించే వరకు వెళ్ళింది.

ఆ నాటి సింధ్ శాసనసభ సెషన్ గురించి పాకిస్థాన్ పత్రిక ‘డాన్’ మే 21, 2021 నాడు ఒక వార్తా కథనం ప్రచురించింది. గాజాలో ఇజ్రాయెల్ చర్యలని “రాజ్య ఉగ్రవాదం”గా పేర్కొంటూ, నిరాయుధులైన పాలస్తీనా ప్రజల మీద ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న “జెనోసైడ్”కి తక్షణమే ఇజ్రాయెల్ స్వస్తి పలకాలని ఆ రోజు సెషన్లో సభ్యులు డిమాండ్ చేశారని ఈ వార్తా కథనంలో పేర్కొన్నారు. ఆ రోజు సభలో మాట్లాడిన వారిలో టి ఎల్ పి కి చెందిన ఫాతిమా ఒకరు.

తీర్పు

2021కి చెందిన వీడియోని సందర్భరహితంగా షేర్ చేయడంతో చాలా మంది యూజర్లు ఈ వీడియోని ప్రస్తుతం నడుస్తున్న ఇజ్రాయెల్-హమస్ యుద్ధానికి లంకె పెట్టి రీషేర్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ తప్పుదోవ పట్టించేటట్టు ఉందని మేము నిర్ధారించాము.

(అనువాదం- గుత్తా రోహిత్)

0 అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.