చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన యానిమేటెడ్ వీడియోని చంద్రయాన్-3 తీసిన ఫొటోలు అని షేర్ చేశారు

ద్వారా: రోహిత్ గుత్తా
ఆగస్టు 24 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన యానిమేటెడ్ వీడియోని చంద్రయాన్-3 తీసిన ఫొటోలు అని షేర్ చేశారు

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఈ ఫుటేజిలో మనకి కనిపించేది చంద్రుడి ఉపరితలం కాదు. 3డి యానిమేషన్ వాడి ఈ వీడియో చేశారు. దీనికి భారత చంద్రయానానికి సంబంధం లేదు.

క్లైమ్ ఐడి 837e429d

నేపధ్యం 

రాబోయే కొద్ది రోజులలో చంద్రయాన్-3 చంద్రుడి దక్షిణ ధ్రువం మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసే పరిస్థితులు మెండుగా ఉన్న సందర్భాన అంతరిక్షానికి సంబంధించి అనేక వీడియోలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. చంద్రుడి ఉపరితలానికి సంబంధించి ఒక 20 సెకన్ల క్లిప్ ఇది చంద్రయాన్-3 తీసిన వీడియో అనే క్లైమ్ తో సర్కులేట్ అవుతున్నది. 

“చంద్రయాన్-3 తీసిన చంద్రుడి ఫొటోలు ఇవి. అద్భుతంగా ఉన్నాయి. ఒక తీరుగా ఉండలేకపోతున్నా. దక్షిణ ధృవం మీద దిగటానికి ఇంకా మూడు రోజులే ఉన్నది- ఆగస్ట్ 23, సాయంత్రం 5:45 భారతీయ సమయం. అలాగే రష్యాకి చెందిన లూనా 25 కూడా సఫలీకృతం చెందాలని ప్రార్ధిస్తున్నాను”, అనే క్లైమ్ తో ఒకరు ఎక్స్ (ఇంతకమునుపు ట్విటర్) లో పోస్ట్ చేశారు. ‘#Chandrayaan-3’, ‘#Lune25’ అనే వైరల్ హాష్ ట్యాగ్లు కూడా  ఈ పోస్ట్ లో ఉన్నాయి. ఈ ఫ్యాక్ట్ చెక్ ప్రచురించే సమయానికి ఈ వీడియోకి నాలుగు లక్షలకి పైగా వ్యూస్, 975 రీపోస్ట్స్ ఉన్నాయి. 

చంద్రయాన్ -3 తీసిన భూమికి ఉన్న ఒకే ఒక్క సహజ శాటిలైట్ ఫొటోలని ఇస్రో ప్రజలకి అందుబాటులోకి తీసుకువచ్చిన మూడు రోజులకే ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వచ్చింది. 

(సౌజన్యం: ఎక్స్/VishalVerma_9/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఈ వీడియో చంద్రయాన్-3 తీసింది కాదు. 

వాస్తవం

ఈ వీడియోలోని కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే ఇదే వీడియో షట్టర్ స్టాక్ అనే వెబ్సైట్ లో కూడా దొరికింది. స్టాక్ ఫోటోస్, వీడియోస్ అమ్మే వెబ్సైట్ ఇది. “చాలా దగ్గరగా తీసిన చంద్రుడి ఉపరితలపు వీడియో ఇది. 3డి యానిమేషన్. ఈ వీడియోలో ఫొటోలని నాసా అందించింది”, అనే శీర్షికతో ఈ వీడియో ఉంది. ఈ వీడియో తయారుచేసింది ‘ఫ్లాష్ మూవీ’ అనే యూజర్ అని పేర్కొనబడి ఉంది. 

ఇదే వీడియోని మేము flashmovies.art అనే వెబ్సైట్లో కూడా కనుగొన్నాము. ఇక్కడ “చాలా దగ్గరగా తీసిన చంద్రుడి ఉపరితలపు వీడియో ఇది” అనే శీర్షికతో ఈ వీడియో ఉంది. షట్టర్ స్టాక్ వెబ్సైట్ లో ఉన్న వీడియో వివరాలే ఇందులో కూడా ఉన్నాయి. ఈ వెబ్సైట్ ‘మా గురించి’ సెక్షన్ లో ఈ వెబ్సైట్ సామాజిక మాధ్యమాల వివరాలు ఉన్నాయి. అందులో ఉన్న ట్విట్టర్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఎక్స్ లో ‘ఆండ్రే మస్లోవ్’ అనే అకౌంట్ కి డైవర్ట్ చేసింది. ఈ అకౌంట్ బయో లో “3డి, సిజి, మోషన్ డిజైన్” అని ఉంది. ఈ వెబ్సైట్, ఈ వెబ్సైట్ సామాజిక మాధ్యమాల అకౌంట్స్ చూస్తే ఇందులో అన్నీ 3డి యానిమేషన్, డిజిటల్ వీడియోలు ఉన్నాయి. వైరల్ పోస్ట్ లో పేర్కొన్న వీడియో 3డి యానిమేషన్ వీడియో అని, చంద్రయాన్-3 కి దానికి సంబంధం లేదని చెప్పటానికి ఇది ఇంకొక సాక్ష్యం. 

 

(షట్టర్ స్టాక్, వైరల్ వీడియోలోని స్క్రీన్ షాట్స్ మధ్య పోలిక (సౌజన్యం: షట్టర్ స్టాక్, ఎక్స్/ @VishalVerma_9)

 

వైరల్ వీడియోలో ఉన్న చంద్రుడి బొమ్మని పోలి ఉన్న బొమ్మే ఒకటి మాకు ఐ-స్టాక్ అనే వెబ్సైట్ లో దొరికింది. కాకపోతే ఆ వీడియోలో ఉన్న ఫొటోని అడ్డంగా తిప్పితే ఏ పోసిషన్లో ఉంటుందో ఈ ఫొటో అలా ఉంది. ఐ-స్టాక్ అనేది కూడా స్టాక్ ఫొటోలు అమ్మే మరొక వెబ్సైట్. ఈ ఫొటోని ఈ వెబ్సైట్ లో డిసెంబర్ 3, 2020 నాడు పోస్ట్ చేశారు. ఇక్కడ ఈ ఫొటో సౌజన్యం కూడా ‘ఫ్లాష్ మూవీ’ అనే ఇచ్చారు. 

తీర్పు 

చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన 3డి యానిమేషన్ వీడియోని చంద్రయాన్-3 తీసిన ఫొటోలు అని తప్పుగా షేర్ చేస్తున్నారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని నిర్ధారిస్తున్నాము. 

 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , অসমীয়া , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.