కాంగ్రెస్ హయాంలోనే గ్యాస్ సిలిండర్ ధర ఎక్కువంటూ చేసిన క్లైమ్స్ తప్పుదోవ పట్టించేటట్టు ఉన్నాయి

ద్వారా: రోహిత్ గుత్తా
సెప్టెంబర్ 7 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
కాంగ్రెస్ హయాంలోనే గ్యాస్ సిలిండర్ ధర ఎక్కువంటూ చేసిన క్లైమ్స్ తప్పుదోవ పట్టించేటట్టు ఉన్నాయి

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

వైరల్ పోస్ట్ లో పేర్కొన్న ధర రాయితీ బయట ధర. కాంగ్రెస్ హయాంలో రాయితీతో సరఫరా చేసిన గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుత ధరల కన్నా తక్కువ.

క్లైమ్ ఐడి 3cc4ac59

క్రితం వారం భారత ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర 200 రూపాయలు తగ్గించింది. అలాగే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకి పైన ఇంకొక 200 రూపాయలు తగ్గించింది. అంటే ఈ లబ్ధిదారులకి మొత్తం 400 రూపాయలు ప్రతి సిలిండర్ కి తగ్గింది. 

క్లైమ్ ఏంటి?

ప్రభుత్వ ప్రకటన తరువాత సామాజిక మాధ్యమాలలో చాలా మంది 14.2 కిలోల సిలిండర్ ప్రస్తుతం 903 రూపాయలు కాగా కాంగ్రెస్ అధికారం ఉన్న సమయంలో జనవరి 2014 లో 1241 రూపాయలు ఉండేది అని పోస్టులు పెట్టారు. ఇలా పోస్టులు పెట్టినవారిలో అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ, బిజెపి అధికార ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) హ్యాండిల్ కూడా ఉన్నారు. హిమంత బిశ్వ శర్మ, బిజెపి అధికారిక హ్యాండిల్ ప్రకారం తొమ్మిదేళ్ల క్రిందట అంటే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే సిలిండర్ ధర ఎక్కువ. 

ఈ ఫ్యాక్ట్ చెక్ ప్రచురించే సమయానికి హిమంత బిశ్వ శర్మ పోస్ట్ ఒక్కదానికే 14 లక్షల వ్యూస్, 5100కి పైగా రీపోస్ట్స్ ఉన్నాయి. 

ఎక్స్ లో తప్పుడు సమాచారం షేర్ చేసే చరిత్ర ఉన్న ‘మిస్టర్ సిన్హా’ అనే యూజర్ కూడా ఇటువంటి కథానాన్నే ప్రచారం చేస్తూ, ఇప్పుడు ఎల్ పి జి సిలిండర్ ధర 1050 రూపాయలు అని..”తొమ్మిదేళ్ల తరువాత కూడా కాంగ్రెస్ కన్నా తక్కువ ధరకే బిజెపి సిలిండర్లని అందిస్తున్నది”, అని రాసుకొచ్చారు. 

ఎక్స్ లో వైరల్ అయిన పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం:ఎక్స్/@himantabiswa,@BJP4India,@MrSinha_/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఈ పోస్ట్స్ తప్పుదోవ పట్టించేటట్టు ఉన్నాయి.

అధికారిక సమాచారం మనకి ఏమి చెబుతుంది?

భారతదేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్  సంస్థలలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒకటి. ఈ సంస్థ వెబ్సైట్ లో ఉన్న సమాచారం ప్రకారం వైరల్ పోస్ట్ లో పేర్కొన్న 1241 రూపాయల ధర అనేది దిల్లీలో జనవరి 1, 2014 నాటి రాయితీ లేని గ్యాస్ సిలిండర్ ధర. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో జనవరి 1, 2014 నాడు వచ్చిన ఒక కథనం ప్రకారం జనవరి 2014లో దిల్లీలో రాయితీతో కూడిన సిలిండర్ ధర 414 రూపాయలు.

ఇదే విషయాన్ని కేంద్ర చమురు మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖకి చెందిన పెట్రోలియం ప్రైసింగ్ అండ్ అనాలిసిస్ సెల్ వారి 2018 నివేదిక కూడా ఇదే సమాచారాన్ని ధృవీకరిస్తుంది. ఈ నివేదిక ప్రకారం డిసెంబర్ 11, 2013 నాడు దిల్లీలో రాయితీ లేని గ్యాస్ సిలిండర్ ధర 1021 రూపాయలు, అలాగే జనవరి 1, 2014 నాడు 1241 రూపాయలు. అయితే వినియోగదారులు కట్టిన ధర మాత్రం 414 రూపాయలు. 

ఎల్ పి జి సిలిండర్లని రాయితీతో కూడిన ధరతో ప్రభుత్వం 2002 నుండి సరఫరా చేస్తున్నది. ఇలా రాయితీతో సరఫరా చేసినందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లాంటి చమురు సంస్థలకి ప్రభుత్వం పరిహారం అందిస్తుంది. అంతర్జాతీయ చమురు ధరల ఆధారంగా దేశంలో ఇచ్చే రాయితీ మారుతూ వస్తున్నది. 

కాంగ్రెస్ బిజెపి పాలనలో ఎల్ పి జి రాయితీ 

2022 నుండి మొదలుకుని ఒక ఇంటిల్లపాదికి సంవత్సరానికి ఆరు సిలిండర్లు రాయితీ మీద అందించేవారు. కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2013లో ఈ సంఖ్యని తొమ్మిదికి పెంచింది. అయితే జూన్, 2013 నుండి డైరక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డిబిటి) పధకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పధకం ప్రకారం వినియోగదారులు తమ సిలిండర్లని పూర్తి ధరకే కొనుగులు చేస్తారు. ఆ తరువాత రాయితీ మొత్తాన్ని ఆయా వినియోగదారుల బ్యాంకు  ఖాతాలోకి ప్రభుత్వం నేరుగా జమ చేస్తుంది. 

పైన పేర్కొన్న నివేదిక ప్రకారం జూన్ 2013 నుండి కనీసం జనవరి 2014 వరకు- అనగా కాంగ్రెస్ హయాంలో- అసలు సిలిండర్ ధర 410 రూపాయల నుండి 414 రూపాయల మధ్యలో ఉండింది. ఈ ధరకి సంవత్సరానికి ఒక ఇంటిల్లపాదికి తొమ్మిది సిలిండర్లు వచ్చేవి. 

మే 2014లో బిజెపి అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత రెండు సంవత్సరాలకి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అనే పధకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పధకం ప్రకారం ఈ పధకానికి అర్హులైన లబ్ధిదారులకి ఉచిత ఎల్ పి జి కనెక్షన్లు ఇచ్చింది. లబ్ధిదారులని ప్రాంతం, ఆదాయం లాంటి వాటి ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. అదే విధంగా డిబిటి ద్వారా రాయితీతో అందుకునే సిలిండర్లు సంఖ్య కూడా ఈ ఉజ్వల యోజన లబ్ధిదారులకి 12కి పెంచారు. 

అయితే సిలిండర్ మీద రాయితీ ఇచ్చే వ్యవస్థని బిజెపి ప్రభుత్వం జూన్ 2020లో పూర్తిగా రద్దు చేసింది. దానితో అందరూ మార్కెట్ ధరకే సిలిండర్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దరిమిలా చమురు ధరలు పెరగడంతో మే 2022 నుండి ఉజ్వల యోజన లబ్ధిదారులకి మాత్రం సిలిండర్ మీద 200 రూపాయలు రాయితీ ప్రకటించింది. ఈ విషయం జాతీయ మీడియాలో  విస్తృతంగా వచ్చింది. 

ఎల్ పి జి ధరలని ఎలా లెక్కిస్తారు?

ఎల్ పి జి ధరలో కీలక భూమిక పోషించేది ఫ్రీ-ఆన్-బోర్డ్ (ఎఫ్ఓబి) అరబ్ గల్ఫ్ ధర. అంటే మన దేశానికి ఎల్ పి జి ఎక్కడ నుండి దిగుమతి అవుతున్నదో అక్కడి ధర అన్నమాట. భారతదేశం చాలావరకు తన ఎల్ పి జిని దిగుమతి చేసుకుంటుంది. ఈ ధరకి రవాణా ఖర్చు, బీమా, గిడ్డంగుల ఖర్చు, సరఫరా, బాట్లింగ్ ఖర్చు, స్థానిక రవాణా ఖర్చు, డీలర్ కమీషన్, జిఎస్టి ఇతరత్రా అదనం. వీటన్నిటిని కలిపితే వచ్చే ధరే మార్కెట్ లేదా రిటైల్ ధర. అంటే మనం సిలిండర్ కొనుక్కునే ధర. ఈ మార్కెట్ ధరకి, వినియోగదారులు కట్టే అసలు ధర మధ్య ఉండే వ్యత్యాసాన్ని ప్రభుత్వం, చమురు సంస్థలు భరిస్తాయి. వివిధ రాష్ట్రాలలో సిలిండర్ ధర వేరు వేరుగా ఉంటుంది. ఈ ధర ఆయా రాష్ట్రాల దూరం, డీలర్ కమీషన్ ఇలాంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది. 

ఎఫ్ఓబి ధర ఎలా మారుతా వస్తున్నది?

పైన చెప్పుకున్నట్టు ఎల్ పి జి సిలిండర్ మార్కెట్ ధరలో ఎఫ్ఓబి భాగం చాలా ఎక్కువే. 2012-2023 నుండి 2023-24 (జులై వరకు) ఎఫ్ఓబి ధర ఎలా మారుతా వస్తుందో ఈ కింద పట్టికలో ఇచ్చాము. 

పెట్రోలియం ప్రైసింగ్ అండ్ అనాలిసిస్ సెల్ వారి రెడీ రెకనార్ నివేదికల నుండి ఈ సమాచారం సేకరించాము

పై పట్టికలో చూసినట్టు 2012-13, 2013-14లలో ఎఫ్ఓబి ధర చాలా ఎక్కువగా ఉంది. ఈ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చివరి రెండు సంవత్సరాలు కూడా. అప్పటినుండి ఈ ఎఫ్ఓబి ధర తక్కువగానే ఉంటూ వచ్చింది. ఉదాహరణకి, జులై 2023లో ఎఫ్ఓ బి ధర 2013-14 ధరలో కేవలం 43.7% మాత్రమే. ఈ కారణంగానే జనవరి 2014లో రాయితీ లేని సిలిండర్ ధర 1241 రూపాయలకు చేరింది. జులై-ఆగస్ట్ 2023లో (తాజా రాయితీకి ముందు) రాయితీ లేని సిలిండర్ ధర 1013 రూపాయలు ఉండేది. 

తీర్పు

వైరల్ పోస్ట్ లో పేర్కొన్న ధర జనవరి 2014లో దిల్లీలో రాయితీ లేని సిలిండర్ ధర. అయితే వినియోగదారులు కట్టిన అసలు ధర (తొమ్మిది సిలిండర్ల వరకు) మాత్రం సిలిండర్ కి 414 రూపాయలు మాత్రమే. ప్రస్తుతం అదే సిలిండర్ ధర అదే దిల్లీలో కొంత మందికి 903 రూపాయలు కాగా ఉజ్వల యోజన లబ్ధిదారులకి 703 రూపాయలు. కాబట్టి ఈ క్లైమ్ తప్పుదోవ పట్టించేటట్టుగా ఉండని మేము నిర్ధారించాము. 

అనువాదం- గుత్తా రోహిత్ 

 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

অসমীয়া , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.