ద్వారా: రాహుల్ అధికారి
డిసెంబర్ 7 2023
ఈ వీడియో సన్నీ డియోల్ నటించిన రాబోయే చిత్రం సఫర్ షూటింగ్ లోనిది.
క్లెయిమ్ ఏమిటి?
నటుడు మరియు భారతీయ జనతా పార్టీ నాయకుడు సన్నీ డియోల్ ముంబై లోని జుహు సర్కిల్ ఏరియా లో మద్యం తాగి తిరుగుతున్నారు అంటూ ఒక వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో సన్నీ డియోల్ మత్తుగా ఒక ఆటో రిక్షా వైపుగా నడుతున్నట్టు కనిపిస్తుంది, సరిగ్గా నడవలేని స్థితిలో ఆయన ఆటో డ్రైవర్ సహాయం తీసుకుని ఆటో లో కూర్చున్నట్టు ఉంటుంది.
చాలా మంది ఈ వీడియోని ఎక్స్ (పూర్వపు ట్విట్టర్ ) లో షేర్ చేస్తూ, బి జె పి పార్లమెంట్ సభ్యుడు మద్యం మత్తులో ముంబై వీధుల్లో తిరుగుతున్నాడు అని రాసుకొచ్చారు. అలాంటి ఒక పోస్ట్ కు ఈ కథనం రాసే సమయానికి 8,700 పైగా వ్యూస్ ఉన్నాయి. వీడియో మీద, “సన్నీ డియోల్ మద్యం మత్తులో ఉన్నడా?” అని రాసి ఉంది. ఇదే వీడియోని షేర్ చేస్తూ, మరొకరు, “సన్నీ డియోల్ తాగి రోడ్డు మీరు చిందేస్తున్నాడు 😂👇👇” అని రాసి ఉంది. “సన్నీ డియోల్ కి ఏమైంది?” అని మరొక పోస్ట్. ఆర్కైవ్ చేసిన ఇలాంటి పోస్ట్స్ లను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
వైరల్ పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం : ఎక్స్ / లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
మరికొందరు ఈ వీడియోని షేర్ చేస్తూ, ఒక పార్లమెంట్ సభ్యుడు ఇలాగేనా ప్రవర్తించేది అంటూ కుడా కామెంట్లు చేసారు. “ఇది బిజెపి ఎం ఫై సన్నీ డియోల్, అయన తన నియోజకవర్గానికి వెళ్లారు అటు పార్లమెంట్ కి రారు. ఈసారి ఓటు వేసేటపుడు కాస్త తెలివిగా ఆలోచించి వేయండి” అని రాసుకొచ్చాడు. ఆ పోస్ట్ ఆర్కైవ్ ఇక్కడ చూడవచ్చు. డియోల్ పంజాబ్ లోని గుర్దాస్పూర్ నియోజకవర్గానికి సంబందించిన బిజెపి ఎం పి, అతని గద్దర్ 2 అనే హిందీ సినిమాలో ఇటీవలకనిపించారు.
అయినప్పటికీ ఆ నటుడు ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ అది ఒక చిత్రం లోని సన్నివేశం అని నిజమయిన ఘటన కాదు అని తెలిపారు.
మేము ఏమి కనుగొన్నము?
ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో చాలా చర్చకు దారి తీసింది, ఇది కొంతమంది కావాలని పబ్లిసిటీ కోసం చేస్తున్నారు అని కుడా అన్నారు. డిసెంబర్ 6 నాడు, డియోల్ తన ఎక్స్ అకౌంట్ లో ఈ విషయం గురించి స్పష్టత ఇస్తూ, తాను ఒక మద్యం తాగిన వ్యక్తి లాగే నటించే సన్నివేశాన్ని షేర్ చేశారు. ఈ వీడియో ని వేరే కోణం నుండి తీశారు, ఇందులో సెట్ లోని కెమెరా పర్సన్ లాంటి ఇతర వ్యక్తులు కుడా మనకి కనిపిస్తారు. అందులో ఒకరు సన్నీ డియోల్ కి క్యూ ఇవ్వడం కుడా మనం చూడవచ్చు. డియోల్ పెట్టిన పోస్ట్ కు హిందీ లో శీర్షిక గా ఇలా రాసుకొచ్చారు, “పుకార్ల ప్రయాణం ఇక్కడి వరకే” అని. ఈ వీడియో అతని రాబోయే, సఫర్ అనే సినిమా లోని సన్నివేశం అని కుడా తెలిసేటట్టు చేసారు.
మేము వైరల్ అవుతున్న వీడియోని మరియు సన్నీ డియోల్ షేర్ చేసిన వీడియోని పోల్చి చూసాము, ఆ రెండింటిలోనూ సన్నీ డియోల్ ఒకే రకమయిన దుస్తులు వేసుకున్నారు. రెండు వీడియోలలోను, ఆయన ఒక చేతికి బ్యాండ్ మరియు మరో చేతికి గడియారం ధరించారు. డియోల్ తన పోస్ట్ లో తెలిపినట్టుగానే ఇది షూటింగ్ లోనే తీసింది అని నిర్ధారణ అవుతుంది.
వైరల్ వీడియో మరియు సన్నీ డియోల్ షేర్ చేసిన వీడియోల మధ్య పోలిక. (సౌజన్యం: ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)
పి టి ఐ ఆధారంగా ది ప్రింట్ లో ప్రచురించిన కథనం ప్రకారం, సఫర్ అనే చిత్రం ఏచెలోన్ ప్రొడక్షన్ కంపెనీ తీస్తున్నారు . ఈ రిపోర్ట్ లో ఆ ప్రొడక్షన్ కంపెనీ లో పని చేసే, విశాల్ రానా అనే వ్యక్తి, ఈ వైరల్ క్లిప్ తమ రాబోయే చిత్రం సఫర్ లోనిదే అని నిర్ధారించారు. రానా తన ఇచ్చిన అధికారిక ప్రకటన లో, “వైరల్ అవుతున్న సన్నివేశం, సన్నీ గారు నటిస్తున్న సఫర్ అనే రాబోయే చిత్రం లోనిది. దయచేసి ఎవ్వరు ఈ వీడియో గురించి ఫేక్ వార్తలు షేర్ చేయొద్దు అని మేము అభిమానులను వేడుకుంటున్నాము,” అని అన్నారు .
తీర్పు:
నటుడు మరియు రాజకీయ నాయకుడు అయినటువంటి సన్నీ డియోల్ తన రాబోయే చిత్రం లో నటించిన సన్నివేశానికి సంబంధించిన వీడియో, తాను మద్యం మత్తులో జుహు ఏరియా లో తిరుగుతూ కనిపించారు అంటూ వైరల్ అయ్యింది. సన్నీ డియోల్ కుడా దీనిపై స్పష్టత ఇస్తూ, ఇది తన చిత్రం లోనిది అని చెప్పుకొచ్చారు. కనుక మేము దీనిని అబద్దం అని నిర్దారించాము.
(అనువాదం : రాజేశ్వరి పరస)